శుద్ధి సిద్ధించేదెలా?

రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనకు భూముల కొరత అడ్డంకిగా మారింది. 33 జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆహారశుద్ధి ప్రత్యేక మండళ్లలో పరిశ్రమల ఏర్పాటు కోసం 2012 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు.

Published : 28 Nov 2022 05:14 IST

భూముల కొరతతో ఆహారశుద్ధి ప్రత్యేక మండళ్ల ఏర్పాటులో జాప్యం
ఏడాదిన్నరగా 2012 మంది పారిశ్రామికవేత్తల నిరీక్షణ
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనకు భూముల కొరత అడ్డంకిగా మారింది. 33 జిల్లాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆహారశుద్ధి ప్రత్యేక మండళ్లలో పరిశ్రమల ఏర్పాటు కోసం 2012 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. రోజురోజుకూ దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. సేకరిస్తున్న భూముల కంటే ఎక్కువగా దరఖాస్తులు రావడంతో కేటాయింపుల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. అందుబాటులో ఉన్న భూములను కేటాయించాలా? లేక అదనంగా భూములను సేకరించాలా? అని ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది. ఈ ప్రత్యేకమండళ్ల ఏర్పాటు కోసం 2021 జూన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తంగా పదివేల ఎకరాల్లో వీటిని ప్రారంభించాలని ఆదేశించారు. దీనిపై పరిశ్రమల శాఖ కార్యాచరణ చేపట్టింది. వరి, మిర్చి, జొన్న, పసుపు, ఆయిల్‌పామ్‌, చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, వంట నూనెలు, మాంసం, చేపల మార్కెటింగు ద్వారా అన్నదాతలతో పాటు నిరుద్యోగ యువతకు ఊతమివ్వాలని నిర్దేశించింది. వీటిలో మౌలిక సదుపాయాలైన విద్యుత్తు, రోడ్లు, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, శుద్ధి, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతోపాటు ప్లగ్‌ అండ్‌ ప్లేతో గిడ్డంగుల నిర్మాణం చేపట్టి, ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలను రూపొందించింది. దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో భూముల గుర్తింపునకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూములను తీసుకోవాలని, అవి అందుబాటులో లేకపోతే సేకరణ చేపట్టాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ 2021 ఆగస్టులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి అనూహ్యంగా రెండు నెలల వ్యవధిలోనే 1500 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల్లో ఎక్కువమంది రైస్‌ మిల్లులు, ఆయిల్‌ మిల్లులు, కోల్డ్‌స్టోరేజీలు, గిడ్డంగుల ఏర్పాటుపై ఆసక్తి చూపారు. ఆహార ఉత్పత్తుల పరిశ్రమల కోసం చాలామంది భూమిని అభ్యరించారు. ప్రభుత్వం భారీ ఎత్తున భూములు ఇస్తుందనే భావనతో ఒక్కో పారిశ్రామికవేత్త ఎకరం నుంచి అయిదు ఎకరాల భూమిని కోరారు.

భూములేవీ?

మొదట్లో నికరంగా 500 ఎకరాల్లో ఒక్కో ఆహారశుద్ధి ప్రత్యేకమండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఏడాదిన్నరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తరచూ కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు అతికష్టం మీద కొన్ని జిల్లాల్లో భూములు గుర్తించారు. వీటిలోనూ సగం జిల్లాల్లోనే ఈ లక్ష్యం మేరకు సేకరణ జరిగింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, కొత్తగూడెం, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో భూములు లభ్యమే కాలేదు.


ఎప్పుడిస్తారు?

ఆహారశుద్ధి ప్రత్యేకమండళ్లకు జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు, నీటి వసతి తదితర సౌకర్యాలు విధిగా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించగా... ఆ మేరకు వసతులు గల భూములు ఎక్కువగా అందుబాటులో లేవని అధికారులు గుర్తించారు. కొన్ని మినహాయింపుల అనంతరం భూసేకరణ జరిపాక ఈ లెక్కలు తేలాయి. భూముల లభ్యతను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. వీటిని పరిగణనలోనికి తీసుకొని అధికారులు సమీక్ష జరపగా దాదాపు 20 జిల్లాల్లో దరఖాస్తుదారులు కోరిన వాటి కంటే తక్కువగా భూములున్నట్లు తేలింది. దీంతో అధికారులు ఆహారశుద్ధి మండళ్ల ఏర్పాటుపై సందిగ్ధంలో ఉన్నారు. 225కి పైగా ఎకరాలను సేకరించిన జిల్లాల్లో వెంటనే ప్రత్యేక మండళ్లను ప్రారంభించాలని యోచిస్తున్నా..మిగిలిన జిల్లాల నుంచి ఒత్తిళ్లు వస్తాయనే భావనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు