Bandi Sanjay: సంజయ్ యాత్రకు అనుమతి నిరాకరణ
నిర్మల్ జిల్లా భైంసా నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామయాత్ర, ప్రారంభోత్సవ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
భైంసా వెళ్తుండగా జగిత్యాల జిల్లాలో అడ్డుకున్న పోలీసులు
అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఇంటికి తరలింపు
పోలీసులు, భాజపా శ్రేణుల తోపులాట
కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: సంజయ్
కరీంనగర్ - ఈనాడు, కోరుట్ల గ్రామీణం, నిర్మల్, భైంసా పట్టణం - న్యూస్‌టుడే: నిర్మల్ జిల్లా భైంసా నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామయాత్ర, ప్రారంభోత్సవ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం ప్రారంభం కానున్న యాత్ర కోసం ఆదివారం రాత్రి భైంసా వెళ్తున్న బండి సంజయ్‌ను.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. యాత్ర, ప్రారంభోత్సవ సభకు అనుమతి నిరాకరించామని పోలీసులు ఆయనను నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులకు, సంజయ్‌కి మధ్య తీవ్రవాగ్వివాదం చోటుచేసుకుంది. ముందుగానే అనుమతి ఇచ్చి మధ్యలో ఇలా అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని.. తాను గుడికి వెళ్తున్నానని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు వాహనంలోనే కూర్చున్నారు. భాజపా నాయకులు, కార్యకర్తలు పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. సంజయ్‌ను వాహనం నుంచి దిగనివ్వకుండా అడ్డుగా నిలిచి పోలీసులను ప్రతిఘటించారు. దీంతో వారికి, పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి.. పోలీసు వాహనాన్ని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు నెట్టేసి సంజయ్‌ను ఆయన వాహనంలోనే కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అంతకుముందు జగిత్యాల మండలం తాటిపల్లి సమీపంలోనే పోలీసులు సంజయ్ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నం చేయగా.. కార్యకర్తలు అడ్డుగా నిలిచి కాన్వాయ్‌ని ముందుకు పంపించారు. దీంతో వెంకటాపూర్ శివారులో ఉన్న పోలీసుల బృందం సంజయ్ కాన్వాయ్‌ని అడ్డుకుంది. పోలీసుల చర్యకు నిరసనగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుట్ల నుంచి జగిత్యాల వరకు రాస్తారోకోలతో ఆందోళన చేపట్టారు. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ నేతృత్వంలో మెట్పల్లి సీఐ శ్రీనివాస్, కోరుట్ల ఎస్సై శ్యాంరాజ్ ఇతర సిబ్బంది సంజయ్ కాన్వాయ్‌ని అనుసరించారు.
సభకు వెళ్లి తీరుతా: సంజయ్
ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్రకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్న తీరు సరైంది కాదని.. కేసీఆర్ నియంత పాలనకు ఈ సంఘటన నిదర్శనమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి ఆయనను పోలీసులు కరీంనగర్‌కు తిరిగి పంపిస్తున్న సమయంలో మాట్లాడుతూ.. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. శాంతియుతంగా తాను బైంసాలో ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సభకు వెళ్లి తీరుతానని స్పష్టం చేశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకే కరీంనగర్‌కు తిరిగి వెళ్తున్నానని.. సోమవారం మధ్యాహ్నం వరకు ఎదురుచూస్తానని చెప్పారు. న్యాయస్థానం తలుపు తడతామన్నారు. యాత్ర ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాక ఖరారై.. రూట్ మ్యాప్ ప్రకటించాక హఠాత్తుగా అనుమతి లేదనడం బాధాకరమన్నారు. భైంసా సున్నిత ప్రాంతమని పోలీసులంటున్నారని.. అదేమైనా నిషేధిత ప్రాంతమా..? అక్కడికి తాము ఎందుకు వెళ్లకూడదని సంజయ్ ప్రశ్నించారు. భైంసానే కాపాడలేని సీఎం రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్‌లో ఎస్పీని కలవడానికి వెళ్లిన తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు కొట్టారని.. బేషరతుగా వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. తన కళ్లముందే మల్యాల సమీపంలో నూకపల్లి ఉపసర్పంచిని ఎస్సై కొట్టారని ఈ విషయమై ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చి పోలీసులపై తగు చర్యల్ని తీసుకుంటామని సంజయ్ హెచ్చరించారు.
సున్నిత ప్రాంతమైనందునే అనుమతి ఇవ్వలేదు: ఎస్పీ
భైంసా సున్నిత ప్రాంతమని, శాంతిభద్రతల దృష్ట్యా భాజపా చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర, బహిరంగ సభకు పోలీసుశాఖ నుంచి ఎలాంటి అనుమతి లేదని నిర్మల్ జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని పేర్కొన్నారు.
అనుమతి రద్దు వెనుక కేసీఆర్: ఎంపీ సోయం
భైంసాలో సభకు అనుమతి రద్దు చేయడం వెనుక సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉందని భాజపా నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. ‘భాజపాను చూస్తే సీఎంకు భయం పుడుతోంది. ఆయన ఆదేశాలతోనే అప్రజాస్వామికంగా మా సభను అడ్డుకుంటున్నారు’ అని ఆదివారం ఓ ప్రకటనలో ఆక్షేపించారు. దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక వీడియోలో మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ 8వ నిజాంలా వ్యవహరిస్తున్నారు. భాజపా పేరు వింటే నిద్ర పట్టడం లేదా.. నేను భాజపాలో లేను. ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేను. బండి సంజయ్ అనుచరుడిగా ఈ విషయాలు చెబుతున్నాను. పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది చాలా తప్పు’ అన్నారు. సంజయ్ యాత్రకు పోలీసులు నిరాకరించినందుకు నిరసనగా ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు వారిని అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం