Nanda Kumar: డబ్ల్యూ3 సంస్థ లావాదేవీల సంగతేంటి?

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు మంగళవారం విచారించారు.

Updated : 30 Nov 2022 07:13 IST

డెక్కన్‌ కిచెన్‌ వివాదంపై నందకుమార్‌ను విచారించిన అధికారులు

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-జూబ్లీహిల్స్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు మంగళవారం విచారించారు. అతను ఏర్పాటు చేసిన ‘డబ్ల్యూ3’ (వరల్డ్‌ వి విష్‌) సంస్థ లావాదేవీలతో పాటు డెక్కన్‌ కిచెన్‌ రెస్టారెంట్‌ గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా 22 ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ‘‘ఫిలింనగర్‌ రోడ్‌ నంబర్‌-1లో నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబులకు చెందిన దాదాపు 2,200 గజాల స్థలాన్ని లీజుకు తీసుకున్నాను. వెంకటేశ్‌కు చెందిన 1,100 గజాల స్థలంలో డెక్కన్‌ కిచెన్‌ ఏర్పాటైంది. తొలుత 2019 వరకు లీజు అగ్రిమెంట్‌ ఉండగా.. 2024 వరకు పొడిగించుకున్నాను. ఒకవేళ ఈ స్థలాన్ని విక్రయిస్తే నాకే అమ్మాలని, లేదంటే సంయుక్తంగా అభివృద్ధి చేయాలని ఒప్పందం రాసుకున్నాం. దగ్గుబాటి సురేశ్‌బాబుకు చెందిన స్థలాన్ని తొలుత లీజుకు తీసుకుని.. సేల్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నాం. ఇందుకు రూ.3 కోట్లు చెల్లించాను. అక్కడ ఏర్పాటు చేసిన డెక్కన్‌ కిచెన్‌తోపాటు ఇతర స్టోర్‌ల రాబడిలో 10 శాతం వాటా తీసుకొనేలా ఒప్పందం చేసుకున్నాను. అంతకుమించి ఎవరితోనూ ఎలాంటి లీజు ఒప్పందం చేసుకోలేదు. డెక్కన్‌ కిచెన్‌ ఏర్పాటు సమయంలో అయాజ్‌ ఇచ్చిన రూ.6 లక్షలను జనరేటర్‌ కొనుగోలుతో పాటు గది మరమ్మతులకు వెచ్చించాను’’ అని విచారణ సందర్భంగా నందకుమార్‌ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ ముగిసిన తరువాత అతన్ని నాంపల్లి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. వేరే కేసులో సిట్‌ అధికారులు తనను విచారించారంటూ నందకుమార్‌ ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాది సమక్షంలో విచారించాలనే నిబంధననూ ఉల్లంఘించారనిఫిర్యాదు చేశారు. అనంతరం అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

స్టేషన్‌లోనే సిట్‌ సభ్యులు!

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యులుగా ఉన్న నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏసీపీ శ్రీధర్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆశిష్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. దాదాపు రెండు గంటలు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో స్థానిక పోలీసులు స్టేషన్‌లో లేకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని