నిందితుల బెయిలుపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్‌ సతీష్‌ శర్మ, కోరే నందకుమార్‌, డీపీఎస్‌కేవీఎన్‌ సింహయాజిల బెయిలు మంజూరుపై వివరణ ఇవ్వాలంటూ సిట్‌కు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 01 Dec 2022 04:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్‌ సతీష్‌ శర్మ, కోరే నందకుమార్‌, డీపీఎస్‌కేవీఎన్‌ సింహయాజిల బెయిలు మంజూరుపై వివరణ ఇవ్వాలంటూ సిట్‌కు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిలు మంజూరు చేయాలంటూ నిందితులు ముగ్గురు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లపై జస్టిస్‌ చిల్లకూరు సుమలత విచారణ చేపట్టారు. దీనిపై వివరణ సమర్పించడానికి వారం గడువు కావాలని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోరగా పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ బెయిలు పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందని, త్వరితగతిన పరిష్కరించాలని కూడా సూచించిందన్నారు. దీనిపై ఏపీపీ స్పందిస్తూ సుప్రీం కోర్టు చెప్పిన 5 రోజులకు ఇక్కడ పిటిషన్‌లు దాఖలు చేశారని, మరో వారంలో ఏమీ జరగదనగా సీనియర్‌ న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేస్తూ నిందితులు జైలులో మగ్గుతున్నారని, కేసులో జాప్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి సిట్‌ వివరణ కోరుతూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.

ఫోన్‌ట్యాపింగ్‌పై ఇంప్లీడ్‌ పిటిషన్‌ కొట్టివేత

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి దర్యాప్తు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌లలో ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ జర్నలిస్టు తంగెళ్ల శివప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి కొట్టివేశారు. ఈ కేసులో పార్టీకాదని, బాధితుడూ కాదని, ఏవైనా అభ్యంతరాలుంటే ప్రత్యేక పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కేసులో ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని, అందువల్ల తన పిటిషన్‌పై విచారణ చేపట్టాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని