సీట్ల కేటాయింపుపై ఆరా

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి బంధువులు సోమవారం ఆదాయ పన్ను అధికారుల ఎదుట హాజరయ్యారు.

Published : 29 Nov 2022 04:31 IST

ఐటీ అధికారుల ఎదుట హాజరైన మల్లారెడ్డి బంధువులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి బంధువులు సోమవారం ఆదాయ పన్ను అధికారుల ఎదుట హాజరయ్యారు. మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలో ఆదాయపన్నుశాఖ అధికారులు మూడురోజులపాటు సోదాలు నిర్వహించిన విషయం విదితమే. దీనికి సంబంధించి అధికారులు శుక్రవారం కొందరికి  నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతలో వారు బషీర్‌బాగ్‌లోని ఆదాయపన్నుశాఖ కార్యాలయానికి హాజరయ్యారు. అయితే మంత్రి మల్లారెడ్డి, మరో కుమారుడు మహేందర్‌రెడ్డిలు మాత్రం విచారణకు హాజరుకాలేదు. సోమవారం జరిగిన విచారణ ఆధారంగా మరో పదిమందికి నోటీసులు జారీ చేశారు. సోదాల సందర్భంగా పెద్ద సంఖ్యలో పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ విచారణ మరికొన్ని రోజులపాటు జరిగే అవకాశం ఉంది.

యాభైకిపైగా వ్యాపారాలు

మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి దాదాపు 50కి పైగా వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. వీటిలో విద్యాసంస్థలే ప్రధానమైనవి. వీటన్నింటిలో కలిపి ఏటా రూ.వందలకోట్ల లావాదేవీలు జరుగుతుంటాయి. డొనేషన్ల రూపంలో అనధికారికంగా పెద్దమొత్తంలో వసూలు చేసి పన్ను ఎగ్గొట్టి ఉంటారనేది ఐటీ అధికారుల అనుమానం. దాంతోపాటు ఆయా సంస్థల మధ్య నిధుల మళ్లింపు కూడా జరిగి ఉంటుందని భావిస్తున్నారు. వీటిని నివృత్తి చేసుకునేందుకు సోదాలు జరిపారు. వ్యాపార సంస్థల పనితీరు, ఆదాయ వ్యయాల వంటి వివరాలను ఆరా తీసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, వియ్యంకుడు లక్ష్మణ్‌రెడ్డి, సోదరులు నరసింహారెడ్డి, గోపాల్‌రెడ్డితో పాటు త్రిశూల్‌రెడ్డి, మరికొందరు హాజరయ్యారు. వీరిలో భద్రారెడ్డి, లక్ష్మణ్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను ఉదయం 11 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు విచారించారు. మిగతా వారిని భోజనవిరామం తర్వాత పంపించారు. వారి వారి హోదాలను బట్టి అధికారులు ప్రశ్నలు అడిగారు. ప్రధానంగా ఇంజినీరింగ్‌, వైద్య విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు, యాజమాన్య కోటాలో సీట్ల కేటాయింపు, వాటికి జరిగే చెల్లింపుల వంటివాటికి సంబంధించి సోదాలకు ముందే అధికారులు కొంత సమాచారం సేకరించి పెట్టుకున్నారు. ఈ అంశం గురించే ఎక్కువగా ప్రశ్నలడిగారు. ఎంత ఆదాయానికి పన్నుకట్టారు? వంటి వివరాలను కూడా అధికారులు వీరిని అడిగినట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల అకౌంటెంట్లను కూడా విచారించారు.

సీట్ల కేటాయింపు గురించి అడిగారు: భద్రారెడ్డి

అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పా. నాతోపాటు సిబ్బందినీ విచారించారు. మా అందరి వాంగ్మూలాలు నమోదు చేశారు. అవసరమైతే మరోసారి పిలుస్తామన్నారు. ఇంజినీరింగ్‌, వైద్య విద్య కళాశాలల ఫీజుల వివరాలు, సీట్ల కేటాయింపుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు. వారిచ్చిన నమూనాలోనే ఈ వివరాలు ఉండాలన్నారు. వీటన్నింటినీ ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మా సమాధానాలకు అధికారులు సంతృప్తి చెంది ఉంటారని భావిస్తున్నాం.మా కుటుంబ సభ్యులు మహేందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డిలకు ఇంకా నోటీసులు ఇవ్వలేదు. వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పారు.

అన్ని వివరాలు ఇస్తాం: మర్రి రాజశేఖర్‌రెడ్డి

ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపులపై ప్రశ్నించారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల్లో ఉన్న వివరాలను విచారించారు. అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు.

ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేదు: లక్ష్మణ్‌రెడ్డి

డబ్బులు, ఆర్థిక లావాదేవీల గురించి నన్ను ప్రశ్నలు అడగలేదు. నేను ఎం.ఎల్‌.ఆర్‌.ఐ.టి. కళాశాల ఛైర్మన్‌గా ఉన్నా. ఆర్థిక లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదు. కళాశాలలో విద్యార్థుల ఫిట్‌నెస్‌, క్రీడల వ్యవహారాలు మాత్రమే చూసుకుంటా. అదే విషయాన్ని అధికారులకు చెప్పా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని