ఊపిరి ఉక్కిరిబిక్కిరి

రాష్ట్రంలో వాయు కాలుష్యం మాటెత్తగానే హైదరాబాద్‌ గుర్తొస్తుంది. రాజధానిలోనే కాదు.. జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లోనూ అది కోరలు చాస్తోంది. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది.

Published : 28 Nov 2022 04:07 IST

పట్టణాల్లో వాయు కాలుష్యం కోరలు
మహబూబ్‌నగర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా పీఎం10 ఉద్గారాల నమోదు
పెద్దపల్లిలో ఆరేళ్లలో 50 శాతం పెరుగుదల
రైస్‌మిల్లులు, అధ్వాన రోడ్లు, వాహనాల రద్దీ కారణం

ఈనాడు-హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌-పెద్దపల్లి: రాష్ట్రంలో వాయు కాలుష్యం మాటెత్తగానే హైదరాబాద్‌ గుర్తొస్తుంది. రాజధానిలోనే కాదు.. జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లోనూ అది కోరలు చాస్తోంది. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రాంతాల్లో గాలిలో సూక్ష్మధూళి కణాలు(పీఎం10) నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) గణాంకాల ప్రకారం ఆరేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో పలుచోట్ల 17 నుంచి 49 శాతం వరకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 52 చోట్ల కాలుష్య నమోదు కేంద్రాలున్నాయి. అక్కడి గణాంకాలనే పీసీబీ వెల్లడిస్తోంది. మిగతాచోట్ల కూడా కాలుష్యం ఎక్కువగానే ఉన్నా.. నమోదు కేంద్రాలను ఏర్పాటు చేస్తేనే వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

పెరుగుతున్న పీఎం10 ఉద్గారాలు..

సూక్ష్మ ధూళికణాలు(పీఎం10), అతిసూక్ష్మ ధూళికణాలు(పీఎం 2.5), ఓజోన్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి కాలుష్య ఉద్గారాలు గాలిని కలుషితం చేస్తున్నాయి. వీటిలో ముఖ్యమైన పీఎం10 ఉద్గారాలు పలు జిల్లాల్లో పెరుగుతున్నాయి.

ఇక్కడ తగ్గినా.. పరిమితి కంటే ఎక్కువే

2021లో హైదరాబాద్‌ సహా కొన్నిచోట్ల పీఎం10 ఉద్గారాలు తగ్గాయని పీసీబీ అధికారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌లో 100, మెదక్‌లో 89, మల్కాజిగిరిలో 89, హైదరాబాద్‌లో 84(నగర సగటు) గణాంకాలు నమోదయ్యాయి. అయితే నిర్దేశిత పరిమితి(40) కంటే ఇవి ఎక్కువే కావడం గమనార్హం. పైగా కొవిడ్‌ ప్రభావం లేకుంటే కాలుష్యం మరింత ఎక్కువగా ఉండేదన్న అభిప్రాయాలున్నాయి.

ఎందుకిలా..

పరిశ్రమలు, రైస్‌మిల్లులు, వాహనాల పొగ, స్టోన్‌ క్రషర్‌లు, అధ్వాన రహదారుల నుంచి వచ్చే దుమ్ము, చెత్త దహనం వంటివి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. స్థానికులు శ్వాసకోశ, నేత్ర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు.

* కరీంనగర్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 300 రైస్‌మిల్లులు ఉండగా వీటిలో 20 శాతం కూడా కాలుష్య నిబంధనలను పాటించట్లేదు. ధాన్యపు పొట్టు బయటకు రాకుండా కవర్లు, సంచులను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 40 శాతం మిల్లులే పాటిస్తున్నాయి. 30 శాతం మిల్లుల్లో కాలంచెల్లిన యంత్రాలున్నాయి. 190 బాయిల్డ్‌, 70 రా రైస్‌ మిల్లుల యాజమాన్యాలకు పీసీబీ నోటీసులు జారీచేసినా పరిస్థితిలో మార్పు లేదు.

* కొత్తగూడెం-పాల్వంచ జంట పట్టణాల్లో 4 భారీ పరిశ్రమలు, 12 రైస్‌మిల్లులతో పాటు పరిసర ప్రాంతాల్లో 6 కంకర క్వారీలున్నాయి. దీంతోపాటు కొన్నేళ్లుగా వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం, రహదారులు అధ్వానంగా ఉండటంతో దుమ్మూధూళి రేగి కాలుష్యానికి దారితీస్తోంది. మహబూబ్‌నగర్‌ శివారులో డజన్‌ వరకు స్టోన్‌ క్రషర్లున్నాయి. పట్టణం చుట్టూ గుట్టలను తవ్వి మొరం తరలిస్తున్నారు. దీంతో దుమ్మూధూళి బాగా పెరుగుతోంది.

* యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌, నల్గొండ జిల్లా మిర్యాలగూడెంవంటి చోట్ల పరిశ్రమలు, రైస్‌ మిల్లులు, వికారాబాద్‌ జిల్లా తాండూరులో మైనింగ్‌తోపాటు సిమెంటు కర్మాగారాలు, నాపరాతి పరిశ్రమలు, పాలిషింగ్‌ యూనిట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాలుష్య నమోదు కేంద్రాలు లేక తీవ్రత తెలియని పరిస్థితి ఉంది. నిధుల లభ్యతను బట్టి ఈ కేంద్రాలను దశలవారీగా ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

* రైస్‌మిల్లులు పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిందేనని, ప్రజారోగ్యానికి ఇబ్బంది కలుగుతున్నట్లు ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటామని రామగుండం పీసీబీ ఈఈ బిక్షపతి తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు