ఊరిస్తున్న వేతన సవరణ

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను అయిదేళ్లుగా వేతన సవరణ ఊరిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వారిలో ఆశలు రేకెత్తాయి.

Published : 25 Nov 2022 05:27 IST

అయిదేళ్లుగా ఆర్టీసీ ఉద్యోగుల ఎదురుచూపులు  
త్వరలో ప్రకటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌!

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను అయిదేళ్లుగా వేతన సవరణ ఊరిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వారిలో ఆశలు రేకెత్తాయి. తక్షణం వేతన సవరణను అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాసింది. ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అభ్యంతరాలపైనా ఆగమేఘాలపై స్పందించింది. దీంతో వేతన సవరణ కార్యరూపంలోకి వచ్చినట్లేనని ఉద్యోగులు సంబరపడ్డారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఇటు యాజమాన్యం నుంచి, అటు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటంతో వారిలో అయోమయం నెలకొంది. వేతన సవరణను తక్షణం అమలు చేస్తారా? 2023 సాధారణ ఎన్నికల వరకూ వేచిఉండాలా? అని బహిరంగంగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

2013 తర్వాత రెండుసార్లు చేయాల్సి ఉన్నా..

వాస్తవానికి ఆర్టీసీలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వేతనాలు సవరించడం ఆనవాయితీ. చివరిసారిగా 2013లో వేతన సవరణ ప్రకటించారు. ప్రకటన తర్వాత రెండు నుంచి రెండున్నర సంవత్సరాల వ్యవధిలో అమలు చేస్తుంటారు. 2013లో కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాన్ని 2015 నుంచి అమలులోకి తీసుకువచ్చారు. 2013 తరవాత రెండు సార్లు -2017 ఏప్రిల్‌, 2021 ఏప్రిల్‌లో- వేతన సవరణ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి 2017కు సంబంధించిన వేతన సవరణను మాత్రమే అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తాత్కాలిక భృతి కింద 16 శాతం చెల్లిస్తున్నారు. వేతనాలను ఎంత శాతం పెంచాలో ఇంకా నిర్ణయించలేదు. ఎంత మొత్తాన్ని ప్రకటించినా.. తాత్కాలిక భృతిని మినహాయించి మిగిలిన సొమ్ము చెల్లిస్తారు. సంస్థలో 46 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. నెలకు సుమారు రూ.425 కోట్ల వరకు వేతనాల కింద చెల్లిస్తున్నారు. పీఎఫ్‌తోపాటు అన్ని రకాల మినహాయింపులు పోను నెలకు సుమారు రూ.150 కోట్ల వరకు నికరంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. తాత్కాలిక భృతిని మినహాయిస్తే నెలకు సుమారు రూ.30 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఇది పెద్ద భారం కాదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ‘‘వేతన సవరణ లేక ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటలు సేవలందించే సంస్థలో ఇతర శాఖలతో పోలిస్తే జీతాలు తక్కువగా ఉన్నాయి. తక్షణం వేతన సవరణ అమలు చేయాలి’’ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

స్వయంగా సీఎం ప్రకటన!

వేతన సవరణ అమలుపై అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు. అమలు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ముఖ్యమంత్రి నుంచి సూత్రప్రాయ ఆమోదాన్ని పొందినట్లు అధికారుల సమాచారం. ఉప ఎన్నిక సమయంలోనే నిర్ణయం వెలువడుతుందని ఉద్యోగులు ఆశించినా.. అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా సమీక్ష నిర్వహించి.. అమలును ప్రకటిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నెలాఖరులోగా ఆర్టీసీ వ్యవహారాలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.


ఏడాదికి రూ.480 కోట్ల భారం
- బాజిరెడ్డి గోవర్ధన్‌, ఛైర్మన్‌, తెలంగాణ ఆర్టీసీ

వేతన సవరణను అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలపై ఏడాదికి అదనంగా రూ.480 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజువారీ ఆదాయంలో కొంత తగ్గుదల నమోదవుతోంది. ప్రస్తుతం రూ.13 కోట్ల నుంచి రూ.14 కోట్ల మధ్యే వస్తోంది. వేతన సవరణ అమలు ఆర్టీసీకి భారమైనా ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. త్వరలో ముఖ్యమంత్రి నుంచి అనుమతి లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని