ఉపగ్రహాల ‘నవో’త్సాహం!

అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయి. ఒకే రాకెట్‌ ద్వారా బహుళ కక్ష్యలోకి 9 ఉపగ్రహాలను ప్రవేశపెట్టి ఇస్రో శాస్త్రవేత్తలు సత్తా చాటారు.

Updated : 27 Nov 2022 05:21 IST

బహుళ కక్ష్యలోకి 9 ఉపగ్రహాలు
పీఎస్‌ఎల్‌వీ-సి54 విజయవంతం

శ్రీహరికోట, న్యూస్‌టుడే: అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయి. ఒకే రాకెట్‌ ద్వారా బహుళ కక్ష్యలోకి 9 ఉపగ్రహాలను ప్రవేశపెట్టి ఇస్రో శాస్త్రవేత్తలు సత్తా చాటారు. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ - షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి54 ప్రయోగం చేపట్టారు. రాకెట్‌ బయలుదేరిన 17.17 నిమిషాల తర్వాత భూ పరిశీలనకు సంబంధించి ఓషన్‌శాట్‌ ఉపగ్రహాన్ని (ఈవోఎస్‌-06) 742 కి.మీల సోలార్‌ సింక్రోనస్‌ ధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టారు. అనంతరం 2.05 గంటల్లో 8 ఉపగ్రహాలను సోలార్‌ సింక్రోనస్‌ కక్ష్యల్లో ఉంచారు. ఓషన్‌శాట్‌ శ్రేణిలో ఇది మూడోతరం ఉపగ్రహం. దీన్ని ఓషన్‌శాట్‌-2 స్థానంలో పంపారు. ఇందులో మెరుగైన పేలోడ్లు ఉన్నాయి. 8 నానో ఉపగ్రహాల్లో భూటాన్‌ (ఐఎన్‌ఎస్‌-2బి), ఆనంద్‌, ఆస్ట్రోకాస్ట్‌ (నాలుగు), రెండు థైబోల్ట్‌ ఉపగ్రహాలున్నాయి.

ఓషన్‌శాట్‌ ఉపగ్రహ ప్రయోజనాలివీ..

ఓషన్‌శాట్‌ ఉపగ్రహాల ద్వారా భూవాతావరణ పరిశీలన, తుపానులను పసిగట్టడం, వాతావరణంలో తేమ అంచనా, సముద్రాల మీద వాతావరణంపై అధ్యయనం చేయనున్నారు. బెంగళూరుకు చెందిన హైపర్‌స్పెక్ట్రల్‌ ఇమేజింగ్‌ ఉపగ్రహం మీథేన్‌ లీకులు, భూగర్భ చమురు, పంటలకు వచ్చే తెగుళ్లను గుర్తించేందుకు దోహదపడుతుంది. ఆనంద్‌ అని పేరుపెట్టిన దీనిబరువు 15 కిలోలు.

* రాకెట్‌ ప్రయోగం అనంతరం విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌ మాట్లాడుతూ.. ఉపగ్రహ రూపకల్పన, పరీక్షతో పాటు ఉపగ్రహ సమాచారాన్ని ప్రాసెస్‌ చేయడం, విశ్లేషించడంపై బెంగళూరులోని యుఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌లో భూటాన్‌ ఇంజినీర్లకు శిక్షణ ఇచ్చామని, భూటాన్‌ సహజ వనరుల నిర్వహణ కోసం ఈ ఉపగ్రహం హైరిజల్యూషన్‌ చిత్రాలను అందించనుందని చెప్పారు. భూటాన్‌ సమాచార, కమ్యూనికేషన్ల మంత్రి లియోన్‌పో కర్మ డోనెన్‌ వాంగ్డితోపాటు ఆ దేశ ప్రతినిధి బృందం రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించింది.

* పీఎస్‌ఎల్‌వీ-సి54ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో బృందంతో పాటు, ఎన్‌ఎస్‌ఐఎల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ఈవోఎస్‌-06 ఉపగ్రహం మన సముద్ర వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు సహాయపడుతుందన్నారు.

* భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది మరింత బిజీ కానుందని ఆ సంస్థ అధిపతి సోమనాథ్‌ తెలిపారు. శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ-సి54 రాకెట్‌ ప్రయోగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నావిగేషన్‌, ఆదిత్య, కమర్షియల్‌ తదితర ప్రయోగాలు చేపట్టనున్నట్లు చెప్పారు.


మత్స్య సంపద గుర్తింపు... విపత్తుల నుంచి రక్షణ
మరింత కచ్చితంగా సముద్రగర్భ సమాచారం

ఈనాడు, హైదరాబాద్‌: ఇస్రో తాజాగా ప్రయోగించిన ఈవోఎస్‌-06 ఉపగ్రహం సాయంతో సముద్రాల స్థితిగతులు, వాటిలోని మత్స్య సంపదను మరింత కచ్చితత్వంతో గుర్తించవచ్చని, ఇది మత్స్యకారులకు గణనీయమైన మేలు చేస్తుందని హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌ (భారత జాతీయ మహా సముద్ర సమాచార సేవా కేంద్రం) తెలిపింది. ‘ఈవోఎస్‌-06కు ఓషన్‌ కలర్‌ మానిటర్‌ (ఓసీఎం-3), సీ సర్ఫేస్‌ టెంపరేచర్‌ మానిటర్‌ (ఎస్‌ఎస్‌టీఎం), కు-బాండ్‌ స్కట్టెరొమీటర్‌ (ఎస్‌సీఏటీ-3) అనే మూడు రకాల సెన్సర్లను అమర్చాం. చేపలకు ఆహారమైన క్లోరోఫిల్‌ అనే నాచును గుర్తించడానికి ఓసీఎం-3 సెన్సర్‌ ఉపయోగపడుతుంది. ఎస్‌ఎస్‌టీఎం సెన్సర్‌తో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను, ఎస్‌సీఏటీ-3 సాయంతో సముద్ర ఉపరితలంపై గాలి వేగం, దిశను తెలుసుకోవచ్చు. మూడు సెన్సర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా.. చేపల ఉనికి, అక్కడ వాటికి అనుకూల వాతావరణం ఉందా అనే అంశాలను ఇన్‌కాయిస్‌ బేరీజు వేస్తుంది. చేపలుండే ప్రాంతాలను గుర్తించి.. హిందూ మహా సముద్ర తీర ప్రాంత మత్స్యకారులకు చేరవేస్తాం. మహా సముద్రంలో ప్రయాణించే నౌకలు, మత్స్యకారుల పడవలకు విపత్తుల నుంచి రక్షణ కల్పించే సరికొత్త ఆర్గోస్‌ సెన్సర్‌ సైతం ఈవోఎస్‌-06తో పయనమైంది’ అని ఇన్‌కాయిస్‌ శాస్త్రవేత్తలు వివరించారు. ఈ ప్రయోగంపై భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్‌.ఎం.రవిచంద్రన్‌, ఇన్‌కాయిస్‌ డైరెక్టర్‌ తుమ్మల శ్రీనివాసకుమార్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని