మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌, తెరాస రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు.

Published : 01 Dec 2022 04:47 IST

సీబీఐ అధికారినంటూ మోసం చేసిన వ్యక్తి కేసులో విచారణ

ఈనాడు- హైదరాబాద్‌, కరీంనగర్‌ : రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌, తెరాస రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు. సీబీఐ అధికారినంటూ పలువురిని మోసగించి ఇటీవలే పట్టుబడిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి కేసు విచారణలో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఎంపీకి హైదరాబాద్‌లోని తన నివాసంలో నోటీసులు ఇవ్వగా.. కరీంనగర్‌లో మంత్రి అందుబాటులో లేకపోవడంతో గంగుల కమలాకర్‌ అన్న కుమారుడికి నోటీసులు అందించారు. ఇరువురు నేతలు విచారణకు హాజరయ్యేందుకు గురువారం దిల్లీ వెళ్లనున్నారు. పది రోజుల కిందట హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌కు శ్రీనివాస్‌ పరిచయమైనట్లు సమాచారం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు సాక్షులుగా కొందరికి తాఖీదులు అందించినట్లు తెలిసింది. ఈ విషయమై మంత్రిని ‘ఈనాడు’ సంప్రదించగా నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఇటీవల వారికి పట్టుబడిన వ్యక్తి ఓ కార్యక్రమంలో తనను కలిశాడని.. అతనెవరో తనకు తెలియదని.. విచారణకు పిలవడంతో  దిల్లీకి వెళ్తున్నానని చెప్పారు. మరో వైపు ఈ నెల 9న కరీంనగర్‌కు వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు మంత్రి గంగుల ఇంట్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రానైట్‌ వ్యాపారంలో నిబంధనలకు విరుద్ధంగా సరకు ఎగుమతి విషయంలో మంత్రి కుటుంబసభ్యులకు చెందిన సంస్థలపై ఈ దాడులను జాతీయ దర్యాప్తు సంస్థలు నిర్వహించాయి. రెండ్రోజుల కిందట గంగుల సోదరుడు కూడా హైదరాబాద్‌లో ఈడీ విచారణకు హాజరయ్యారు. తాజాగా మంత్రి ఇంటికి సీబీఐ అధికారులు రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని