‘తొలిమెట్టు’ టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుపై ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం

తొలిమెట్టు కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించడానికి జిల్లా అకడమిక్‌ టాస్క్‌ఫోర్స్‌(డీఏటీఎఫ్‌) బృందాలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను పలు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Published : 25 Nov 2022 05:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: తొలిమెట్టు కార్యక్రమ నిర్వహణ తీరును పరిశీలించడానికి జిల్లా అకడమిక్‌ టాస్క్‌ఫోర్స్‌(డీఏటీఎఫ్‌) బృందాలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను పలు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వివిధ హోదాల్లో అధికారులు పరిశీలిస్తున్నారని.. మళ్లీ టాస్క్‌ఫోర్స్‌ను నియమించడం, అందులో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులనూ సభ్యులుగా చేర్చడం ఉపాధ్యాయులను అవమానపరిచినట్లేనని సంఘాల నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. తాజా ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని, రెండో విడత పుస్తకాలను పూర్తిస్థాయిలో అందించాలని పీఆర్‌టీయూటీఎస్‌ డిమాండ్‌ చేసింది. ఉపాధ్యాయుల కొరత లాంటి మౌలిక సమస్యలను పరిష్కరించకుండా తొలిమెట్టు అమలు ఎలా సాధ్యమవుతుందని టీఎస్‌యూటీఎఫ్‌ ప్రశ్నించింది. ఇప్పటివరకు పాఠశాల నిర్వహణ నిధిని విడుదల చేయలేదని విమర్శించింది. సాధారణంగా నేర నియంత్రణ కోసమే టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఉంటాయని, విద్యారంగంలోనూ వీటిని ఏర్పాటు చేయడం సరికాదని ఎస్‌టీయూటీఎస్‌ పేర్కొంది. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు ఉత్తర్వులను నిలిపివేయాలని ఎస్‌జీటీయూ, ఎస్‌జీటీ ఫోరమ్‌ డిమాండ్‌ చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని