నిరంతర ప్రగతి

తెలంగాణలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని.. పెరుగుతున్న ఆర్థిక వనరులు, అవసరాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలను కల్పించేందుకు సమష్టిగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు.

Published : 28 Nov 2022 05:15 IST

ప్రజావసరాలకు అనుగుణంగా నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలి
సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాలు ఆలోచించాలి
అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు
పురపాలకశాఖ అభివృద్ధిపై సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని.. పెరుగుతున్న ఆర్థిక వనరులు, అవసరాలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలను కల్పించేందుకు సమష్టిగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వినూత్న మార్గాలను అన్వేషించాలని, ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో వ్యవహరించాలని చెప్పారు. ఏ రోజుకారోజు సృజనాత్మకంగా ఆలోచించినప్పుడే గుణాత్మక ప్రగతిని ప్రజలకు మరింతగా చేరవేయగలుగుతామని తెలిపారు. ఉద్యమంతో సాధించుకున్న రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని తీర్చిదిద్దుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన పురపాలకశాఖ, నిజామాబాద్‌ నగర అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

ప్రజలు మరింత నాణ్యమైన సేవలు ఆశిస్తున్నారు

‘‘రాష్ట్రంలో వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్‌, రోడ్లు, విద్య, వైద్యం తదితర మౌలిక రంగాల్లో నాణ్యమైన వసతులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గుణాత్మక ప్రగతి సాధించింది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. అన్ని వర్గాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. దీంతో ప్రభుత్వాల నుంచి మరింత నాణ్యమైన సేవలను ప్రజలు ఆశిస్తున్నారు. వాటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులపై ఉంది. మెరుగైన సౌకర్యాల కోసం రోజురోజుకూ డిమాండ్‌ పెరగడానికి ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసమే కారణం. దాన్ని నిరంతర శ్రమతో నిలబెట్టుకోవాలి. గతంలో వానాకాలం రెండు మూడు నెలలు మాత్రమే ఉండేది. నేడు పరిస్థితి మారిపోయింది. వర్షాలు లేని ఆరేడు నెలల కాలంలోనే అభివృద్ధి పనులను పూర్తి చేసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.

నిజామాబాద్‌లో అభివృద్ధి ద్విగుణీకృతం కావాలి

ప్రగతిపథంలో దూసుకుపోతున్న నిజామాబాద్‌ నగరంలో అభివృద్ధి ద్విగుణీకృతం కావాలి. పనులను రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలి. నేను స్వయంగా పర్యటించి పరిశీలిస్తాను. పంచాయతీరాజ్‌, రోడ్లు-భవనాలు, పురపాలిక తదితర అన్ని శాఖల సమన్వయంతో పనులను పూర్తి చేయాలి. నిధుల కొరత లేదు. ఇప్పటికే విడుదలైన నిధులతోపాటు అవసరమైనవి విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించాం. నగరంలో కంకర రోడ్లను బీటీ రహదారులుగా మార్చాలి. శ్మశాన వాటికలు, సమీకృత మార్కెట్లు, కమ్యూనిటీ హాళ్లు, డంపింగ్‌ యార్డులు., మార్కెట్ల పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలి. ఆధునిక ధోబీఘాట్లను, సెలూన్లను నిర్మించాలి. గతంలో గందరగోళంగా ఉన్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో సుందరంగా మారింది. అదే తరహాలో  ఇందూరును తీర్చిదిద్దాలి. నిజామాబాద్‌ ప్రజాప్రతినిధులంతా కలిసి ఖమ్మం వెళ్లి.. అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించాలి. నేను నిజామాబాద్‌లో ఉన్నప్పుడు తరచూ తిలక్‌ గార్డెన్‌కు వెళ్లేవాడిని. ఇతర పార్కులతో పాటు దాన్ని పునరుద్ధరించాలి. రైల్వే స్టేషన్‌ను సుందరీకరించాలి. నగరంలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రజావసరాలకు వినియోగించాలి. సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణం తర్వాత పలు శాఖలు తమ కార్యాలయాలను ఖాళీ చేశాయి. వాటి స్థలాలను, కార్యాలయ భవనాలను ప్రజావసరాలకు వినియోగించాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పురపాలకశాఖ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ నివేదించారు. నిజామాబాద్‌లో ఆడిటోరియం నిర్మాణం గురించి ప్రశాంత్‌రెడ్డి వివరించారు. నగరంలో విశాల స్థలంలో బస్టాండ్‌, క్రీడా ప్రాంగణం, హజ్‌ భవన్‌ నిర్మించాలని సీఎంను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. నిజామాబాద్‌ నగర ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వెంకట్రామిరెడ్డి, కౌశిక్‌రెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


నేడు దామరచర్లకు ముఖ్యమంత్రి

యాదాద్రి థర్మల్‌ ప్లాంటు పనుల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం నల్గొండ జిల్లా దామరచర్లలో పర్యటించనున్నారు. అక్కడ జరుగుతున్న యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి సీఎం బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్ల చేరుకుంటారు. అక్కడి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ పనుల పురోగతిని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలిస్తారు. అనంతరం అక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం సీఎం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వస్తారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని