ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆ ఇద్దరిపై గురి!

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్‌ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పురోగతిని ఈ నెల 29న న్యాయస్థానానికి నివేదించాల్సి ఉండటంతో కీలక ఆధారాల్ని సేకరించే పనిలో నిమగ్నమైంది.

Updated : 27 Nov 2022 04:31 IST

తుషార్‌, జగ్గుస్వామి వేటలో సిట్‌ బృందాలు
కీలక సమాచారం లభ్యమవుతుందని అంచనా
రెండోరోజూ కొనసాగిన ప్రతాప్‌గౌడ్‌ విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్‌ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు పురోగతిని ఈ నెల 29న న్యాయస్థానానికి నివేదించాల్సి ఉండటంతో కీలక ఆధారాల్ని సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈ కేసులో నిందితులుగా చేర్చిన భాజపా కీలకనేత బీఎల్‌ సంతోష్‌తోపాటు డా.జగ్గుస్వామి, తుషార్‌ వెల్లాపల్లి, కరీంనగర్‌ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌ పాత్రను నిగ్గు తేల్చడంపై కసరత్తు చేస్తోంది. వీరిలో శ్రీనివాస్‌ ఒక్కరే ఇప్పటివరకు సిట్‌ విచారణకు హాజరయ్యారు. బీఎల్‌ సంతోష్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసి ఊరట పొందారు. మిగిలిన ఇద్దరూ స్పందించకపోవడంతో సిట్‌ వీరిపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌వోసీ) జారీ చేసింది. వీరిద్దరూ పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నట్లు సిట్‌ భావిస్తోంది. వాస్తవానికి డా.జగ్గుస్వామి సిట్‌ బృందం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. నోటీసు ఇచ్చేందుకు నల్గొండ ఎస్పీ (సిట్‌ సభ్యురాలు) రెమా రాజేశ్వరి బృందం కొచ్చిలోని అమృత ఆసుపత్రికి వెళ్లిన సమయంలో అతడు ఆసుపత్రి క్వార్టర్‌లోనే ఉన్నట్లు వెల్లడైంది. పోలీసులొచ్చారన్న సమాచారం తెలిసి.. అతడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సిట్‌ గుర్తించింది. 41ఏ సీఆర్‌పీసీ నోటీసును నేరుగా అందుకున్నవారు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. లేకపోతే పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే అనుమానితులు నోటీసులు అందుకోకుండా తప్పించుకుంటున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

పెద్దలకు వారధులుగా ఆ ఇద్దరు

ఈ వ్యవహారంలో కీలక పెద్దలున్నారని.. వారికి, నిందితులకు మధ్య తుషార్‌, జగ్గుస్వామి అనుసంధానకర్తలుగా ఉన్నారని సిట్‌ విశ్వసిస్తోంది. నిందితుడు రామచంద్రభారతిని తుషార్‌తో కలిపించింది డా.జగ్గుస్వామి అని సిట్‌ అనుమానం. ఫామ్‌హౌస్‌లో ఉండగా.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని రామచంద్రభారతి.. తుషార్‌తో మాట్లాడించారు. తుషార్‌, జగ్గుస్వామిలను విచారిస్తే.. కీలక సమాచారం, ఆధారాలు లభ్యమవుతాయని అధికారులు భావిస్తున్నారు.

8 గంటలపాటు విచారణ

అనుమానితుల విచారణలో భాగంగా అంబర్‌పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్‌ శనివారం సిట్‌ కార్యాలయానికి వచ్చారు. రెండోరోజు ఆయన్ని సిట్‌ బృందం దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించింది. నిందితులతో అతడికున్న ఆర్థిక లావాదేవీల విషయంలోనే ప్రశ్నించినట్లు తెలిసింది.

రెండు రోజుల కస్టడీకి నందకుమార్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ‘ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారంలో నిందితుడైన నందకుమార్‌ను రెండు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఫిలింనగర్‌ రోడ్‌ నంబరు 1, ప్లాట్‌ నంబరు 3లో ఉన్న దగ్గుబాటి కుటుంబసభ్యులకు చెందిన స్థలం సబ్‌లీజు వ్యవహారంలో నందకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. నిందితుడిని కస్టడీకి ఇవ్వాలంటూ వారం కిందట 3వ అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని శనివారం పరిశీలించిన కోర్టు.. సోమ, మంగళవారాల్లో కస్టడీకి అనుమతించిందని పోలీసులు తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు