బాలారిష్టాల్లోనే బయోమెట్రిక్‌

‘రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం పట్టాలెక్కలేదు.

Updated : 30 Nov 2022 04:51 IST

మార్గదర్శకాలు జారీ చేయని సర్కారు... సందిగ్ధంలో అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం పట్టాలెక్కలేదు. బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులకూ దాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి 50 రోజులు దాటినా ఆ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. కొన్నేళ్లుగా ఆయా వర్సిటీలతోపాటు ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సిబ్బందికి బయో హాజరును అమలు చేస్తున్నారు. ఈసారి కొత్తగా ప్రభుత్వ విద్యా ప్రాంగణాల్లోని విద్యార్థులకూ అమలు చేయాలని, అంతేకాకుండా ప్రైవేట్‌ విద్యా సంస్థల్లోనూ తప్పనిసరని సర్కారు నిర్ణయించింది. అయితే త్వరలో అమలు చేస్తామని చెబుతున్నారు తప్ప ఎప్పటి నుంచి ప్రారంభిస్తారన్న అంశంపై మాత్రం ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు.

ఈసారి అద్దెకు పరికరాలు?

ఈసారి పరికరాలను కొనుగోలు చేయకుండా ఏడాదికి...ఒక విద్యార్థికి కొంత మొత్తం నిర్ణయించి... ఆ మొత్తాన్ని పరికరాలను అమర్చే ప్రైవేట్‌ సంస్థకు చెల్లిస్తారు. బయోమెట్రిక్‌ పరికరాలను అమర్చడంతోపాటు హాజరు డేటాను నిల్వ చేయడం, మరమ్మతులు వస్తే సరి చేయడం లాంటి  పనులు చేసే సంస్థలు మూడు నాలుగింటిని ఎంపిక చేసే బాధ్యతను ప్రభుత్వం ఐటీ శాఖ పరిధిలోని రాష్ట్ర సాంకేతిక సర్వీస్‌ల సంస్థ (టీఎస్‌టీఎస్‌)కు అప్పగించినట్లు చెబుతున్నారు. ‘వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాం. అతి త్వరలో అమలు చేస్తాం’ అని ఓయూ ఉపకులపతి ఆచార్య రవీందర్‌ చెప్పారు.

మార్గదర్శకాలు...నిబంధనలు ఏవి?

ప్రభుత్వం బయోమెట్రిక్‌ హాజరుపై అక్టోబరు 12న ఉత్తర్వులు ఇవ్వగా...అదే నెల 1వ తేదీ నుంచి అమలు చేయాలని అందులో పేర్కొనడం తెలిసిందే. గడిచిన 50 రోజుల్లోనూ ఎప్పుడు ప్రారంభించాలన్న స్పష్టత రాలేదు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఈనెల తొలి వారంలో ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించి డిసెంబరు 1వ తేదీ నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అమలు చేయకుంటే వర్సిటీలకు బడ్జెట్‌, వేతనాలు కూడా నిలిపివేస్తామని కూడా హెచ్చరించినట్లు సమాచారం. అయినా ఒకటో తేదీ నుంచి అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా మార్గదర్శకాలను మాత్రం జారీ చేయలేదు. ‘ఒక వేళ ఆచార్యులు పర్యటనకు లేదా సదస్సులకు వెళ్లినా అప్పుడు హాజరు ఎలా? విధుల్లోనే ఉన్నట్లు ఎవరు ధ్రువీకరించాలి?’ అని ఎన్నో సందేహాలు ఉన్నాయి....వాటిపై సమగ్రంగా మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో కొంత అయోమయం నెలకొంది’ అని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఒకరు తెలిపారు.

ప్రైవేట్‌ కళాశాలల్లో ఎలా?

ప్రైవేట్‌ కళాశాలల్లో అమలు ఎలా అన్నది స్పష్టత లేదు. వారు సొంతంగా పరికరాలు కొనవచ్చా? అద్దె విధానాన్ని పాటించాలా? సేవలందించే సంస్థకు చెల్లించే బిల్లు మొత్తాన్ని యాజమాన్యమే భరించాలా? లేక విద్యార్థుల నుంచి వసూలు చేయాలా? కళాశాలల నుంచి ప్రతిరోజూ హాజరు తెప్పించుకోవాలా? నెలకొకసారా? లాంటి ఎన్నో ప్రశ్నలపై లిఖిత పూర్వక ఆదేశాలు ఇంకా వెలువడలేదు. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్‌ అమలు ప్రక్రియ గాడిన పడేందుకు ఇంకా సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని