తలమాడు.. బూడిద..!

పత్తి పంట ధరలు ఆశాన్నంటుతున్నా.. మరోవంక తెగుళ్ల వల్ల దిగుబడి దిగజారుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Published : 29 Nov 2022 04:15 IST

పత్తి పంటను వేధిస్తున్న తెగుళ్లు
నివారణకు సత్వర చర్యలు అవసరం
జయశంకర్‌ వర్సిటీ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: పత్తి పంట ధరలు ఆశాన్నంటుతున్నా.. మరోవంక తెగుళ్ల వల్ల దిగుబడి దిగజారుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిచోట్ల ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లు కూడా పత్తి రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పత్తి చెట్లకు తలమాడు, బూడిద తెగుళ్ల వ్యాప్తి అధికంగా ఉన్నట్లు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనంలో గుర్తించారు. జిల్లాల నుంచి రైతులు నిత్యం ఈ తెగుళ్ల నివారణకు సూచనలు కోరుతున్నారని వర్సిటీ పరిశోధన సంచాలకుడు డా.జగదీశ్వర్‌ ‘ఈనాడు’కు వివరించారు. ఈ తెగుళ్ల నివారణకు తక్షణ చర్యలు తీసుకోకపోతే పత్తిచెట్లు ఎండిపోయి దిగుబడి పడిపోతుందని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ మార్పులతో చలి తీవ్రత పెరిగి బూడిద తెగులు వేగంగా వ్యాపిస్తోంది. వ్యాప్తి అధికంగా ఉన్న గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించి  నివారణ చర్యల గురించి వివరించాలని అన్ని ప్రాంతీయ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలకు వర్సిటీ తాజాగా ఆదేశాలు జారీచేసింది.

దెబ్బతీసిన కలుపు మొక్కలు.

అధిక వర్షాలు, తేమ కారణంగా పత్తిచేలు, వాటి పరిసరాల్లో కలుపు మొక్కలు బాగా పెరుగుతున్నాయి. వాటిని తొలగించకుండా వదిలేసిన రైతుల పత్తి చేలను ఇప్పుడు తలమాడు తెగులు నాశనం చేస్తున్నట్లు వర్సిటీ అధ్యయనంలో గుర్తించారు. వయ్యారి భామ, తుత్తురుబెండ, ఉమ్మెత్త తదితర కలుపు మొక్కలపై వాలే తామర పురుగులకు పుప్పొడి రేణువులు అంటుకుంటాయి. పురుగులు అక్కడి నుంచి వెళ్లి పత్తిచెట్లపై వాలి ఆకులను గీరి తింటాయి. ఈ సమయంలో వాటికి అంటుకుని ఉన్న వైరస్‌లు పత్తి ఆకుల కణజాలంలోకి ప్రవేశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మరోవంక పత్తి చేలలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచోట గాలుల వల్ల వైరస్‌లు పత్తిచెట్లకు చేరుతున్నాయి. కలుపు మొక్కలను పూర్తిగా తొలగిస్తేనే పత్తి చేలకు తెగుళ్ల తాకిడి తగ్గుతుందని జగదీశ్వర్‌ వివరించారు. తెగుళ్ల నివారణకు ఎకరానికి 10 చొప్పున నీలిరంగు జిగురు అట్టలు చేనులో అమర్చాలి. పత్తిచేను చుట్టూ 2 నుంచి 4 వరసలు జొన్న లేదా మొక్కజొన్న వేస్తే పురుగులు అటు వెళతాయి. తామరపురుగుల నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల పైరిఫ్రాక్సిఫెన్‌ అనే రసాయన మందును కలిపి పిచికారీ చేయాలి. ఇలాగే ఇంకా అనేక రసాయనాలను కలిపి చల్లవచ్చని ఆయన తెలిపారు. వివరాలను రైతులు వ్యవసాయాధికారి లేదా శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోవచ్చన్నారు. ఈ పురుగుమందులను పత్తి చెట్లపైనే కాక మొదళ్లలోనూ పిచికారీ చేయాలని సూచించారు. జీవ(బయో) మందులతో కలిపి రసాయన మందులను చల్లవద్దని హెచ్చరించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని