ఉమ్మడి సౌరవిద్యుత్‌పై ఉత్సాహం

ఉమ్మడి సౌరవిద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నగరాలు, పట్టణాల్లో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి కొంతమొత్తం వెచ్చించి సౌరవిద్యుత్‌ పెట్టించుకుంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే ఉండనందున ఆ రూపేణా వారు లబ్ధిపొందుతున్నారు.

Updated : 26 Nov 2022 05:12 IST

అపార్టుమెంట్లు, కాలనీలకు ఒకే కరెంటు మీటరు
యూనిట్‌కు రూ.7.30 చొప్పున   సాధారణ ఛార్జీ
అందరికీ కలిపి ఏర్పాటుతో దిగివస్తున్న బిల్లు
ఏర్పాటు వ్యయంలో   కేంద్రం రాయితీ 20 శాతం
గ్రేటర్‌ హైదరాబాద్‌లో లబ్ధి పొందుతున్న గేటెడ్‌ కమ్యూనిటీలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి సౌరవిద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నగరాలు, పట్టణాల్లో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి కొంతమొత్తం వెచ్చించి సౌరవిద్యుత్‌ పెట్టించుకుంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరమే ఉండనందున ఆ రూపేణా వారు లబ్ధిపొందుతున్నారు. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ అపార్ట్‌మెంటు కాంప్లెక్స్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీ విల్లాలకు ఇలా ఉమ్మడిగా సౌరవిద్యుత్‌ ఫలకాల ఏర్పాటుతో నెలకు రూ.లక్షల కరెంటు బిల్లు ఆదా అవుతోంది. ఒకసారి ఇలా ఉమ్మడి సౌరవిద్యుత్‌ ప్లాంటుకు వెచ్చించే సొమ్మంతా నాలుగైదేళ్లలోనే కరెంటు బిల్లు రూపంలో మిగులుతోందని, ఆపై వారికి పూర్తి ఉచితంగా విద్యుత్‌ సరఫరా జరుగుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ రెడ్కో) అధ్యయనంలో గుర్తించారు. కొత్తగా నిర్మించే భారీ అపార్టుమెంట్లకు బిల్డర్లే ఉమ్మడి సౌరవిద్యుత్‌ ప్లాంటు ఏర్పాటుచేయించి కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారు. దీనివల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) నుంచి ఉమ్మడి మీటరులో నమోదైన మొత్తం యూనిట్లకు కలిపి ఒకే బిల్లు అపార్టుమెంటు అసోసియేషన్‌ పేరుతో వస్తుంది. ఏ ఫ్లాటులో ఎంత విద్యుత్‌ వినియోగించారనేది సబ్‌మీటర్లలో పరిశీలించి ఆ మేరకు బిల్లును అసోసియేషన్‌ ఇస్తుంది. దీనివల్ల సాధారణ కరెంటుతో పోలిస్తే నెలవారీ బిల్లు చాలా వరకూ తగ్గిపోయిందని పలువురు చెప్పారు.

ఉమ్మడి మీటరుతో ప్రయోజనాలు...

సాధారణంగా ఒక అపార్టుమెంటులో 50 ఫ్లాట్లు ఉన్నాయనుకుందాం. వాటి నెలవారీ కరెంట్‌ వినియోగాన్ని డిస్కం సిబ్బంది ‘లోటెన్షన్‌-ఎల్‌టీ-1’ విభాగంలో యూనిట్లవారీగా లెక్కగట్టి బిల్లు వసూలు చేస్తారు. ఒక ఫ్లాటులో నెలకు విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటితే సగటున యూనిట్‌కు రూ.10 వరకూ బిల్లు వచ్చే అవకాశముంది. అపార్టుమెంట్‌ కాంప్లెక్సులు, గేటెడ్‌ కమ్యూనిటీలు, సామాజిక కాలనీల్లో ఉండేవారికి ఇలా కరెంటు బిల్లు అదనపు భారం కాకుండా  ‘ఉమ్మడి కరెంటు మీటరు’(సీసీఎం) విధానాన్ని డిస్కంలు అమలుచేస్తున్నాయి. అంటే ఫ్లాట్లకు  మీటర్లు విడివిడిగా పెట్టకుండా భవనం మొత్తానికి కలిపి సీసీఎంను డిస్కం ఏర్పాటుచేస్తుంది. ఒకే కరెంటు కనెక్షన్‌ ఇచ్చి బిల్లును నెలనెలా ‘అపార్టుమెంటు అసోసియేషన్‌’ పేరిట పంపుతుంది. ఇలా సీసీఎం ఏర్పాటుకు విద్యుత్‌ టారిఫ్‌ ఉత్తర్వులో ప్రత్యేకంగా ‘హైటెన్షన్‌-6-టౌన్‌షిప్‌లు, రెసిడెన్షియల్‌ కాలనీలు’ పేరుతో కనెక్షన్‌ను డిస్కం ఇస్తుంది. దీనికి ఏకమొత్తంగా యూనిట్‌కు రూ.7.30 చొప్పున బిల్లు వేస్తుంది. అదే సాధారణ ఎల్‌టీ-1 కేటగిరీలో అయితే ప్రతీ 100 యూనిట్లకు ఈ రేటు పెరిగిపోయి యూనిట్‌కు రూ.10 దాటుతుంది. సీసీఎం పెట్టి హైటెన్షన్‌-6 కేటగిరీలో కనెక్షన్‌ తీసుకున్న అపార్టుమెంట్లకు సాధారణ విద్యుత్‌ బిల్లు కూడా కొంత తగ్గుతుంది. సీసీఎం పెట్టాక అదే భవనంపై సౌరవిద్యుత్‌ ఏర్పాటుచేసుకుంటే కరెంటు చాలావరకూ మిగులుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.


ఆదా ఎలా..

ఉదాహరణకు ఒక అపార్టుమెంటులో 50 ఫ్లాట్లుంటే, వాటికి నెలకు 20వేల యూనిట్ల కరెంటు వాడుతున్నారనుకుందాం. భవనానికి విడివిడిగా పెట్టినవి తీసేసి.. ఉమ్మడి మీటరు పెడితే యూనిట్‌కు రూ.7.30 చొప్పున 20వేల యూనిట్లకు నెలకు దాదాపు రూ.లక్షన్నర బిల్లు వస్తుంది. అంటే ఏడాదికి రూ.18లక్షల బిల్లు కడుతున్నట్లు. అదే భవనంపై 130 కిలోవాట్ల సామర్థ్యంగల సౌరవిద్యుత్‌ ఫలకాలు పెడితే.. కిలోవాట్‌కు రోజుకు సగటున 5 యూనిట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తవుతుంది. మొత్తం 130 కిలోవాట్లకు నెలకు 20,150 యూనిట్ల కరెంటు వస్తుంది. అంటే నెలకు డిస్కంకు ప్రస్తుతం కడుతున్న రూ.లక్షన్నర కరెంటు బిల్లు ఇక రాదు. మరి 130 కిలోవాట్ల సౌరవిద్యుత్‌ ఫలకాల ఏర్పాటుకయ్యే మొత్తం ఖర్చు రూ.65లక్షల్లో కేంద్ర రాయితీ 20% తీసేస్తే దాదాపు రూ.55లక్షలు అవుతుంది. సగటున ఫ్లాటు యజమాని రూ.లక్షా 10వేలు అసోసియేషన్‌కు ఇచ్చి సీసీఎంతో సౌరవిద్యుత్‌ పెట్టించుకుంటే నెలవారీ కరెంటు బిల్లు తగ్గిపోతుందని ‘సన్‌టెక్‌ ఎనర్జీ సిస్టమ్స్‌’ సంస్థ ఎండీ భవానీప్రసాద్‌ ‘ఈనాడు’కు చెప్పారు.Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని