మిల్లర్లకు రెండేళ్ల సీఎస్టీ బకాయిల రద్దు

వరిధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకుంటున్నందున బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు గాను ఏప్రిల్‌ 2015 నుంచి జూన్‌ 2017 వరకు గల రెండేళ్ల కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్టీ) బకాయిలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు.

Published : 29 Nov 2022 04:15 IST

సీఎం కేసీఆర్‌ నిర్ణయం
ఇకపై రెండుశాతం రాయితీ కొనసాగింపు
బియ్యం ఎగుమతులకు ప్రోత్సాహం
ప్రభుత్వ ఉత్తర్వుల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: వరిధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకుంటున్నందున బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు గాను ఏప్రిల్‌ 2015 నుంచి జూన్‌ 2017 వరకు గల రెండేళ్ల కేంద్ర అమ్మకం పన్ను (సీఎస్టీ) బకాయిలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు. ఇకపై రాష్ట్రం నుంచి సాగే ఎగుమతుల కోసం ఈ రాయితీని కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ రైసు మిల్లర్లతో పాటు రైతుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. సీఫారానికి బదులు రైస్‌ మిల్లర్లు రిలీజ్‌ సర్టిఫికెట్లు, పర్మిట్లు, లోడింగ్‌ సర్టిఫికెట్లు, లారీ, రైల్వే రసీదులు, వేబిల్లులను సమర్పించవచ్చని ఆదేశాలను వెలువరించారు. మున్ముందు ఎగుమతుల సందర్భంగాను 2 శాతం సీఎస్టీ రాయితీని పొందేందుకు సీఫారాలు లేని పక్షంలో పైన నిర్దేశించిన ఇతర పత్రాలను సమర్పించవచ్చని జీవోలో పేర్కొన్నారు.

బియ్యం ఎగుమతి సమయంలో గతంలో సీఫారం దాఖలు చేస్తే సెంట్రల్‌ సేల్‌ ట్యాక్స్‌ను 2 శాతం రాయితీగా చెల్లించే విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలైంది. అనంతరం తెలంగాణ ఆవిర్భావ సమయంలోనూ దీనిని కొనసాగించారు. 01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సి-ఫారం సమర్పించనందున ప్రభుత్వం బియ్యం ఎగుమతిదారులకు సీఎస్టీలో 2 శాతం పన్ను రాయితీని నిలిపివేసింది. అప్పటినుంచి దీన్ని పునరుద్ధరించాలని రైస్‌మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యమంత్రి దామరచర్ల పర్యటన సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి తెలంగాణ రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్‌, ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్‌, మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్‌లు సీఎంను కలిసి రెండు శాతం సీఎస్టీ బకాయిలను రద్దు చేయాలని కోరారు.  మిల్లర్ల అభ్యర్థనలపై సీఎం వెంటనే స్పందించి సీఎస్టీ బకాయిల రద్దుకు ఆదేశాలు జారీ చేశారు. రైస్‌మిల్లర్లకు అండగా ఉంటామని, వారిద్వారా బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర రైతులకు మేలు చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. తమ అభ్యర్థనను మన్నించి తక్షణమే జీవో జారీ చేయడంపై వారంతా ముఖ్యమంత్రికి ప్రగతిభవన్‌లో కలసి ధన్యవాదాలు తెలిపారు. సీఎంకు తాము రుణపడి ఉంటామని, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తమ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకాలు చేస్తామని నాగేందర్‌ చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు