సంక్షిప్త వార్తలు (13)

పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో రూ.12.75 కోట్లతో నిర్మించిన వెటర్నరీ క్లినికల్‌ కాంప్లెక్స్‌ను మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు.

Updated : 30 Nov 2022 06:37 IST

3 జిల్లాల్లో కొత్తగా వెటర్నరీ కళాశాలలు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో రూ.12.75 కోట్లతో నిర్మించిన వెటర్నరీ క్లినికల్‌ కాంప్లెక్స్‌ను మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు.  ఈ అత్యాధునిక ఆసుపత్రిలో అన్ని రకాల పశువులకు అత్యవసర, ఇతర సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలో నూతనంగా వరంగల్‌, వనపర్తి జిల్లాల్లో పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిద్దిపేట, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లో కొత్త వెటర్నరీ కళాశాలలు నెలకొల్పనున్నట్లు మంత్రి ప్రకటించారు.


నేటితో ముగియనున్న ఎండీఎస్‌ ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎండీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. తుది మెరిట్‌ జాబితాలో అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వతేదీ ఉదయం 10 గంటల వరకూ ప్రాధాన్యక్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. కాగా పీజీ వైద్యవిద్య ప్రవేశ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది.


ఒకరోజు ఆర్టీసీ ఆదాయం రూ.15 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీకి సుదీర్ఘ విరామం తరవాత సోమవారం ఒక్కరోజు ఆదాయం రూ.15 కోట్లు దాటింది. గడిచిన కొద్దివారాలుగా సోమవారాల ఆదాయం రూ.14 కోట్లు దాటిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. తాజాగా అన్ని రీజియన్లూ లక్ష్యానికి మించిన ఆదాయాన్ని సాధించడం విశేషం. ఆక్యుపెన్సీ రేటు మాత్రం 69 శాతం దాటలేదు. 33.45 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు రాకపోకలు సాగించాయి. ఆదివారం ఆదాయం రూ.10.21 కోట్లుగా నమోదైంది. పెంచిన ఛార్జీలతో రోజూ కనీసం రూ.15 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కొద్దికాలంపాటు ఇంతకుమించి ఆదాయం రాగా.. తరవాత నుంచి తగ్గుతూ వచ్చింది. బుధవారం నుంచి కొన్నిరోజులపాటు ముహూర్తాలు ఉండటంతో మళ్లీ ఆదాయం పెరుగుతుందన్నది అంచనా.


మంత్రి మల్లారెడ్డి ఆడిటర్‌ను విచారించిన ఐటీ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆదాయపన్నుశాఖ అధికారుల ఎదుట మంగళవారం మంత్రి మల్లారెడ్డి ఆడిటర్‌ సీతారామయ్య హాజరయ్యారు. ఆయనతో పాటు మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలకు చెందిన ఇద్దరు ప్రిన్సిపాళ్లు, మల్లారెడ్డి వైద్య కళాశాలలకు చెందిన ఇద్దరు ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లు మొత్తం 9 మంది హాజరయ్యారు. మూడు రోజులపాటు మల్లారెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో ఆదాయపన్ను అధికారులు జరిపిన సోదాలకు సంబంధించి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. విద్యాసంస్థల్లో అడ్మిషన్ల విధానం, ఫీజు వసూళ్లు, వీటికి సంబంధించిన రసీదులు, లావాదేవీలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన అంశాల్లో వీరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.   సోమవారం హాజరైన వారికి ఓ నిర్ధారిత ఫార్మాట్‌తో కూడిన పత్రాన్ని ఇచ్చిన అధికారులు అందులోనే వివరాలు నమోదు చేసుకొని రమ్మన్నారు. బుధవారం వీరంతా ఆ వివరాలతో వచ్చే అవకాశం ఉంది.


ఎట్టకేలకు పాఠశాలల గ్రాంట్‌ విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: బడులు తెరిచి అయిదున్నర నెలలు గడిచాక ఎట్టకేలకు ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు అవసరమైన స్కూల్‌ గ్రాంట్‌లో 50 శాతాన్ని విడుదల చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సాధారణ పాఠశాలలతో పాటు ఆదర్శ, గిరిజన సంక్షేమ, క్రీడా, అంధుల పాఠశాలలకు మొత్తం రూ.37.08 కోట్లు అందనున్నాయి.  అవి పాఠశాల విద్యా కమిటీల ఖాతాల్లో జమవుతాయి.


ట్రేడ్‌లైసెన్స్‌ల ఫీజుల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ట్రేడ్‌లైసెన్స్‌ల ఫీజులను పెంచుతూ జారీచేసిన జీవో 147ను సవాలు చేస్తూ ఖమ్మంజిల్లాకు చెందిన శ్రీశ్రీశ్రీ ఆటోమొబైల్స్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పూర్తివివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జనవరి 5కి వాయిదా వేసింది.


ఫిబ్రవరి 1 నుంచి మేడారం చిన్న జాతర

తాడ్వాయి, న్యూస్‌టుడే: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే ఏడాది నిర్వహించే సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి నాలుగు రోజులపాటు ఈ జాతర సాగనుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రం, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మంగళవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్‌ కృష్ణఆదిత్యను కలిసి జాతర తేదీల ప్రతిని అందించారు. నాలుగు రోజుల పాటు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.


‘నీమ్‌ధాన్‌’ పురుగుమందుపై నిషేధం

ఈనాడు, హైదరాబాద్‌: పంటలపై తెగుళ్ల నియంత్రణకు పిచికారీ చేసే ‘నీమ్‌ధాన్‌’(బ్యాచ్‌ సంఖ్య ఎఫ్‌ఏపీ18606) పురుగుమందుపై నిషేధం విధించినట్లు వ్యవసాయశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అనుప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ కంపెనీ ‘అజాడిరక్టిన్‌’ 0.15 ఈసీ’ అనే రసాయన మందును ‘నీమ్‌ధాన్‌’ పేరుతో మార్కెట్‌లో విక్రయిస్తోంది. దీని నమూనాలు మార్కెట్‌ నుంచి సేకరించి రాజేంద్రనగర్‌ ప్రయోగశాలలో పరీక్షించగా నాసిరకం అని తేలడంతో అమ్మకాలు, నిల్వ, వినియోగంపై నిషేధం విధించినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.


సీఐడీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌కు సన్మానం

ఈనాడు, హైదరాబాద్‌: సీఐడీ చీఫ్‌, డీజీ గోవింద్‌ సింగ్‌ను డీజీపీ కార్యాలయంలో సీఐడీ ఉన్నతాధికారులు మంగళవారం ఘనంగా సన్మానించారు. పోలీస్‌శాఖకు ఆయన అందించిన సేవలను కొనియాడారు. గోవింద్‌ సింగ్‌ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. కార్యక్రమంలో సీఐడీ డీఐజీ శ్రీనివాస్‌, ఎస్పీలు పరిమళ హననూతన్‌, రంగారెడ్డి, సుబ్బారాయుడు, ఎల్‌ఎస్‌ చౌహాన్‌, పద్మజారెడ్డి, అనసూయ, నారాయణ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


రఘురామ విచారణ వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విచారణ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలంటూ సిట్‌ ఈ నెల 26న ఆయనకు 41ఏ సీఆర్పీసీ నోటీస్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇతరత్రా కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్న కారణంగా విచారణను వాయిదా వేస్తున్నట్లు దర్యాప్తు అధికారి గంగాధర్‌ పేరిట ఎంపీకి మెయిల్‌ పంపించారు. 27వ తేదీనే ఈ మెయిల్‌ పంపించినట్లుగా ఉంది. విచారణకు రావాల్సిన అవసరం ఏర్పడితే సమాచారం అందిస్తామని అందులో పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన మంగళవారం విచారణకు రాలేదని సమాచారం. ఆయనకు సిట్‌ బృందం మరోమారు నోటీస్‌ ఇచ్చి విచారణకు పిలిచే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.


త్వరలో నీరాకేఫ్‌ ప్రారంభం
ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని గీతవృత్తిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లతో నిర్మిస్తున్న నీరా కేఫ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలో ప్రారంభిస్తారని ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సర్వేల్‌, చారుకొండ, మునిపల్లెలలో నీరా ఉత్పత్తి, సేకరణ కేంద్రాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. గీత కార్మికుల సంక్షేమం, నీరా కేఫ్‌ ప్రారంభోత్సవం, నీరా ఉత్పత్తి, సేకరణ, మార్కెటింగ్‌ తదితర అంశాలపై మంగళవారం ఆయన తన కార్యాలయంలో ఆబ్కారీ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌అహ్మద్‌తో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గీత కార్మికులకు మోపెడ్‌ వాహనాల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్‌ ఆమోదంతో ప్రారంభిస్తామన్నారు. దేశంలో తొలిసారిగా నీరా పాలసీని చేపట్టామని, హైదరాబాద్‌ పీపుల్స్‌ప్లాజా వద్ద నీరా కేఫ్‌ నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. రైతు బీమా మాదిరిగా గీత కార్మికులకు త్వరలోనే బీమా పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రమాదవశాత్తు తాటి చెట్ల పైనుంచి పడి శాశ్వత అంగవైకల్యం పొందితే సత్వరమే ధ్రువీకరణపత్రాలను జారీ చేసేందుకు నిబంధనలను సరళతరం చేస్తామని తెలిపారు.


కొత్త పోస్టులు సృష్టిస్తే ఆర్థికభారం
విద్యుత్‌ సంస్థల పరిశీలనలో గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ శాఖలో కొద్దిమంది ఉద్యోగులకు రివర్షన్‌ ఇచ్చిన నేపథ్యంలో వారికోసం అదనంగా సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించాలంటే భారీగా ఆర్థిక భారం పడనుందని విద్యుత్‌ సంస్థల పరిశీలనలో గుర్తించారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 3విద్యుత్‌ సంస్థల్లో 162 మందికి రివర్షన్‌ ఇచ్చి మరికొందరికి పదోన్నతులిచ్చారు. ‘‘రివర్షన్లు ఇవ్వకుండా అదే స్థానాల్లో కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు సంస్థల యాజమాన్యాలకు, మంత్రికి విన్నవించాయి. పాత పదోన్నతుల ప్రకారం వారికోసం 250 పోస్టులు అదనంగా సూపర్‌ న్యూమరరీ పేరుతో సృష్టించాల్సి ఉంటుందని సంస్థలు గుర్తించాయి. ఉదాహరణకు ఎస్‌ఈగా రివర్షన్‌ పొందిన ఒక చీఫ్‌ ఇంజనీరు(సీఈ) సీనియారిటీ ప్రకారం చివరిస్థానంలో ఉన్నారు. ఆయనకు రివర్షన్‌ ఇవ్వకుండా సీఈగానే కొనసాగించాలంటే సీనియారిటీలో ఆయన కంటే పైనున్న మరో ఏడుగురికి సీఈగా పదోన్నతి కల్పించడానికి 3విద్యుత్‌ సంస్థల్లో అదనంగా 22 సీఈ పోస్టులు సృష్టించాలి. ఇలాగే ఎస్‌ఈ పోస్టులు అదనంగా మరో 103 సృష్టించాల్సి ఉంటుంది. సీఈ, ఎస్‌ఈ అంటే విద్యుత్‌సంస్థల్లో అత్యున్నతస్థాయి ఇంజినీరు పోస్టులు. అదనంగా పెద్దసంఖ్యలో కొత్త పోస్టులను సూపర్‌ న్యూమరరీ కోటా పేరుతో సృష్టిస్తే వారికి కొత్త పని కల్పించడం సవాలుగా మారనుంది అని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాల పరిశీలనలో గుర్తించారు. ఇందువల్లనే రివర్షన్లు ఇవ్వాల్సి వచ్చింది. వీరందరికీ మున్ముందు ఏర్పడే ఖాళీలను బట్టి న్యాయం చేస్తాం’’ అని సీనియర్‌ అధికారి ఒకరు వివరించారు.  


బడుగు, బలహీనవర్గాలున్న ప్రాంతాల్లో ఆలయాలు
ఏపీవ్యాప్తంగా 1,400 నిర్మించేందుకు నిర్ణయం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏపీలోని గ్రామీణ ప్రాంతాల ప్రాతిపదికగా బడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నచోట్ల 1,400 ఆలయాలను నిర్మించనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ఒక్కో ఆలయానికి రూ.10 లక్షలు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘1,400 ఆలయాల్లో సుమారు 1,060 దేవాదాయశాఖ నిర్మించనుండగా.. 330కి పైగా సమర్‌ సత్తా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్మాణం చేపడతాం. ఇందులో గుత్తేదారు ఎవరూ ఉండరు. రూ.10 లక్షల్లో రూ.8 లక్షలు ఆలయ నిర్మాణానికి, రూ.2 లక్షలు విగ్రహాల తయారీకి వినియోగిస్తాం. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్లయితే దేవతామూర్తుల విగ్రహాలను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఉచితంగా అందిస్తుంది. మిగతా విగ్రహాలనూ 25% రాయితీతో తితిదేనే సమకూరుస్తుంది. దేవాదాయశాఖ ఇచ్చే రూ.10 లక్షలకు అదనంగా మరికొంత ఎక్కువగా జమ చేసి ఆలయాన్ని నిర్మించుకునేందుకు గ్రామ పెద్దలు ముందుకువస్తే నిర్మాణ బాధ్యతల్ని వారికే అప్పగిస్తాం. అయితే వారు ప్రభుత్వం నిర్దేశించిన డిజైన్‌ ప్రకారమే ఆలయాల్ని నిర్మించాల్సి ఉంటుంది. కొత్తగా నిర్మించే ఆలయాల్లో అర్చకుల్ని నియమించుకునే అధికారం గ్రామస్థులదే’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని