ఐటీ అధికారిపై కేసులో నాలుగు వారాల స్టే

మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇళ్లు, సంస్థల్లో సోదాల నేపథ్యంలో నమోదైన కేసులో ఆదాయపన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్‌కు ఊరట లభించింది.

Updated : 26 Nov 2022 05:55 IST

తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇళ్లు, సంస్థల్లో సోదాల నేపథ్యంలో నమోదైన కేసులో ఆదాయపన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రత్నాకర్‌కు ఊరట లభించింది. మంత్రి తనయుడు డా.భద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసిన కేసులో నాలుగు వారాలపాటు తదుపరి చర్యలు నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. సోదాల అనంతరం వాంగ్మూలంపై తన సోదరుడు మహేందర్‌రెడ్డితో.. ఐటీ అధికారి రత్నాకర్‌ బలవంతంగా సంతకం తీసుకున్నారంటూ డా.భద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీ 384 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని కొట్టివేయాలంటూ రత్నాకర్‌ శుక్రవారం హైకోర్టులో క్రిమినల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కొంపల్లి పామ్‌ మెడోస్‌లోని మల్లారెడ్డి ఇంట్లో ఆదాయపన్ను చట్టం సెక్షన్‌ 132 ప్రకారమే సోదాలు నిర్వహించామని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకిరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఐటీ చట్టంలోని 134 సెక్షన్‌ ప్రకారం సోదాల అనంతరం వాంగ్మూలం నమోదు చేసే అధికారం తమకు ఉందన్నారు. ఐటీ అధికారి చిత్తశుద్ధితో తన అధికారిక విధిని నిర్వర్తించినప్పుడు ప్రాసిక్యూషన్‌ చేయడాన్ని ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 293 నిషేధిస్తుందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఐటీ అధికారి తన అధికారిక విధులకు అతీతంగా వ్యవహరించారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సి.ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపించారు. బలవంతంగా వాంగ్మూలం నమోదు చేశారని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విని.. రత్నాకర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేందర్‌ తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగువారాల పాటు స్టే విధిస్తూ అప్పటిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదుల్ని ఆదేశించారు.

మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారిపై కేసులు.. మళ్లీ నమోదు

మంత్రి మల్లారెడ్డి, ఆదాయపన్ను శాఖ డిప్యూటీ డైరక్టర్‌ రత్నాకర్‌ పరస్పరం చేసుకున్న ఫిర్యాదులపై బోయిన్‌పల్లి ఠాణాలో నమోదైన జీరో ఎఫ్‌ఐఆర్‌లకు అనుగుణంగా దుండిగల్‌ పోలీసులు కేసులను రీ రిజిస్టర్‌ చేశారు. ఘటన జరిగిన సూరారం మల్లారెడ్డి ఆసుపత్రి దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండడంతో కేసులను అక్కడికి బదిలీ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులకు సంబంధించి ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని సీఐ రమణారెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన నాటకీయ పరిణామాల్లో మంత్రి అనుచరుడు బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ప్రధానద్వారం వద్ద వదిలి వెళ్లిన ల్యాప్‌టాప్‌ ఇప్పటికీ పోలీసుల వద్దే ఉంది. ల్యాప్‌టాప్‌ తమదని ఎవరైనా ముందుకొస్తే దర్యాప్తు చేసి.. వారికి ఇస్తామని, లేకపోతే కొద్దిరోజులు చూసి ఎవరికీ చెందనిదిగా భావించి న్యాయస్థానానికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని