Vijay Deverakonda: ఈడీ ఎదుట హాజరైన విజయ్‌ దేవరకొండ

సినిమా నిర్మాణంలో నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంతో చేపట్టిన విచారణలో భాగంగా తెలుగు హీరో విజయ్‌ దేవరకొండ, ఆయన మేనేజర్‌ అనురాగ్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు.

Updated : 01 Dec 2022 11:24 IST

లైగర్‌ పెట్టుబడులపై ఆరా!

ఈనాడు, హైదరాబాద్‌: సినిమా నిర్మాణంలో నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంతో చేపట్టిన విచారణలో భాగంగా తెలుగు హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), ఆయన మేనేజర్‌ అనురాగ్‌ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ సినిమా కొన్ని నెలల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. దాని నిర్మాణానికి అనధికారిక పెట్టుబడులు పెట్టారని, విదేశీ హక్కుల అమ్మకాల సందర్భంగా నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంతో ఈడీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆ సినిమా దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్‌, ఛార్మికౌర్‌లను ఈడీ ఇదివరకే విచారించింది. వారి బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంది. ఈ సినిమాలో నటించిన బాక్సింగ్‌ ప్రపంచ మాజీ ఛాంపియన్‌ మైక్‌ టైసన్‌కు ఎంత డబ్బు చెల్లించారు అన్న కోణంలో ఈడీ విచారణ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోగా నటించినందుకు ఎంత తీసుకున్నారని విజయ్‌ను కూడా ప్రశ్నించినట్లు సమాచారం. ఎంత మొత్తానికి విదేశీ హక్కులు విక్రయించారు, ఆ డబ్బు ఎలా రాబట్టారు అన్న వివరాలు ఆరా తీశారు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి వచ్చిన విజయ్‌, ఆయన మేనేజరును రాత్రి 8 గంటల వరకు విచారించారు. విచారణకు హాజరైన అనంతరం విజయ్‌ దేవరకొండ విలేకరులతో మాట్లాడారు. ‘‘లైగర్‌ సినిమా గురించి ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. మనకు వచ్చే పాపులారిటీ వల్ల కొన్ని సమస్యలు, మీరు(అభిమానులు) చూపించే అభిమానం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. వాటిలో ఇదొకటి. మళ్లీ రావాలని అధికారులు చెప్పలేదు’’ అని విజయ్‌ దేవరకొండ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు