కరెంటు ఛార్జీలు పెరగవు

వచ్చే ఏడాది కరెంటు ఛార్జీలు పెరగవు. ప్రస్తుతమున్న కరెంటు ఛార్జీలను పెంచకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో యథాతథంగా కొనసాగించేందుకు అనుమతించాలని రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’ (ఈఆర్‌సీ)ని కోరాయి.

Published : 01 Dec 2022 06:19 IST

లోటు రూ.10,535 కోట్లను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ హామీ
అందుకే యథాతథం
ఈఆర్‌సీకి ఏఆర్‌ఆర్‌ నివేదికలిచ్చిన డిస్కంలు

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఏడాది కరెంటు ఛార్జీలు పెరగవు. ప్రస్తుతమున్న కరెంటు ఛార్జీలను పెంచకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో యథాతథంగా కొనసాగించేందుకు అనుమతించాలని రాష్ట్రంలోని రెండు విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’ (ఈఆర్‌సీ)ని కోరాయి. సంస్థల ఆదాయ, వ్యయాల లెక్కలతో వచ్చే ఏడాదికి ‘వార్షిక ఆదాయ అవసరాల’ (ఏఆర్‌ఆర్‌) నివేదికలను ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంల సంచాలకులు గణపతి, స్వామిరెడ్డిలు బుధవారం ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావుకు అందజేశారు. రెండు సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ.10,535 కోట్లు ఉంటుందని అంచనా వేశాయి. ఈ లోటు పూడ్చేందుకు నిధులు సమకూరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినందున  ప్రస్తుతమున్న ఛార్జీలనే వచ్చే ఏడాది యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించామని ఈఆర్‌సీకి తెలిపాయి. ఇందుకు అనుమతి ఇవ్వాలని విన్నవించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కరెంటు ఛార్జీల సవరణ నివేదికను తప్పనిసరిగా ఏటా నవంబరు 30కల్లా ఈఆర్‌సీకి అందజేయాలని విద్యుత్‌ చట్టంలో నిబంధన ఉంది. సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య ఆర్థికలోటు భారీగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందనే భరోసాతో ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదనలు ఇవ్వలేదని శ్రీరంగారావు మీడియా సమావేశంలో తెలిపారు. ఏఆర్‌ఆర్‌ ఆధారంగా కరెంటు ఛార్జీలు పెంచడానికి డిస్కంలు ప్రతిపాదనలు ఇవ్వకున్నా, ఎప్పటికప్పుడు పెరిగే ఇంధన ఛార్జీల సర్దుబాటుకు నెలకోసారి గరిష్ఠంగా యూనిట్‌కు 30 పైసల వరకూ వచ్చే ఏప్రిల్‌ నుంచే పెంచుకోవడానికి ఇటీవల ముసాయిదా ఉత్తర్వులు జారీచేశామని, వాటిలో ఎలాంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ఏఆర్‌ఆర్‌ నివేదికల్లోని ముఖ్యాంశాలను ఆయన వివరించారు.

* రెండు డిస్కంలకు కలిపి వచ్చే ఏడాది మొత్తం వ్యయం రూ.54,058 కోట్లు ఉంటుందని అంచనా. కానీ ఆదాయం రూ.43,523 కోట్లు మాత్రమే వస్తుందని, మిగిలిన లోటును పూడ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి తీరాల్సిందేనని, ఇవ్వకపోతే కరెంటు ఛార్జీలు పెంచాలా వద్దా అనే అంశంపై ఈఆర్‌సీ ప్రజల సమక్షంలో బహిరంగ విచారణ జరిపి వచ్చే మార్చి ఆఖరులోగా తీర్పు చెబుతుందని శ్రీరంగారావు స్పష్టం చేశారు.

* రాష్ట్రంలో వచ్చే ఏడాది ఒక యూనిట్‌ ‘సరఫరాకు సగటు వ్యయం’ (ఏసీఎస్‌) రూ.7.34 అవుతుందని డిస్కంలు తెలిపాయి. ప్రస్తుత ఏడాది (2022-23)లో అది రూ.7.03 మాత్రమేనని ఈఆర్‌సీ గతంలో ఆదేశాలిచ్చిందని ఆయన గుర్తుచేశారు. వచ్చే ఏడాదికి యూనిట్‌కు ఏసీఎస్‌ ఏకంగా 31 పైసలు పెరగనుందని డిస్కంలు అందజేసిన నివేదికలను ప్రజల ముందు ఉంచి బహిరంగ విచారణ చేసి వాస్తవ ఏసీఎస్‌ ఎంత ఉంటుందని ఈఆర్‌సీ నిర్ణయిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
* వచ్చే ఏడాది మొత్తం 83,113 మిలియన్‌ యూనిట్ల (మి.యూ) కరెంటు కొనాల్సి ఉంటుందని, ఇందులో రాష్ట్ర అవసరాలకు 73,618 మి.యూ.ల సరఫరా చేయాల్సి ఉంటుందని డిస్కంల అంచనా. సరఫరా చేయగా మిగిలేది పంపిణీ, సరఫరా వ్యవస్థలో నష్టపోనున్నట్లు డిస్కంలు తెలిపాయి.

* వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షన్లు ఇచ్చే ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద తప్పనిసరిగా మీటర్ల ఏర్పాటుకు 2024 డిసెంబరు వరకు గడువు నిర్ణయించారు.

* నెలకు 500 యూనిట్లకు పైగా కరెంటు వాడుకుంటున్న వినియోగదారుల కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌మీటర్లు పెట్టాలి.

* వచ్చే ఏడాది మొత్తం కరెంటు వినియోగంలో పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లకు వాడేది వరసగా 13.75 శాతం, 15.07 శాతం ఉండవచ్చు.

* రాష్ట్ర ప్రజల తలసరి వార్షిక కరెంటు వినియోగం 2021-22లో 2126 యూనిట్లుగా రికార్డు నమోదైంది. జాతీయ తలసరి సగటు వినియోగం 1255 యూనిట్లు.

* రాష్ట్రంలో ఒకరోజు అత్యధిక కరెంటు డిమాండు 2022 మార్చి 29న 14,160 మెగావాట్లుగా రికార్డు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని