రక్షణ ఉత్పత్తుల్లో మేటి తెలంగాణ

రక్షణ రంగ ఉత్పత్తుల్లో తెలంగాణ.. దేశంలో అగ్రస్థానంలో ఉందని, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు అంతర్జాతీయంగా అత్యుత్తమ కేంద్రంగా గుర్తింపు పొందిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు.

Updated : 29 Nov 2022 04:36 IST

అన్ని విధాలా అనుకూలతలు, భారీగా ప్రోత్సాహకాలు: మంత్రి కేటీఆర్‌
సీఐఐ, రక్షణ రంగ ఉత్పత్తిదారుల భేటీలో దృశ్యమాధ్యమ ప్రసంగం

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ రంగ ఉత్పత్తుల్లో తెలంగాణ.. దేశంలో అగ్రస్థానంలో ఉందని, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు అంతర్జాతీయంగా అత్యుత్తమ కేంద్రంగా గుర్తింపు పొందిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాలకు చెందిన బోయింగ్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌, జీఈ, సాఫ్రాన్‌ వంటి దిగ్గజ వైమానిక, రక్షణ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టిన రాష్ట్రం తెలంగాణ కావడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), భారతీయ రక్షణ రంగ ఉత్పత్తిదారుల సొసైటీల ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ నుంచి దృశ్య మాధ్యమంలో ప్రసంగించారు.

ప్రసిద్ధ సంస్థలన్నీ ఇక్కడే

‘తెలంగాణ ప్రభుత్వం అంతరిక్ష, వైమానిక, రక్షణ ఉత్పత్తుల తయారీని ప్రాధాన్య రంగంగా గుర్తించింది. దీనికి అనువైన ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో పాటు భారీగా పెట్టుబడుల సాధనకు అవసరమైన ప్రగతిశీల విధానాలను ప్రభుత్వం చేపట్టింది. సత్వర, సరళతర అనుమతుల కోసం ప్రపంచంలోనే వినూత్నమైన టీఎస్‌ఐపాస్‌ విధానం తెచ్చింది. 1.50 లక్షల ఎకరాల భూబ్యాంకు, కోతలులేని 24 గంటల పారిశ్రామిక విద్యుత్తు సదుపాయం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందుబాటులోకి తెచ్చింది. టాస్క్‌ (తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌) టాస్క్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం తన సొంత ఖర్చులతో ప్రయివేటు సంస్థలకు అవసరమైన మానవ వనరుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతోపాటు ప్రపంచ స్థాయి క్రాన్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీ వంటి వాటితో సైతం రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. టీహబ్‌, వీహబ్‌, టీవర్క్స్‌ వంటి సంస్థల ద్వారా చేయూతనిస్తూ ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది.

కొలువుదీరిన వైమానిక సంస్థలు

ప్రపంచంలోని ప్రముఖ వైమానిక సంస్థలన్నీ ఇక్కడే కొలువుదీరాయి. మరిన్ని వస్తున్నాయి. రాష్ట్రం క్షిపణులు, రాకెట్లు, ఉపగ్రహాల ఉత్పత్తుల కేంద్ర స్థానంగా ఎదిగింది. ఆదిభట్ల, నాదర్‌గుల్‌, జీఎంఆర్‌ ఏరోస్పేస్‌, హార్డ్‌వేర్‌ పార్క్‌, ఈ-సిటీ, ఇబ్రహీంపట్నంలో టీఎస్‌ఐఐసీ ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్కుల్లో వైమానిక, రక్షణ రంగ ఉత్పత్తులు పెద్దఎత్తున జరుగుతున్నాయి. రాష్ట్రంలో వెయ్యికి పైగా రక్షణ, వైమానిక సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలు భారీ పరిశ్రమలకు అనుబంధంగా ఉన్నాయి. ఈ సానుకూలతల దృష్ట్యా రాష్ట్రానికి దేశీయ వైమానిక సంస్థలు తరలిరావాలి’’ అని కేటీఆర్‌ ఆకాంక్షించారు. సమావేశంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, డైరెక్టర్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని