తెలంగాణ పోరాటయోధుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డి కన్నుమూత

తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్‌ కమ్యూనిస్టు నాయకుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డి(98) శనివారం మరణించారు.

Published : 27 Nov 2022 03:55 IST

ఈనాడు-హైదరాబాద్‌, నాగారం-న్యూస్‌టుడే: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్‌ కమ్యూనిస్టు నాయకుడు గుంటకండ్ల పిచ్చిరెడ్డి(98) శనివారం మరణించారు. ఇటీవల కాలికి శస్త్రచికిత్స జరిగిన అనంతరం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. పిచ్చిరెడ్డి స్వస్థలం సూర్యాపేట జిల్లా నాగారం గ్రామం. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి పనిచేశారు. ఆంధ్ర మహాసభలో చేరి సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల్లో పోరాటం చేశారు. అనేక సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపారు. నిజాం సైన్యం చేతికి చిక్కి 23 నెలలు జైలు జీవితం అనుభవించారు. నాగారం గ్రామానికి మూడు దశాబ్దాలకుపైగా సర్పంచిగా పనిచేశారు.  పిచ్చిరెడ్డికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డికి ఆయన స్వయాన పెద్దనాన్న కాగా, ఆల్‌ ఇండియా జర్నలిస్టు యూనియన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్‌రెడ్డికి మామ. పిచ్చిరెడ్డి భౌతికకాయానికి సీపీఐ నేత కె.నారాయణ నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని