అన్ని పాఠశాలల్లో ‘భద్రత’ క్లబ్‌లు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో భద్రత క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 27 Nov 2022 03:55 IST

ఫిర్యాదు బాక్సులు..  సీసీటీవీ కెమెరాలు
మండల, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో కమిటీలు
ప్రభుత్వ ప్రాథమిక నిర్ణయాలు..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో భద్రత క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌ డీఏవీ పాఠశాల ఘటన నేపథ్యంలో పిల్లల భద్రతపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ఇటీవల ఉన్నతస్థాయి కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి సమావేశమై చర్చించారు. ప్రాథమికంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, అదనపు డీజీపీ స్వాతిలక్రా, మహిళా, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, డీఐజీ సుమతి, విద్యాశాఖ అదనపు సంచాలకులు లింగయ్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్వేచ్ఛగా పాఠశాలలకు పంపించే వాతావరణాన్ని కల్పించాలని, అందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, విద్యారంగ నిపుణులతో కమిటీ సభ్యులు చర్చించి తగిన సలహాలు, సూచనలు  అందజేయాలని కోరారు.

ఇతర నిర్ణయాలు..

* ప్రతి పాఠశాలలో ఫిర్యాదు పెట్టెలు ఉంచాలి. సీసీ కెమెరాలు తప్పనిసరి.

* విద్యార్థులు సెల్‌ఫోన్‌ సహా వివిధ డిజిటల్‌ పరికరాలను సురక్షితంగా వాడుకోవడం, సోషల్‌ మీడియా ప్రభావానికి లోనుకాకుండా ఉండేలా సేఫ్టీ క్లబ్‌లు అవగాహన కల్పించాలి. రోడ్డు భద్రత తదితర వాటిపైనా అవగాహన పెంపొందించాలి.

* వాచ్‌మెన్‌, సెక్యూరిటీ, ఇతర పురుష సిబ్బందిని నియమించుకునే ముందు వారి పూర్వాపరాలు, నేర స్వభావం తదితర అంశాలను పరిశీలించాలి. అందుకు పోలీసు శాఖ సహకారం తీసుకోవచ్చు.

* ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు విధిస్తారనే అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు లీగల్‌ లిటరసీ గురించి తరచూ చెబుతుండాలి.

* తెలుగు, సాంఘిక శాస్త్రాల్లో నైతిక విలువల పాఠ్యాంశాన్ని జోడించి,  బోధించాలి.

* బాలికలు ఎక్కువగా ఉన్న చోట.. పాఠశాల సమయంలో పర్యవేక్షణకు మహిళా సెక్యూరిటీ గార్డును నియమించడం, వేధిస్తున్న వారిపై ధైర్యంగా ఫిర్యాదు చేసే విద్యార్థినులకు బహుమతులు ఇవ్వడం వంటి ఇతర ప్రతిపాదనలపైనా చర్చించినట్లు తెలిసింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు