బోరు వేయాలంటే.. భారం

వ్యవసాయ బోరుబావుల తవ్వకం రైతులకు భారంగా మారుతోంది. పంటలు సరిగా పండక, గిట్టుబాటు ధరలు లభించక నష్టాలపాలవుతుంటే.. మరోవైపు పెరిగిన డీజిల్‌, సామగ్రి ధరల కారణంగా బోరుబావులను తవ్వించడం కష్టసాధ్యమవుతోందని రైతులు వాపోతున్నారు.

Published : 26 Nov 2022 06:11 IST

పెరిగిన డీజిల్‌, సామగ్రి ధరలు
ఒక్కో బోరుబావికి రూ. 2 లక్షలకు పైగా ఖర్చు!
నష్టపోతున్న అన్నదాత

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ బోరుబావుల తవ్వకం రైతులకు భారంగా మారుతోంది. పంటలు సరిగా పండక, గిట్టుబాటు ధరలు లభించక నష్టాలపాలవుతుంటే.. మరోవైపు పెరిగిన డీజిల్‌, సామగ్రి ధరల కారణంగా బోరుబావులను తవ్వించడం కష్టసాధ్యమవుతోందని రైతులు వాపోతున్నారు. పంటలను కాపాడుకోవాలన్న ఆరాటంతో కొందరు అన్నదాతలు బోర్లు వేయడం కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద ఇళ్లు, భూములు తాకట్టు పెడుతున్నారు. మరికొందరు రూ. లక్షల్లో అప్పులు చేస్తున్నారు.

ప్రాజెక్టులు, చిన్ననీటి వనరులు అందుబాటులో లేని ప్రాంతాల రైతులు ఎక్కువగా బోరుబావులపై ఆధారపడే పంటలు సాగు చేస్తున్నారు. మరికొందరు అదనపు సాగునీటి కోసం వాటిని తవ్విస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం రాష్ట్ర రైతులు ఏటా లక్షకు పైగా బోరుబావులు తవ్విస్తున్నారని అంచనా. కొన్నిప్రాంతాల్లో కనీసం 500 అడుగుల లోతు వరకు తవ్విస్తేగానీ నీరు ఉబికిరావడంలేదు. వాటికి విద్యుత్‌ మోటారు బిగించి, కనెక్షన్‌ తీసుకోవడానికి రూ.2 లక్షలకు పైగా ఖర్చు అవుతోంది. ప్రస్తుతం డీజిల్‌, కూలి, విద్యుత్‌ మోటార్లు, పైపులు, ఇతర సామగ్రి ధరలు పెరగడంతో వీటి తవ్వకం ఖర్చు గత కొన్నేళ్లతో పోల్చితే చాలా ప్రాంతాల్లో 30 నుంచి 40 శాతం వరకు పెరిగింది.

ఏటా లక్ష కొత్త కనెక్షన్లు

విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల లెక్కల ప్రకారం.. తెలంగాణ ఏర్పడిన ఏడాది రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 26.20 లక్షలకు చేరింది. తెలంగాణ ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలో ఏటా సగటున లక్ష  కొత్త బోర్లకు అదనంగా విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చినట్లు డిస్కం తాజా నివేదికలో వెల్లడైంది. ఒక బోరుకు కొత్తగా కరెంటు కనెక్షన్‌ ఇవ్వడానికి డిస్కం సొంతంగా రూ.70 వేల వరకు ఖర్చుపెడుతుంది. రైతు పొలం, బోరు విద్యుత్‌ లైను, ట్రాన్స్‌ఫార్మర్‌కు దూరంగా ఉంటే కనెక్షన్‌ ఇవ్వడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ అదనపు ఖర్చును రైతే భరించాల్సి ఉంటుంది. రైతులకు కరెంటు ఖర్చులు భారమవుతున్నాయని భావించిన కేంద్రం ప్రభుత్వం.. వ్యవసాయ బోర్లకు సౌరవిద్యుత్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇటీవల ప్రధానమంత్రి కుసుమ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, రైతులే సొంతంగా సౌరఫలకాలను ఏర్పాటు చేసుకోవాలి. అందుకు రూ.లక్షన్నర వరకు ఖర్చుఅవుతుంది. అంతమొత్తంలో భరించడానికి అన్నదాతలు ముందుకు రావడం లేదు. సాధారణ కరెంటు కనెక్షన్‌కు డిస్కం రూ.70 వేల వరకు భరిస్తుండటంతో దీనివైపే మొగ్గుచూపుతున్నారు.

అప్పు తెచ్చి తవ్వించా..

పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు బానోత్‌ రాజు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం వర్ధవానిచెరువు తండాకు చెందిన రాజు తన రెండెకరాల పొలంలో పంటల సాగుకోసం నెల రోజుల క్రితం 450 అడుగుల లోతులో బోరుబావి తవ్వించారు. ఇందు కోసం రూ.2 లక్షలు అప్పు చేశారు. తనకున్న కాస్త పొలంలో పంటలు సాగు చేసి వచ్చిన దిగుబడితో అప్పు తీర్చడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదని వాపోయారు.


పంటలు పండితేనే అప్పు తీరేది..

నాకు రెండెకరాల భూమి ఉంది. అందులో బోరుబావి తవ్వించి విద్యుత్‌ మోటారు బిగించడానికి రూ.1.25 లక్షలు ఖర్చయింది. బోరు ఉన్న పొలం వరకు మరో రెండు కరెంటు స్తంభాలు వేయాల్సి ఉంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కర్రలపై విద్యుత్‌ తీగలు వేసి బోరు బావిని నడిపిస్తున్నా. ఇంత కష్టపడి వ్యవసాయం చేసినా.. పంటలు బాగా పండితేగానీ అప్పు తీరదు

- ఇందు సంజీవ, రైతు, హమీదుల్లనగర్‌, రంగారెడ్డి జిల్లా


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు