ఎస్టీ జాబితాలోకి వాల్మీకి బోయలు!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వాల్మీకి బోయ సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, ఆబ్కారీ శాఖల మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

Published : 26 Nov 2022 03:46 IST

వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లుపై మంత్రుల సమీక్ష

ఈనాడు,హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వాల్మీకి బోయ సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, ఆబ్కారీ శాఖల మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. చెల్లప్ప కమిషన్‌ సిఫార్సుల మేరకు తెలంగాణలోని వాల్మీకి బోయ సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు న్యాయపరమైన అంశాలపై చర్చించినట్లు మంత్రులు వెల్లడించారు. ప్రస్తుతం ఎస్టీ జాబితాలో ఉన్న సామాజికవర్గాలకు ఇబ్బందులు లేకుండా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా న్యాయశాఖ క్షుణ్నంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. బిల్లు ఆమోదం పొందిన తరువాత కేంద్ర ప్రభుత్వ సిఫార్సులకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులు న్యాయశాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, న్యాయశాఖ కార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. అంతకుముందు ఇద్దరు ఎమ్మెల్యేలు, వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర నాయకులు.. మంత్రులను కలిసి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వినతిపత్రం సమర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని