కబళిస్తున్న జీవనశైలి

తెలంగాణలో జీవనశైలి వ్యాధుల సంఖ్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్‌ తదితర వ్యాధులు క్రమేణా కబళిస్తున్నాయి. పల్లెలకూ విస్తరిస్తున్నాయి.

Published : 28 Nov 2022 02:38 IST

రాష్ట్రంలో పెరుగుతున్న మధుమేహం, హైబీపీ
గుండె, మెదడు సమస్యలతో మరణాలే ఎక్కువ
సిఫిలిస్‌, గనేరియా వ్యాధుల్లో మొదటి రెండు స్థానాల్లో ఏపీ, తెలంగాణ
జాతీయ ఆరోగ్య ముఖచిత్రం 2021 నివేదిక
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో జీవనశైలి వ్యాధుల సంఖ్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్‌ తదితర వ్యాధులు క్రమేణా కబళిస్తున్నాయి. పల్లెలకూ విస్తరిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2020లో ఒక్క ఏడాదిలోనే 6,81,268 పరీక్షల ద్వారా.. కొత్తగా 34,063 మంది మధుమేహులు, 81,739 మంది అధిక రక్తపోటు బాధితులు, 27,252 మంది షుగర్‌, హైబీపీ రెండూ ఉన్నవారు, 5,270 మంది పక్షవాతం వ్యాధిగ్రస్తులు, 1,091 మంది క్యాన్సర్‌ రోగులను నిర్ధారించారు. మొత్తంగా అధిక రక్తపోటు బాధితులు సుమారు 16 శాతం, మధుమేహులు సుమారు ఏడు శాతం మంది కొత్తగా నమోదయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అసాంక్రమిక వ్యాధులు (నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌- ఎన్‌సీడీ) క్లినిక్‌లలో పరీక్షలు చేయించుకుని.. చికిత్స పొందుతున్న వారి గణాంకాలివి. రాష్ట్రంలో నమోదైన మొత్తం మరణాల్లో గుండె, మెదడు, తదితర రక్తప్రసరణ వ్యాధుల కారణంగా సంభవించేవే అధికంగా (56 శాతం) ఉండడం గమనార్హం. సిఫిలిస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉండడం దృష్టి పెట్టాల్సిన అంశం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘జాతీయ ఆరోగ్య ముఖచిత్రం-2021’ నివేదికలో దేశవ్యాప్తంగా వ్యాధుల తీవ్రత, వాటి ప్రభావాన్ని వివరించింది. రాష్ట్రంలో 2020 నాటి ఆ గణాంక వివరాలిలా ఉన్నాయి...

పురుషుల ఆత్యహత్యలే అధికం

ఆత్మహత్యల్లో పురుషుల సంఖ్యే అత్యధికం. మొత్తం 5,612 మంది పురుషులు ఆత్మహత్యలకు పాల్పడగా.. వారిలో అత్యధికంగా 1902 మంది 30-45 ఏళ్ల వారే. ఆత్మహత్య చేసుకున్న మహిళలు 2,062 మంది కాగా.. అత్యధికంగా 18-30 ఏళ్ల మధ్యవయస్కులు 662 మంది ఉన్నారు.

గణనీయంగా తగ్గిన మలేరియా, డెంగీ

మలేరియా కేసులు గత అయిదేళ్లలో తగ్గుముఖం పట్టాయి. 2016లో 3,512 కేసులు నమోదు కాగా.. 2017లో 2,688, 2018లో 1,792, 2019లో 1,711, 2020లో 870 మందిని గుర్తించారు. దేశమంతటా మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. 2019లో అత్యధికంగా 13,331 డెంగీ కేసులు నమోదు కాగా.. 2020లో 2,173కి తగ్గాయి.

కలవరపెడుతున్న డయేరియా

1,85,362 మంది పురుషులు డయేరియా బారినపడగా.. 45 మంది మృతి చెందారు. 1,81,174 మంది మహిళలకు ఈ వ్యాధి సోకగా.. 47 మంది మరణించారు. ఒక్క 2020లోనే డయేరియా 92 మందిని పొట్టన పెట్టుకుంది. 68,280 టైఫాయిడ్‌ కేసులు కూడా నమోదయ్యాయి.

సుఖవ్యాధుల ముప్పు

రాష్ట్రంలో సుఖవ్యాధుల ముప్పు పెరుగుతోంది. సిఫిలిస్‌ వ్యాధిగ్రస్తులు 3,137 మంది నమోదవగా.. వారిలో 1,318 మంది పురుషులు, 1,819 మంది మహిళలు. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ (10,671) ముందుండగా తెలంగాణ రెండో స్థానంలో ఉంది. గనేరియా (గోనకొకల్‌ వైరస్‌) ఇన్‌ఫెక్షన్లలోనూ ఆంధ్రప్రదేశ్‌ (11,061) ముందు వరుసలో ఉండగా.. తెలంగాణ 5,264 కేసులతో రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో హెచ్‌ఐవీతో చికిత్స పొందుతున్న రోగులు 1,10,178 మంది ఉన్నారు.

ఒక్క విద్యార్థికీ కళ్లజోళ్లు ఇవ్వలేదు

2020-21లో 1,75,380 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు నిర్వహించాలనేది లక్ష్యం కాగా.. 94,772 మందికి సర్జరీలు చేశారు. 21,460 మంది బడి పిల్లలకు కళ్లద్దాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఒక్కరికీ ఇవ్వలేదు. 4,000 నేత్రదానాల లక్ష్యంలో 2,091 మాత్రమే చేయగలిగారు.

వేధిస్తున్న ఫ్లోరోసిస్‌: రాష్ట్రంలో 12,885 మందికి ఫ్లోరోసిస్‌ పరీక్షలు చేయగా.. 4,920 మందికి దంత సమస్యలున్నట్లు, 3,223 మందికి ఎముకలు బలహీనపడినట్లు తేలింది. 5,119 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా 2,776 మందిలో దంత సమస్యలు బయటపడ్డాయి.


శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లతో..

అత్యవసర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కారణంగా 3,16,468 మంది పురుషులు చికిత్స పొందగా.. ఏడుగురు చనిపోయారు. 3,10,410 మంది మహిళలు దీని బారినపడగా ఒకరు కన్నుమూశారు. న్యుమోనియా 6,152 మందికి సోకగా.. తొమ్మిది మంది మృతిచెందారు. తెలంగాణలో 2019లో 71,368 క్షయ కేసులు నమోదు కాగా.. 2020లో 63,366 మంది రోగులను గుర్తించారు. స్వైన్‌ఫ్లూ కేసులు 2019లో 1,388 నమోదవగా.. 22 మంది మరణించారు. 2020లో 446 కేసులు.. అయిదు మరణాలు నమోదయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని