గవర్నర్లు రాజ్యాంగ సంప్రదాయాలు పాటించాలి

రాష్ట్ర ప్రభుత్వ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించకుండా గవర్నర్‌ పక్కనపెట్టినా, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా.. గవర్నర్‌ ఆ పని పూర్తిచేసేందుకు నిర్ణీత కాలపరిమితిని విధిస్తూ రాష్ట్రాలు చట్టం తీసుకురావచ్చునని, అంతవరకు పరిస్థితి తెచ్చుకోకుండా ప్రథమ పౌరులు వ్యవహరించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, దేశ న్యాయ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి హితవు పలికారు.

Published : 27 Nov 2022 03:55 IST

తీసుకోవాల్సిన నిర్ణయాలపై జాప్యం చేయరాదు
నిర్ణీత కాలపరిమితిని విధిస్తూ రాష్ట్రాలు చట్టం తీసుకురావచ్చు
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించకుండా గవర్నర్‌ పక్కనపెట్టినా, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా.. గవర్నర్‌ ఆ పని పూర్తిచేసేందుకు నిర్ణీత కాలపరిమితిని విధిస్తూ రాష్ట్రాలు చట్టం తీసుకురావచ్చునని, అంతవరకు పరిస్థితి తెచ్చుకోకుండా ప్రథమ పౌరులు వ్యవహరించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, దేశ న్యాయ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ బీపీ జీవన్‌రెడ్డి హితవు పలికారు. రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగపరంగా సత్సంప్రదాయాలను అనుసరించాలని లేకుంటే ప్రభుత్వాల నుంచి అసౌకర్య పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. నిజమైన అధికారం మంత్రిమండలికి ఉంటుందే తప్ప.. రాష్ట్రాల్లో గవర్నర్లకు, కేంద్రంలో రాష్ట్రపతికి ఉండదని వెల్లడించారు. రాష్ట్రాల్లో శాసనసభలు, కేంద్రంలో పార్లమెంటు ముఖ్యమైనవి అయినా మంత్రిమండలి అత్యంత బలమైన వ్యవస్థ అని పేర్కొన్నారు. శనివారమిక్కడ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో హైకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో జస్టిస్‌ జీవన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ‘‘గవర్నర్లు చిత్తశుద్ధితో తీసుకోవాల్సిన నిర్ణయాలపై జాప్యం చేయరాదు. రాష్ట్రం ఒక బిల్లును ఆమోదించి దాన్ని చట్టబద్ధం చేసేందుకు రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్‌కు పంపిస్తే, దానిపై అక్కడ నిర్ణయం తీసుకోకుండా పక్కనపెట్టినపుడు గవర్నర్‌ను బాధ్యులుగా చేస్తూ ప్రజలు న్యాయస్థానానికి వెళ్లలేరు. హైకోర్టు సూచించినా గవర్నర్‌ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసినపుడు, గవర్నర్‌ లేదా రాష్ట్రపతిపై కోర్టులో దావా వేయడానికి వీల్లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 నిబంధన చెబుతోంది. అయితే రాష్ట్రపతి లేదా గవర్నర్‌ హోదాలు నిజమైన అధికారాలు లేనివి. ఇదే సమయంలో వీరి ప్రాధాన్యం కొన్ని సందర్భాల్లోనే కనిపిస్తుంది. కేంద్రంలో, రాష్ట్రంలో నిజమైన అధికారం మంత్రిమండలిదే. అందుకే ప్రభుత్వంలోని అన్ని విభాగాల మధ్య స్పష్టమైన అవగాహన పాదుగొల్పాల్సిన అవసరముంది. జాతీయ న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నపుడు.. ‘ఒక కేంద్ర మంత్రిని తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉందా?’.. అనే అంశంపై నన్ను న్యాయసలహా కోరారు. లేదని జవాబిచ్చా. ఎందుకంటే మనది ప్రధాని లేదా మంత్రిమండలి రూపంలోని ప్రభుత్వం. మరో సందర్భంలో కేంద్ర చట్టానికి విరుద్ధంగా జరిగిన వీసీ నియామకాన్ని రద్దుచేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఇదే తరహాలో రాష్ట్రంలోనూ నియమితులైన వివిధ యూనివర్సిటీల వీసీలను తొలగించాలని గవర్నర్‌ పట్టుబట్టడం సరైనదే కావచ్చు. ఇలాంటప్పుడు రాష్ట్రప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని లేదా సదరు నియామకాలపై మరెవరైనా కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని వివరించాను. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాలన కొనసాగేందుకు రాజ్యాంగ సంప్రదాయాలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య అవగాహన అవసరం’’ అని జస్టిస్‌ జీవన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వి.రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని