2014 తర్వాతే అక్కడ ఆక్రమణలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ అటవీ రేంజ్‌ అధికారి చలమల శ్రీనివాసరావు దారుణ హత్య నేపథ్యంలో వివాదానికి కారణమైన బెండాలపాడు అటవీ ప్రాంతాన్ని అటవీశాఖ మరోసారి నూతన సాంకేతిక పద్ధతుల్లో విశ్లేషించింది.

Published : 27 Nov 2022 03:55 IST

బెండాలపాడు అటవీ ప్రాంతంపై అటవీశాఖ శాస్త్రీయ విశ్లేషణ

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ అటవీ రేంజ్‌ అధికారి చలమల శ్రీనివాసరావు దారుణ హత్య నేపథ్యంలో వివాదానికి కారణమైన బెండాలపాడు అటవీ ప్రాంతాన్ని అటవీశాఖ మరోసారి నూతన సాంకేతిక పద్ధతుల్లో విశ్లేషించింది. బెండాలపాడులో అక్కడి అటవీ ప్రాంతం 2010లో ఎలా ఉంది? 2014, 2002 సంవత్సరాల్లో అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అటవీశాఖ ప్రధాన కార్యాలయంలోని జీఐఎస్‌ సెల్‌ ఉపగ్రహ ఛాయాచిత్రాలతో శాస్త్రీయంగా విశ్లేషించింది. 2010లో అక్కడ గొత్తికోయల నివాసాలు ఏమీ లేవు. 2014 నుంచి క్రమక్రమంగా పోడు సాగు, ఇళ్ల ఏర్పాటు చేసుకున్నట్లు జీఐఎస్‌ సెల్‌ గుర్తించింది. 2022 నాటికి అక్కడ పెద్దమొత్తంలో అటవీ ప్రాంతాన్ని నరికేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు ఉపగ్రహాలు ఛాయాచిత్రాలు చెబుతున్నాయి. పోడు సాగు చేస్తున్నది నరికేసిన అటవీప్రాంతమే కావడంతో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 25 ఎకరాలను స్వాధీనం చేసుకుని మొక్కలు నాటడంతో కక్ష పెంచుకున్న గొత్తికోయలు ఆయనపై దాడి చేసి హత్య చేశారు.


గొత్తికోయలను బహిష్కరిస్తూ గ్రామసభ తీర్మానం

చంద్రుగొండ, న్యూస్‌టుడే: గొత్తికోయలను గ్రామ బహిష్కరణ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు గ్రామస్థులు తీర్మానం చేశారు. చంద్రుగొండ అటవీరేంజ్‌ అధికారి శ్రీనివాసరావు హత్యనేపథ్యంలో గ్రామస్థులంతా కలసికట్టుగా శనివారం గ్రామసభ నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. బెండాలపాడు సమీప అటవీప్రాంతంలోని ఎర్రబోడులో నివసిస్తున్న గొత్తికోయల వల్ల ఇబ్బందికరంగా ఉందని..వారు మారణాయుధాలతో సంచరిస్తూ విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారన్నారు. వారి కారణంగా భయం భయంగా బతుకుతున్నామని గ్రామసభలో పేర్కొన్నారు. ఆ గొత్తికోయలను వారి సొంత రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు పంపించాలని స్థానికులు తీర్మానించారు. ఆ పత్రాన్ని సర్పంచి వెంకటేశ్వర్లు గ్రామ కార్యదర్శి సతీష్‌కు అందజేశారు. ఈ అంశంపై చంద్రుగొండ తహసీల్దార్‌ రవికుమార్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఉన్నతాధికారులతో మాట్లాడి వారి సూచనలమేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు