ఎమ్మెల్యేలకు ఎర కేసులో.. బీఎల్‌ సంతోష్‌కు ఊరట

ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26 లేదా 28న విచారణకు హాజరు కావాలంటూ తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు సంస్థ బృందం (సిట్‌) జారీ చేసిన నోటీసుల అమలును తదుపరి విచారణ జరిగే డిసెంబరు 5వ తేదీ వరకు నిలిపివేసింది.

Published : 26 Nov 2022 03:46 IST

డిసెంబరు 5 వరకు సిట్‌ నోటీసుల నిలిపివేత
సెక్షన్‌ 41ఏ సీఆర్‌పీసీ కింద న్యాయనిబంధనలు పాటించలేదన్న హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26 లేదా 28న విచారణకు హాజరు కావాలంటూ తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు సంస్థ బృందం (సిట్‌) జారీ చేసిన నోటీసుల అమలును తదుపరి విచారణ జరిగే డిసెంబరు 5వ తేదీ వరకు నిలిపివేసింది. బీఎల్‌ సంతోష్‌కు సెక్షన్‌ 41ఏ సీఆర్‌పీసీ కింద ఇచ్చిన నోటీసులో ప్రాథమికంగా కొన్ని అవసరాలు, అంశాలు కనిపించడం లేదని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేందర్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, సెక్షన్‌ 41ఏ సీఆర్‌పీసీ కింద ఇచ్చిన నోటీసు రద్దు చేయాలని కోరుతూ పిటిషనర్‌ తరఫున ఆయన న్యాయవాది శుక్రవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నోటీసుదారుడికి వ్యతిరేకంగా ఫిర్యాదు అందినపుడు, సహేతుకమైన కారణాలు, అనుమానం, అతనికి వ్యతిరేకంగా సమాచారం లభించినపుడు దర్యాప్తు సంస్థ సెక్షన్‌ 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసు ఇచ్చేందుకు వీలుంటుందని, ఈ వివరాలు లేనపుడు అలా నోటీసులు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు వెల్లడించింది. సంతోష్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. సిట్‌ నోటీసుల్లో సెక్షన్‌ 41ఏ సీఆర్‌పీసీ న్యాయనిబంధనలు పాటించలేదని, ఆ నోటీసులను రద్దు చేయాలని కోరారు. ‘ప్రత్యేక దర్యాప్తు సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే పిటిషనర్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయి. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రాథమిక ఆధారాలు లేకుండా పిటిషనర్‌ను దోషిగా, అనుమానితుడిగా పేర్కొంటూ దర్యాప్తు అధికారి యాంత్రికంగా ఈ నోటీసు జారీ చేశారు. దర్యాప్తు సంస్థ నేరుగా రాష్ట్ర ప్రభుత్వం వల్ల ప్రభావితమై పనిచేస్తోంది. పిటిషనర్‌ను రాజకీయంగా వేధించేందుకే ఈ కేసు నమోదు చేసింది. ఈ దర్యాప్తు సంస్థతో పారదర్శకమైన విచారణ జరగదు. సీఎం స్థాయి వ్యక్తి తన రాజకీయ ప్రయోజనాల కోసం విచారణలో జోక్యం చేసుకుంటున్నారు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. బీఎల్‌ సంతోష్‌కు వ్యతిరేకంగా కీలకమైన సమాచారం సిట్‌కు లభించిందని ఏజీ హైకోర్టుకు తెలిపారు. వాదోపవాదాల అనంతరం.. హైకోర్టు తదుపరి విచారణను డిసెంబరు 5కు వాయిదా వేసింది. అప్పటివరకు సిట్‌ జారీ చేసిన నోటీసు అమలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. అంతకు ముందు విధించిన రిమాండ్‌ గడువు ముగియడంతో రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజిలను సిట్‌ అధికారులు శుక్రవారం ఉదయం అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. డిసెంబరు 9 వరకు కోర్టు రిమాండ్‌ విధించగా.. ముగ్గురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని