ఎందుకింత ‘చలి?’

మొన్నటిదాకా ఉన్నపళంగా కుండపోత వర్షాలు చూశాం.. అంతకుముందు ఠారెత్తించే ఎండలు.. ఇప్పుడు అమాంతం పెరుగుతున్న చలితో వణికిపోతున్నాం.

Updated : 27 Nov 2022 09:10 IST

వాతావరణ మార్పులతోనే అనర్థాలు
జాగ్రత్త పడకపోతే ముందు తరాలకు ముప్పే..
పచ్చదనం పరిరక్షణ.. కాలుష్య నియంత్రణ ప్రధానం
‘ఈనాడు’తో వాతావరణశాఖ రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న
ఈనాడు, హైదరాబాద్‌

మొన్నటిదాకా ఉన్నపళంగా కుండపోత వర్షాలు చూశాం.. అంతకుముందు ఠారెత్తించే ఎండలు.. ఇప్పుడు అమాంతం పెరుగుతున్న చలితో వణికిపోతున్నాం. వాతావరణంలో అనూహ్యంగా ఎందుకీ మార్పులు? భవిష్యత్తులో విపత్కర పరిస్థితులకు ఇవి సంకేతాలా? మనమంతా ఏంచేయాలి? ఇలాంటి ఎన్నో అంశాలపై వాతావరణ శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ నాగరత్న వివరాలను వెల్లడించారు. ప్రజలంతా జాగ్రత్తపడకపోతే ముందుతరాలు తీవ్ర దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు.. ప్రభావాలపై ఆమె ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.


వాతావరణ మార్పుల ప్రభావం తెలంగాణపై ఎలా ఉంది?

వాతావరణాన్ని ఉష్ణోగ్రతల లెక్కల ఆధారంగా పరిశీలిస్తాం. ప్రతి 30ఏళ్ల సగటును తీసుకుని అంతకన్నా ఇప్పుడు ఎక్కువుందా? తక్కువుందా? అనేది అధ్యయనం చేస్తాం. గత 30 ఏళ్ల సగటును, అంతకుముందు 30 సంవత్సరాలతో పోలిస్తే తెలంగాణలో 0.5 డిగ్రీలు పెరిగింది. ఈ కాస్త పెరుగుదల వల్లనే ఇటీవల కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, అనూహ్యంగా పెరుగుతున్న చలి, ఇతర విపత్తులను చూస్తున్నాం. భారీవర్షాలతో పంటలు నీట మునగడం, ఇతర నష్టాలకు వాతావరణ మార్పులే ప్రధాన కారణం. సగటు ఉష్ణోగ్రత మరో 0.5 డిగ్రీలు పెరిగితే నష్టాలు మరింత తీవ్రంగా ఉంటాయి.


కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి కదా?

రాష్ట్ర సగటు ఉష్ణోగ్రత 0.5 డిగ్రీలే పెరిగింది. ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్న ప్రత్యేక వాతావరణం వల్ల ఐదారు డిగ్రీలు పెరగొచ్చు. దాన్ని ప్రాతిపదికగా తీసుకోం. ఉదాహరణకు ఆదిలాబాద్‌ దక్కన్‌ పీఠభూమిలో ఉంది. అక్కడున్న అడవులు, ఇతర కారణాల వల్ల ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయి. రామగుండం, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో థర్మల్‌ విద్యుత్కేంద్రాల వల్ల అధిక వేడి ఉంటుంది.


కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదల వల్ల రాష్ట్రంలో ఉష్ణతాపం పెరుగుతోందా?

అదొక్కటే కాదు.. పరిశ్రమలు, విద్యుదుత్పత్తి, వరిసాగు పెరగడం వల్ల కూడా కాలుష్యకారక వాయువులు విడుదలవుతున్నాయి. వరిసాగు విస్తీర్ణం లక్షలాది ఎకరాలు అదనంగా పెరిగింది. వరి పొలంలో నీరు నిల్వ ఉండటం వల్ల మిథేన్‌ వాయువు అధికంగా విడుదలై వాతావరణంలో మార్పులు వస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. పంటల మార్పిడి విధానం పాటించేలా రైతులను ప్రోత్సహించాలి. కాలుష్యాన్ని తగ్గించాలి.


వాతావరణ పరిరక్షణకు ప్రజలు ఏంచేయాలి?

ఎంతో అవసరమైతే తప్ప చెట్లు నరకవద్దు. ప్రతిఒక్కరూ ఒక మొక్కను పెంచితే ఏడాది తిరిగేసరికల్లా తెలంగాణలో 4 కోట్ల మొక్కలు అదనంగా పెరుగుతాయి. బొగ్గును మండించడంతో కాలుష్యాన్ని విడుదల చేసే థర్మల్‌ విద్యుదుత్పత్తిని అనేక దేశాల్లో తగ్గించి సౌర, పవన విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని పెంచుతున్నారు. హైదరాబాద్‌లో కాలుష్యం, కాంక్రీట్‌ భవనాల కారణంగా వేడి సాధారణం కన్నా అధికంగా ఉంటోంది. ఇప్పటికే దిల్లీలో కాలుష్యంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మనం అప్రమత్తం కాకపోతే అతిత్వరలో హైదరాబాద్‌లో కాలుష్యం కూడా దిల్లీస్థాయికి చేరే అవకాశాలున్నాయి. ప్రతి చిన్నపనికి కాలుష్యం వదిలే వాహనాలు కాకుండా సైకిళ్లు వాడితే ఎన్నో ప్రయోజనాలుంటాయి.


రాష్ట్రంలో అదనంగా వాతావరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారా?

ప్రస్తుతం 12 చోట్ల ఉన్నాయి. మొత్తం 33 జిల్లాకేంద్రాల్లో ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాలు పెట్టడానికి స్థలాలు కేటాయించాలని కలెక్టర్లను అడుగుతున్నాం. పాలమూరు విశ్వవిద్యాలయంలో స్థలం ఇస్తే వాతావరణ కేంద్రం పెడతామని అడిగాం. త్వరలో వీటి ఏర్పాటు పనులు మొదలుపెడతాం.


రహదారుల వెంట అశోకుడు మొక్కలు నాటించెను.. అని పిల్లలకు పాఠాలు చెబుతుంటాం. పెద్దలు దాన్ని సక్రమంగా పాటిస్తే వాతావరణం పాడవదనే చిన్నసత్యాన్ని అందరూ గ్రహిస్తే అతివృష్టి, గడ్డకట్టే చలి, వడగండ్లు, కరవు వంటి  విపత్తులు పెద్దగా రావు. వాతావరణ మార్పులు తెలంగాణపైనే కాదు.. దేశం మొత్తంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ‘వాతావరణం అంటే నాకు సంబంధం లేని విషయం’ అనే భావన చాలామందిలో ఉంది. అది సరికాదు. అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలి. పెరుగుతున్న కాలుష్యం, చెట్ల నరికివేత వల్ల భూ వాతావరణం బాగా వేడెక్కుతోంది. మానవాళి మనుగడకే సవాల్‌గా మారుతున్న ఈ ప్రమాదాన్ని గుర్తించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని