నేడు సిట్‌ ముందుకు చిత్రలేఖ

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితుడు కోరె నందకుమార్‌ అలియాస్‌ నందు భార్య చిత్రలేఖ సోమవారం మరోసారి విచారణకు హాజరు కానున్నారు.

Published : 28 Nov 2022 03:59 IST

నందు ఆర్థిక లావాదేవీల గుట్టుపైనే గురి

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితుడు కోరె నందకుమార్‌ అలియాస్‌ నందు భార్య చిత్రలేఖ సోమవారం మరోసారి విచారణకు హాజరు కానున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆమెను సిట్‌ బృందం సుదీర్ఘంగా విచారించింది. అనుమానాలు నివృత్తి కాక సోమవారం మరోసారి విచారణకు రావాలని సూచించింది. ఎమ్మెల్యేలకు, ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి మధ్య అనుసంధానకర్తగా నందకుమార్‌ ఉండటంతో అతడి పాత్రకు సంబంధించి పూర్తిగా కూపీ లాగడంపై సిట్‌ దృష్టి సారించింది. నందకుమార్‌కు రాష్ట్రంలోని పలువురు ప్రముఖులతో వ్యాపార లావాదేవీలు ఉండటంతో ఆ వివరాలను రాబట్టే పనిలో నిమగ్నమైంది. సదరు లావాదేవీలకు కేసుతో ఏమైనా సంబంధముందా..? అనేది నివృత్తి చేసుకోవడం కీలకంగా భావిస్తోంది. ఇప్పటికే కరీంనగర్‌ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌తో పాటు అంబర్‌పేట న్యాయవాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్‌తో నందుకున్న ఆర్థిక లావాదేవీలను సిట్‌ గుర్తించింది. వీటికి ఎమ్మెల్యేలకు ఎర కేసుతో సంబంధముందా అనే విషయాన్ని కూపీ లాగుతోంది. ఈ క్రమంలోనే చిత్రలేఖను విచారించడం ద్వారా కీలక ఆధారాలేమైనా లభిస్తాయనే అంచనాతో ఉన్నారు. తన ఆర్థిక లావాదేవీల గురించి భార్యతో నందకుమార్‌ విస్తృతంగా చర్చిస్తాడనేది సిట్‌ అనుమానం. అందుకు సంబంధించి దంపతులిద్దరి మధ్య వాట్సప్‌ చాటింగ్‌లనూ గుర్తించినట్లు సమాచారం. తొలిరోజు విచారణలో వాటి గురించి చిత్రలేఖ పెద్దగా స్పందించనందునే సోమవారం మళ్లీ విచారణకు రావాలని చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఓ ఎన్జీవో ప్రతినిధి విజయ్‌నూ సోమవారం సిట్‌ విచారించనుంది. తొలుత శనివారం ఆయన్ని విచారించిన పోలీసులు మళ్లీ రావాలని సూచించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు