నాణ్యతపై నజర్‌.. రోడ్డు రోలర్‌కు సెన్సర్‌

రహదారి మన్నికకు మార్గం సుగమం అవుతోంది. రహదారి నిర్మాణ సమయంలో పొరల పటిష్ఠత ఏ స్థాయిలో ఉందన్నది నిర్ధారించేందుకు నూతన సాంకేతికత ఆవిష్కృతం అయింది. భవన నిర్మాణంలో పునాది పటిష్ఠత ఎంత కీలకమో రహదారి నిర్మాణంలో తొలిదశయిన మట్టిరోడ్డు స్థిరీకరణా అంతే ప్రధానం.

Updated : 28 Nov 2022 04:33 IST

పకడ్బందీగా రహదారి నిర్మాణానికి ఉపయోగం
కొత్త సాంకేతికతను ఆవిష్కరించిన సిడ్నీ విశ్వవిద్యాలయం

ఈనాడు, హైదరాబాద్‌: రహదారి మన్నికకు మార్గం సుగమం అవుతోంది. రహదారి నిర్మాణ సమయంలో పొరల పటిష్ఠత ఏ స్థాయిలో ఉందన్నది నిర్ధారించేందుకు నూతన సాంకేతికత ఆవిష్కృతం అయింది. భవన నిర్మాణంలో పునాది పటిష్ఠత ఎంత కీలకమో రహదారి నిర్మాణంలో తొలిదశయిన మట్టిరోడ్డు స్థిరీకరణా అంతే ప్రధానం. ఈ దశను ఎంత పకడ్బందీగా నిర్మిస్తే రహదారి అంత మన్నికగా ఉంటుంది. ప్రస్తుతం భౌతికంగా సాగుతున్న పరీక్షలకు నూతన సాంకేతికత తోడైతే మరింత పటిష్ఠమైన రహదారుల నిర్మాణానికి మార్గం ఏర్పడుతుంది. సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలోని జియోటెక్నికల్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఇటీవల నూతన విధానాన్ని ఆవిష్కరించింది. ఈ సాంకేతికతపై ఇంజినీరింగ్‌ స్ట్రక్చర్స్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. రోడ్డు రోలర్‌కు సెన్సర్లను అమర్చటం ద్వారా రహదారి స్థిరీకరణను నిర్ధారించడం ఈ సాంకేతికత ప్రత్యేకత.

ఐవోటీతో ప్రయోగం

రహదారి నిర్మాణంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇటీవల ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. నిర్మాణ సమయంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు   రోడ్డు రోలర్‌కు ఐఓటీ సాంకేతికతను అనుసంధానం చేస్తున్నారు. దాంతో అధికారులు తమ కార్యాలయాల నుంచే నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. నిర్ధారిత ప్రమాణాల మేరకు రోడ్డు రోలర్‌ తిరుగుతోందా? లేదా? నిర్మాణం ఏ స్థాయిలో సాగుతోందని గమనిస్తున్నారు.

సిడ్నీ అధ్యయనంతో సరికొత్త శకం

రహదారిలోని అన్ని పొరల పటిష్ఠతను నిర్ధారించేందుకు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ నూతన సాంకేతికతను ఆవిష్కరించింది. రోడ్డు రోలర్‌కు ప్రత్యేక సెన్సర్‌ను అమర్చడం ద్వారా రహదారిపై కదలికల సమయంలో నేల సాంద్రతను కచ్చితంగా తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉపయోగించిన మట్టి, ఉపయోగించిన కంకర (చిప్స్‌) ఒకదానితో మరోకటి ఎంతమేరకు సర్దుకున్నాయో కూడా గుర్తించవచ్చు. ప్రతి పొర స్థిరీకరణను నిర్ధారిస్తుంది. రహదారిలో ఎక్కడైనా ఎత్తుపల్లాలున్నా కనిపెడుతుంది. రహదారి మన్నికనూ తెలుపుతుంది. రహదారి లోపాలను ముందస్తుగా గుర్తించేందుకు ఈ సాంకేతికత ఊతంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం.

రహదారి నిర్మాణం ఇలా..

రహదారి నిర్మాణం మూడు దశల్లో సాగుతుంది. ప్రతి దశలోనూ నాణ్యత, ప్రమాణాల నిర్ధారణ తరవాతే మరో దశకు అనుమతి ఇవ్వాలన్నది నిబంధన. తొలుత మట్టితో రహదారి నిర్మిస్తారు. మట్టిని పూర్తిస్థాయిలో స్థిరీకరణ చేసేందుకు వైబ్రేటర్‌ రోలర్లను వినియోగిస్తారు. అయితే ఏ స్థాయిలో స్థిరీకరణ అయ్యిందన్నది ఆ రోలర్ల ద్వారా గుర్తించేందుకు అవకాశం లేదు. ఇక్కడే ప్రస్తుతం లోపం జరుగుతోందన్నది అధికారులు సైతం అంగీకరిస్తున్న అంశం. మట్టితో నిర్మించిన రహదారి పూర్తిస్థాయిలో గట్టిపడిందా? లేదా? అని పరీక్ష నిర్వహించి నిర్ధారించాలి. ఆ తరవాతే మరోదశకు వెళ్లాలి. చివరిగా రహదారిపై తారు వేయాల్సి ఉంటుంది. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) నిర్ధారించిన ప్రమాణాల మేరకు హాట్‌మిక్స్‌ ప్లాంటులో తారు, కంకరను కలిపి వేయాలి.


స్థిరీకరణను విశ్లేషించుకునేందుకు అవకాశం

యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో జియోటెక్నికల్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి బెహ్‌జాద్‌ ఫతాహి

నూతన సాంకేతికతను వినియోగించి రహదారి నాణ్యతను పెంచేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేశాô. రోడ్డు ఆకృతి సరిగా ఉండాలి. నిర్మాణంలో వాడే పదార్థం తగిన సాంద్రతతో ఉండాలి. సాంద్రత అంతంత మాత్రంగా ఉంటే రహదారి త్వరగా దెబ్బతింటుంది. అధిక బరువుతో వాహనాలు రాకపోకలు సాగిస్తే మరింత తొందరగా దెబ్బతింటాయి. సెన్సర్‌ ద్వారా క్షేత్రస్థాయిలోని రహదారి స్థిరీకరణ అంశాలను విశ్లేషించుకునే అవకాశముంటుంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఉపకరిస్తుంది. మేం రూపొందించిన నూతన సాంకేతికతను క్షేత్రస్థాయిలో ఉపయోగించేందుకు మరోదఫా సిద్ధమవుతున్నాం.


సాంకేతికతతోపాటు సామగ్రీ కీలకం
- కె.భిక్షపతి, డైరెక్టర్‌ జనరల్‌, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌

నూతన సాంకేతికత నిర్మాణ పటిష్ఠతకు ఉపకరిస్తుంది. రహదారి నిర్మాణంలో ఉపయోగించే మట్టి, కంకర, తారు.. ఇలా అన్నీ కీలకం. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ప్రమాణాల మేరకు వాటిని ఉపయోగించాలి. నిర్మాణ సమయంలో ప్రతి లేయర్‌లోనూ స్థిరీకరణ అవసరం. ప్రమాణాలను పాటిస్తే రహదారి మన్నిక పెరుగుతుంది. అందుకు ప్రతి దశలోనూ పరీక్షలు నిర్వహించాలి.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు