అమ్మ కడుపు చల్లగా!

తెలంగాణలో ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.

Published : 30 Nov 2022 05:05 IST

తెలంగాణలో 53 శాతం తగ్గిన ప్రసూతి మరణాలు
తక్కువ మాతృ మరణాల్లో మూడోస్థానం
తొలి రెండు రాష్ట్రాలు కేరళ, మహారాష్ట్ర
జాతీయ నమూనా సర్వే నివేదిక వెల్లడి

ఈనాడు - హైదరాబాద్‌, దిల్లీ: తెలంగాణలో ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2017-19లో ప్రతి లక్ష ప్రసవాలకు కాన్పు మరణాలు 56 నమోదు కాగా.. 2018-20కి ఆ సంఖ్య 43కి తగ్గింది. దేశంలో సగటున తక్కువ మాతృ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో కేరళ (19), మహారాష్ట్ర (33) తొలి రెండు స్థానాల్లో ఉండగా, తెలంగాణ మూడోస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ (45), తమిళనాడు (54)లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2014తో పోలిస్తే తెలంగాణలో ప్రసూతి మరణాలు 53 శాతం తగ్గినట్లుగా తాజాగా విడుదలైన జాతీయ నమూనా సర్వే నివేదిక వెల్లడించింది. కాన్పు సమయంలో లేదా ఆ తర్వాత 42 రోజుల్లోపు మహిళలు మరణిస్తే వాటిని ప్రసూతి మరణాలుగా పరిగణిస్తారు. ప్రతి లక్ష కాన్పుల ప్రాతిపదికన వీటిని లెక్కిస్తారు.

నివేదికలోని ముఖ్యాంశాలివి..

* తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యధికంగా అస్సాంలో ప్రతి లక్ష ప్రసవాలకు 195 మరణాలు నమోదయ్యాయి. జాతీయ సగటు 97 కాగా.. అంతకంటే ఎక్కువగా బిహార్‌ (118), మధ్యప్రదేశ్‌ (173), ఛత్తీస్‌గఢ్‌ (137), ఒడిశా (119), రాజస్థాన్‌ (113), ఉత్తర్‌ప్రదేశ్‌ (167), ఉత్తరాఖండ్‌ (103), పంజాబ్‌ (105), హరియాణా (110), పశ్చిమబెంగాల్‌ (103) రాష్ట్రాల్లో మాతృ మరణాలు నమోదయ్యాయి. జాతీయ సగటు కంటే తక్కువ నమోదైన రాష్ట్రాల్లో ఝార్ఖండ్‌ (56), గుజరాత్‌ (57), కర్ణాటక (69) కూడా ఉన్నాయి.

* దేశంలో ప్రసూతి మరణాల సగటు 2017-19లో 103 (ప్రతి లక్ష ప్రసవాలకు) ఉండగా.. 2018-20 నాటికి ఆ సంఖ్య 97కి తగ్గింది. అయితే ఈ నిష్పత్తిని 70 కంటే తక్కువకు తీసుకురావాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యం కంటే మాత్రం ఇది చాలా ఎక్కువ.


మొదటి స్థానమే లక్ష్యం: మంత్రి హరీశ్‌

మాతా శిశు సంరక్షణలో భాగంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన కేసీఆర్‌ కిట్లు విప్లవాత్మకమైన మార్పు తెచ్చాయి. దీంతో గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం సాధ్యమైంది. వారికి తప్పనిసరిగా నాలుగు సార్లు అవసరమైన పరీక్షలు చేయడంతో పాటు, రక్తహీనత సమస్యను అధిగమించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఖర్చుకు వెనుకాడకుండా ప్రతి గర్భిణికి కాప్సుల్‌ రూపంలో ఐరన్‌ టాబ్లెట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. సిబ్బంది వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం, అవసరమైన వ్యాయామం చేయించడంతో పాటు, మానసికంగా సంసిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందించే ఆశాలు, ఏఎన్‌ఎంల నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వైద్యాధికారుల నిరంతర కృషి ఉంది. అందరికీ అభినందనలు. అయితే దీంతో సంతృప్తి చెందకుండా, మాతృ మరణాలు తగ్గించడంలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానానికి చేర్చి.. దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా కృషి చేయాలి.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని