20 లక్షల మొక్కలతో భారీ అరణ్యం

హైదరాబాద్‌ సమీప ఎలిమినేడు సాధారణ అటవీ ప్రాంతం దట్టమైన అడవిగా మారబోతోంది.

Published : 30 Nov 2022 03:43 IST

లోపల 32 కి.మీ. సైక్లింగ్‌ ట్రాక్‌, 10 కి.మీ. నడక దారి
హైదరాబాద్‌ సమీపంలోని ఎలిమినేడులో ఏర్పాటు
ఏడాదిలోగా పూర్తి కావాలని ఆదేశించిన పీసీసీఎఫ్‌ జైశ్వాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సమీప ఎలిమినేడు సాధారణ అటవీ ప్రాంతం దట్టమైన అడవిగా మారబోతోంది. 20 లక్షల మొక్కలతో భారీ అడవిని అభివృద్ధి చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. వేల ఎకరాల అటవీ ప్రాంతంలో, పచ్చందాలను వీక్షించే అవకాశాన్ని పర్యాటకులకు కల్పించబోతుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కనే కొంగరకలాన్‌, కొంగరకుర్దు, సరస్వతిగూడ(సలోనిదుబ్బ), గుట్టలకంచ, ఎలిమినేడు కలాన్‌ 5 అటవీ బ్లాకుల్లో 4,500 ఎకరాల ఈ అటవీ ప్రాంతం ఉంది. వాకింగ్‌ చేస్తూ లేదా సైక్లింగ్‌ చేస్తూ అడవంతా తిరగొచ్చు. 10 కి.మీ.ల వాకింగ్‌ ట్రాక్‌, 32 కి.మీ.ల సైక్లింగ్‌ ట్రాక్‌.. వీటితోపాటు అటవీ అందాల్ని వీక్షించేందుకు 5 ఎత్తయిన వాచ్‌ టవర్లు, వాన నీటినిల్వకు 6 చెక్‌డ్యాంలూ అందుబాటులోకి రానున్నాయి. అటవీ సంరక్షణ ప్రధానాధికారి(పీసీసీఎఫ్‌- కంపా) లోకేశ్‌ జైశ్వాల్‌ మంగళవారం  కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సైదులు, రంగారెడ్డి డీఎఫ్‌ఓ రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, శంషాబాద్‌ డీఎఫ్‌ఓ విజయానంద్‌రావుతో కలిసి ఎలిమినేడు క్లస్టర్‌ను పరిశీలించి, ప్రణాళికల అమలుపై చర్చించారు. సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లను టీఎస్‌ఐఐసీ నిర్మిస్తోంది. మెట్ల ద్వారా కొంగరకలాన్‌ గుట్టపైకి ట్రెక్కింగ్‌ చేసి, ఆపైన మరో 20 అడుగుల ఎత్తులో ఉండే వాచ్‌ టవర్‌ ఎక్కితే మొత్తం 5 బ్లాక్‌ల అటవీ అందాలు కనిపిస్తాయని ఎఫ్‌డీఓ విజయానంద్‌రావు  చెప్పారు. ఈ పనులన్నీ 2023 డిసెంబరుకల్లా పూర్తిచేయాలన్నది లక్ష్యంగా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని