చనాకా-కొరాటా, ముక్తీశ్వర, చౌట్‌పల్లిలకు పచ్చజెండా
తెలంగాణలోని గోదావరి పరీవాహకంలోని మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపింది.
మూడు ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం ఆమోదం
డీపీఆర్‌లపై సందేహాలను నివృత్తి చేసిన అధికారులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని గోదావరి పరీవాహకంలోని మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపింది. మంగళవారం దిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన సాంకేతిక సలహా సంఘం(టీఏసీ) సమావేశం జరిగింది. ముక్తీశ్వర (చిన్న కాళేశ్వరం), చనాకా-కొరాటా, చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా పలు సందేహాలపై నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ వివరణాత్మకంగా తెలియజేశారు. సీడబ్ల్యూసీ అనుమానాలను నివృత్తి చేశారు. వాటికి సంతృప్తి చెందిన పంకజ్‌కుమార్ ప్రాజెక్టులకు ఆమోదం తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సమావేశం మినిట్స్ జారీ చేస్తామన్నారు. గతేడాది జులైలో కేంద్ర ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులను జీఆర్‌ఎంబీ పరిధిలోకి చేర్చుతూ విడుదల చేసిన గెజిట్ ప్రకటనలో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో ఈ మూడింటిని చేర్చింది. సమావేశంలో నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్, రామగుండం ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్, నిజామాబాద్ సీఈ మధుసూదన్, సీఎంవో ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, తెలంగాణ ప్రాంత సీడబ్ల్యూసీ సీఈ రంగారెడ్డి, డైరెక్టర్ రమేశ్ పాల్గొన్నారు. పంకజ్‌కుమార్‌కు తెలంగాణ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా...
కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాజెక్టుల సమగ్ర నివేదికలను(డీపీఆర్) సెప్టెంబరు 2021లో సీడబ్ల్యూసీకి అందజేసింది. వివిధ డైరెక్టరేట్లు వాటిని పరిశీలించాయి. అనంతరం గోదావరి బోర్డుకు పంపించాయి. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆమోదించిన గోదావరి ప్రవాహ చార్టును అనుసరించి డీపీఆర్‌లపై బోర్డు పరిశీలన నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బోర్డు 13వ సమావేశంలో డీపీఆర్‌లపై చర్చ జరిగింది. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ పలు అభ్యంతరాలు లేవనెత్తింది. వాటిని సమీక్షించిన అనంతరం 3 ప్రాజెక్టులకు టీఏసీ ఆమోదం ఇవ్వొచ్చని బోర్డు సిఫార్సు చేసింది.
ముక్తీశ్వర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం బీరసాగర్ వద్ద గోదావరిపై రూ.545.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకం ఇది. 4.50 టీఎంసీల ఎత్తిపోత సామర్థ్యం ఉన్న ఈ పథకంలో 2 పంపు హౌస్‌లు నిర్మించారు. 18,211 హెక్టార్లకు సాగునీరు, 63 గ్రామాలకు తాగునీరందుతుంది. నిర్మాణానికి 568 హెక్టార్ల ప్రభుత్వ భూమి, 640ఎకరాల పట్టా, 258.02 ఎకరాల అటవీశాఖ భూమిని సేకరించారు.
చౌట్‌పల్లి హన్మంతరెడ్డి: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని షట్‌పల్లి చెరువు ఆధారంగా రూ.48.20 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల ఇది. శ్రీరామసాగర్ ప్రాజెక్టు నుంచి లక్ష్మీ కాలువ ద్వారా ఈ చెరువుకు వచ్చే 0.80. టీఎంసీల నీటిని కమ్మరపల్లి, మోర్తాడ్ మండలాల్లోని 28 చెరువులకు ఎత్తిపోస్తారు. రెండు మండలాల పరిధిలో 8,297 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో 30.88 హెక్టార్ల పట్టా, అటవీ భూమిని సేకరించారు.
చనాకా-కొరాటా
తెలంగాణ, మహారాష్ట్రల పరిధిలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ.452.50 కోట్ల అంచనా (ఇప్పుడు పెరిగింది) వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు ఇది. ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ నదిపై (మరోవైపు మహారాష్ట్ర) చేపట్టిన బ్యారేజీ నిల్వ సామర్థ్యం 0.83 టీఎంసీలు. ఇక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా 1.20 టీఎంసీల నీటిని తరలించి తెలంగాణ పరిధిలో 5,566 హెక్టార్ల సాగుభూమికి, 14 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. మహారాష్ట్ర పరిధిలో 0.30 టీఎంసీలతో 1214 హెక్టార్లకు సాగునీరు, 9 గ్రామాలకు తాగునీరందించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి 183.7 హెక్టార్ల పట్టా భూమి, 0.5 హెక్టార్ల అటవీ భూమిని(మహారాష్ట్ర) సేకరించారు. ముంపులో తెలంగాణ పరిధిలో 16.80 హెక్టార్ల భూమి ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Politics News
Tripira Election: త్రిపుర బరిలో కేంద్రమంత్రి.. భాజపా జాబితా విడుదల
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ ఆల్‌టైమ్ ‘XI’.. కెప్టెన్సీపై చర్చ.. ఓజా ఎంపిక ఎవరంటే?