కోడికి.. మేతా కష్టమాయె..!

కోళ్ల పెంపకం భారమై, మండుతున్న దాణా ధరలతో నష్టాలు వస్తున్నాయని పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు.

Published : 25 Nov 2022 05:27 IST

మండుతున్న మక్క, సోయా దాణా ధరలు
పెంపకందారులపై ఆర్థికభారం
బ్యాంకు రుణాలు కట్టలేక
ఎగవేతదారుల జాబితాలోకి ఫారాలు

ఈనాడు, హైదరాబాద్‌: కోళ్ల పెంపకం భారమై, మండుతున్న దాణా ధరలతో నష్టాలు వస్తున్నాయని పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఒక్కో కోడి పెంపకంపై రూ.100 వరకూ నష్టపోయినట్లు తెలంగాణ రాష్ట్ర కోళ్లఫారాల సమాఖ్య తాజా అధ్యయనంలో వెల్లడించింది. పెంపకం ఖర్చులు పెరుగుతున్నాయని కోడిమాంసం, కోడిగుడ్డు ధరలు పెంచితే వాటి అమ్మకాలు పడిపోతున్నాయని సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తోంది. నష్టాల నుంచి కోళ్లఫారాలను గట్టెక్కించేందుకు.. దేశీయ సాధారణ మొక్కజొన్న, సోయా పంటలను కోళ్ల ఫారాలకు, మానవ వినియోగానికే పరిమితం చేయాలని కోళ్ల పరిశ్రమ వర్గాలు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాయి. భారత్‌లో పండే ఈ పంటల్లో 20 నుంచి 30 శాతాన్ని ఇథనాల్‌, స్టార్చ్‌ పరిశ్రమలకు మళ్లిస్తున్నారు. ఫలితంగా కోళ్ల దాణాకు కొరత ఏర్పడి ధరలు ఎగసిపడుతున్నట్లు పౌల్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇథనాల్‌, స్టార్చ్‌ పరిశ్రమల ఉత్పత్తులను మనుషులు తినేందుకు వినియోగించరు.. ఆ పరిశ్రమల కోసం విదేశాల్లో జన్యుమార్పిడి(జీఎం) విత్తనాలతో పండించిన మొక్కజొన్న, సోయా పంటల దిగుమతికి అనుమతిస్తే కోళ్ల పరిశ్రమల సమస్య తీరుతుందని అంచనా. వివిధ దేశాల్లో జీఎం విత్తనాలతో ఈ పంటలు పండిస్తున్నందున అంతర్జాతీయ మార్కెట్‌లో తక్కువ ధరలకే లభిస్తున్నాయని కోళ్లపరిశ్రమ కేంద్రానికి తెలిపింది. ఇథనాల్‌ ఉత్పత్తి, ఇతర పరిశ్రమల్లో వినియోగానికి జీఎం మక్క, సోయా అనుమతించకపోతే కోళ్లకు మనదేశంలో దాణా దొరక్క ఫారాలను మూసివేయాల్సిన పరిస్థితి రావచ్చని పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం టన్ను సోయాచిక్కుడు దాణా ధర సుమారు రూ.50వేలు, మొక్కజొన్న టన్ను రూ.23వేలు పలుకుతోంది. గతేడాది ఇదే సమయంలో ఇంతవరకూ ఐదారువేలు తక్కువకు లభించేది. గత జూన్‌ నుంచి వానాకాలంలో తెలంగాణలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 8.18 లక్షల ఎకరాలకు           6.21 లక్షల ఎకరాల్లోనే సాగవడంతో ఇప్పుడు కోళ్ల దాణా కొనాలంటే భారంగా మారిందని పరిశ్రమ వర్గాలు వివరించాయి.

ఎగవేతదారుల జాబితాలో చేరుస్తున్నారు..

ఇప్పటికే పలు కోళ్ల ఫారాల ఏర్పాటుకు తీసుకున్న రుణాలను తిరిగి కట్టలేకపోవటంతో కొందరు పెంపకందారులను బ్యాంకులు ఎగవేతదారుల(ఎన్‌పీఏ) జాబితాలో చేరుస్తున్నాయని తెలంగాణ కోళ్ల ఫారాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ‘ఈనాడు’కు చెప్పారు. ప్రభుత్వాల నుంచి సాయం అందకపోతే కోళ్లఫారాలను ఎలా నడపగలమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయం మాదిరిగానే రాయితీలిచ్చి ఈ రైతులను ఆదుకోవాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు. ఒక కోడిగుడ్డు ఉత్పత్తికి రూ.4 దాకా వ్యయమవుతోందని, ఆ ధర కూడా కోళ్ల ఫారాలకు రావడం లేదని ఆయన వివరించారు. జాతీయస్థాయిలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి బోర్డు ఏర్పాటుచేయాలని కోరారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts