డిసెంబరు నుంచే ఇళ్లు లేని పేదలకు రూ.3 లక్షలు

సొంత స్థలాలుండి ఇళ్లు లేని నిరుపేదలకు రూ.3 లక్షల పథకాన్ని ప్రభుత్వం డిసెంబరులో ప్రారంభించనుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated : 30 Nov 2022 07:15 IST

సమీక్షలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: సొంత స్థలాలుండి ఇళ్లు లేని నిరుపేదలకు రూ.3 లక్షల పథకాన్ని ప్రభుత్వం డిసెంబరులో ప్రారంభించనుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈలోపు రెండు పడకగదుల ఇళ్లు మంజూరై.. నిర్మాణాలు జరగని గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. రూ.5.04 లక్షల పథకం మంజూరు కాని వారిని రూ.3 లక్షల పథకంలో అర్హులుగా గుర్తించాలన్నారు. ఈ రెండు పథకాల్లోని వ్యత్యాసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా స్థానిక ప్రజాప్రతినిధులు వివరించాలని చెప్పారు. ఎన్నికల నాటికి ఏ గ్రామంలోనూ ఇళ్లు లేని నిరుపేదలు ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టంచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం, ‘మన ఊరు- మన బడి’ పనుల పురోగతిపై జిల్లా అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా టెండర్లు వేసేందుకు గుత్తేదారులు ముందుకు రానిచోట, స్థలాల సమస్య ఉన్నచోట వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ఇళ్ల పంపిణీని ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గురుకులాల సంఖ్యను 200 నుంచి వెయ్యికి పెంచిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని తెలిపారు. రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాకు ఎనిమిదేళ్లలో మెడికల్‌, ఇంజినీరింగ్‌, వ్యవసాయ, నర్సింగ్‌ కళాశాలలను మంజూరు చేసినట్లు వివరించారు. అనంతరం వేములవాడ మండలం అగ్రహారంలోని పాఠశాలలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను మంత్రి పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు