నిఖత్‌, శ్రీజలకు అర్జున

తెలంగాణ యువ క్రీడాకారిణులు నిఖత్‌ జరీన్‌ (బాక్సింగ్‌), ఆకుల శ్రీజ (టీటీ) అర్జున అవార్డులు అందుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డులు బహూకరించారు.

Published : 01 Dec 2022 03:06 IST

ఖేల్‌రత్న స్వీకరించిన శరత్‌

దిల్లీ: తెలంగాణ యువ క్రీడాకారిణులు నిఖత్‌ జరీన్‌ (బాక్సింగ్‌), ఆకుల శ్రీజ (టీటీ) అర్జున అవార్డులు అందుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డులు బహూకరించారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’’ను టేబుల్‌ టెన్నిస్‌ దిగ్గజం శరత్‌ కమల్‌ స్వీకరించారు. ఈ అవార్డుతో పాటు రూ.25లక్షల నగదు బహుమతి, ఓ పతకం, గౌరవ పత్రాన్ని ఆయన అందుకున్నారు. నిఖత్‌, శ్రీజ సహా ఈ ఏడాది 25 మంది అర్జున అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. వీరిలో షట్లర్లు హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌, లక్ష్యసేన్‌, అథ్లెట్లు ఎల్దోస్‌, అవినాశ్‌ తదితరులున్నారు. వీరు పురస్కారంతో పాటు రూ.15 లక్షల చొప్పున నగదు బహుమతి, జ్ఞాపిక, గౌరవ పత్రాలను స్వీకరించారు. ఈ ఏడాది కామన్వెల్త్‌ క్రీడల్లో శరత్‌ మూడు స్వర్ణాలు, ఓ రజతం గెలిచిన విషయం విదితమే. మనిక బత్రా తర్వాత ఖేల్‌రత్న పురస్కారం స్వీకరించిన రెండో టీటీ ప్లేయర్‌గా శరత్‌ నిలిచారు. ద్రోణాచార్య సహా ఇతర క్రీడా పురస్కారాలనూ రాష్ట్రపతి ప్రదానం చేశారు. ద్రోణాచార్య జీవిత కాల పురస్కారానికి టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోచ్‌ దినేశ్‌ జవహర్‌, బిమల్‌ ప్రఫుల్లా (ఫుట్‌బాల్‌), రాజ్‌ సింగ్‌ (రెజ్లింగ్‌) ఎంపికైన సంగతి తెలిసిందే. ద్రోణాచార్య రెగ్యులర్‌ అవార్డులను జీవన్‌జోత్‌ సింగ్‌ (ఆర్చరీ), మహమ్మద్‌ అలీ ఖమర్‌ (బాక్సింగ్‌), సుమ సిద్ధార్థ్‌ (పారా షూటింగ్‌), సుజీత్‌ మాన్‌ (రెజ్లింగ్‌) సొంతం చేసుకున్నారు. ధ్యాన్‌చంద్‌ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అశ్విని అక్కుంజి (అథ్లెటిక్స్‌), ధరమ్‌వీర్‌ సింగ్‌ (హాకీ), బీసీ సురేష్‌ (కబడ్డీ), నీర్‌ బహదూర్‌ గురుంగ్‌ (పారా అథ్లెటిక్స్‌) దక్కించుకున్నారు. రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కారాన్ని ట్రాన్స్‌స్టేడియా ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ (కేఐఐటీ), లద్దాఖ్‌ స్కీ అండ్‌ స్నోబోర్డు సంఘాలు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు. నిఖత్‌, శ్రీజలను ఈ కార్యక్రమానికి హాజరైన శాట్స్‌ ఛైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి అభినందించారు. ఇలాంటి గుర్తింపు తనలాంటి యువ క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తోందని ఈ సందర్భంగా శ్రీజ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని