కాండం తొలిచింది.. నష్టం మిగిల్చింది!

చిత్రంలో కనిపిస్తున్న వరిపైరు నీటి ఎద్దడితో ఎండిపోయినట్లు కనిపిస్తున్నా.. అది నిజం కాదు.

Published : 29 Nov 2022 04:15 IST

చిత్రంలో కనిపిస్తున్న వరిపైరు నీటి ఎద్దడితో ఎండిపోయినట్లు కనిపిస్తున్నా.. అది నిజం కాదు. పొట్ట దశలో మొగి(కాండం తొలిచే) పురుగు ఆశించటంతో వరి కంకులు గట్టిపడక తాలు గింజలతో మిగిలాయి. ఇలాంటపుడు పంట కోయడం దండగని రుద్రంగికి చెందిన రైతు ధర్న దేవయ్య పొలాన్ని అలాగే వదిలేశారు. ఎకరం పొలాన్ని వరికోత యంత్రంతో కోయిస్తే రూ.2,000 ఖర్చవుతుందని, కనీసం క్వింటా ధాన్యం కూడా వచ్చేలా లేదని వాపోయారు. సమస్య ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా ఉంది. సిరిసిల్ల జిల్లాలో 99వేల హెక్టార్లలో వరిపంట సాగవగా.. ఆలస్యంగా నాట్లు వేసిన సుమారు 15వేల హెక్టార్లను మొగి పురుగు ఆశించింది. కనీసం పెట్టుబడులు రాలేదని చాలామంది రైతులు ఆవేదన చెందుతున్నారు. సమస్యపై అధికారులను సంప్రదించగా.. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు దిగజారడం, ఎరువుల్లో నత్రజని శాతం తక్కువ కావడం, పగటి కాలం తక్కువగా ఉండడం వంటి కారణాలతో కాండం బలహీనపడి మొగి పురుగు వ్యాప్తి చెందిందన్నారు. నాట్ల సమయంలోనే సమస్యను గుర్తించి నివారణకు ఎలాంటి మందులు వాడాలో చెప్పినా చాలామంది నిర్లక్ష్యం చేశారన్నారు. యాసంగిలోనూ ఈ తెగులు వృద్ధి చెందే ఆస్కారం ఉన్నట్లు తెలిపారు.

రుద్రంగి, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని