సిట్‌ ఏర్పాటు చెల్లదు.. సీబీఐకి అప్పగించాలి!

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేరళకు చెందిన భారత్‌ ధర్మ జనసేన (బీడీజేఎస్‌) అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 29 Nov 2022 03:33 IST

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో హైకోర్టును ఆశ్రయించిన తుషార్‌
ప్రతివాదుల జాబితాలో ముఖ్యమంత్రి

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేరళకు చెందిన భారత్‌ ధర్మ జనసేన (బీడీజేఎస్‌) అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ప్రతివాదుల జాబితాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును, నిందితులను చేర్చారు. సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా పేర్కొనలేదని.. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొయినాబాద్‌ నుంచి ఎఫ్‌ఐఆర్‌ను కోర్టుకు పంపడానికి 18 గంటలు తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫాంహౌస్‌లో పోలీసులు పెట్టిన కెమెరాల నుంచి ఫుటేజీని సీడీలో కాపీ చేసి దర్యాప్తుతో సంబంధం లేని రాజేంద్రనగర్‌ సహాయ పోలీసు కమిషనర్‌ దాన్ని సీఎంకు ఇచ్చారన్నారు. ప్రణాళిక ప్రకారం సేకరించిన సమాచారాన్ని సీజేఐకి, రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు పంపారని వివరించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ నెల 16న సీఆర్‌పీసీ 41ఎ కింద సిట్‌ నోటీసులు జారీ చేసిందన్నారు. అనారోగ్య కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని.. రెండు వారాల గడువు కావాలని కోరుతూ నోటీసుకు సమాధానం ఇచ్చానని తెలిపారు. దాన్ని ధ్రువీకరించుకోకుండా ఏకపక్షంగా లుక్‌ఔట్‌ సర్క్యులర్‌ జారీ చేసినట్లు పత్రికల ద్వారా తెలిసిందన్నారు. పత్రికల్లో వచ్చిన ఈ కథనాలతో తన పరువుప్రతిష్ఠలు దెబ్బతినడంతోపాటు కుటుంబసభ్యులూ మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఈ నెల 23న కింది కోర్టులో తనను నిందితుడిగా చేర్చుతూ సిట్‌ మెమో దాఖలు చేసిందని, దీంతోపాటు అరెస్ట్‌ వారెంట్‌ కోరుతూ మరో మెమోనూ దాఖలు చేసినట్లు తెలిసిందన్నారు. ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమని పిటిషన్‌లో వివరించారు. ఈ కేసులో ముఖ్యమంత్రికి రాజకీయ ప్రయోజనాలున్నందున ఆయన ఆధ్వర్యంలోని అధికారులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. రాజకీయ లక్ష్యాలతో ఇతరులను వెంటాడడానికి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, అప్పటివరకు దర్యాప్తు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

బెయిలు పిటిషన్లు దాఖలు చేసిన ఆ ముగ్గురు..

‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’లో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్‌ సతీష్‌ శర్మ, కోరే నందుకుమార్‌, డీపీఎస్‌కేవీఎన్‌ సింహయాజీలు బెయిలు కోరుతూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు. తమను రాజకీయ కారణాలతో తప్పుడు కేసులో ఇరికించారని, ఇప్పటికే 22 రోజులకుపైగా జైలులో ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేత స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారంటూ కోర్టు దృష్టికి తెచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా దోషులని తేలకముందే ఈ కేసుకు సంబంధించిన సీడీలు, వాట్సాప్‌ చాట్‌, ఇతర ఫోన్‌ సమాచార వివరాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిపై పలు కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని