కేంద్రం సహకరించకున్నా మెట్రో రెండో దశ

మెట్రో రైలు రెండో దశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. వారు సహకరిస్తారని ఆశిస్తున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Published : 26 Nov 2022 04:40 IST

63 కిలోమీటర్ల మేర విస్తరిస్తాం
మంత్రి కేటీఆర్‌ వెల్లడి

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: మెట్రో రైలు రెండో దశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. వారు సహకరిస్తారని ఆశిస్తున్నామని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా తప్పకుండా రెండో దశను పూర్తి చేస్తామన్నారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు ఐదు కిలోమీటర్లు, మాదాపూర్‌ మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్లు కలిపి మొత్తం 63 కిలోమీటర్లమేర మెట్రో రైలును విస్తరిస్తామన్నారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కొంత నష్టం జరిగిందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయడంతో ఎదురైన ఇబ్బందులతో మెట్రో విస్తరణ అనుకున్న సమయానికి చేపట్టలేకపోయామని.. త్వరలోనే ఈ పనులకు శ్రీకారం చుడతామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని శిల్పాలేఅవుట్‌ నుంచి ఔటర్‌ రింగు రోడ్డు వరకు రూ.466 కోట్లతో నిర్మించిన 2.8 కిలోమీటర్ల ఫ్లైఓవర్‌ను శుక్రవారం సాయంత్రం కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎంఎంటీఎస్‌ విస్తరణకు రూ.200 కోట్లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఎస్‌ఆర్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు) ముఖ్యమంత్రి మానసపుత్రిక. ఈ ప్రాజెక్టులో మొత్తం 48 పనుల్లో 33 పనులను రూ.8 వేల కోట్లతో ఆరు సంవత్సరాల్లో పూర్తి చేశాం. త్వరలో ఎస్‌ఆర్‌డీపీ ఫేజ్‌-2నూ చేపడతాం. రూ.3,500 కోట్లతో మరిన్ని పనులు చేస్తాం. సీఆర్‌ఎంపీ (సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం)లో భాగంగా నగరంలో 710 కిలోమీటర్ల ప్రధాన రహదారులను మెరుగుపరిచాం. హైదరాబాద్‌లోని అత్యుత్తమ మౌలిక వసతులు దేశంలోని ఇతర నగరాల్లో లేవని కాలర్‌ ఎగరేసి గర్వంగా చెప్పవచ్చు. విద్యుత్‌, మంచినీరు, రోడ్లు, శాంతిభద్రతలను బాగు చేసుకున్నాం, డ్రైనేజీ వ్యవస్థ ఒక్కటే మిగిలి ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తాం’’ అని పేర్కొన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఎనిమిదేళ్లలో ఏకంగా 18 పై వంతెనలను పూర్తి చేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీలు వాణీదేవి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని