‘అంగన్‌వాడీ’ భర్తీలో గందరగోళం!

రాష్ట్రంలో చేపట్టిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 01 Dec 2022 04:47 IST

సూపర్‌వైజర్ల నియామకాలపై విమర్శలు
నిబంధనలు పాటించలేదని అభ్యర్థుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేపట్టిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక జాబితాలో చోటు సంపాదించి ఎక్కువ మార్కులు పొందినా.. తుది జాబితాలో ఎంపికవకపోవడం పట్ల పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామక ప్రకటనలో అంగన్‌వాడీ ఇన్‌స్ట్రక్టర్లకు 5 శాతం రిజర్వేషనును కేటాయించినా.. ఆ మేరకు వారికి పోస్టులు రిజర్వు చేయలేదని, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లను పాటించలేదన్న విమర్శలు వస్తున్నాయి.

మహిళా శిశు సంక్షేమ శాఖలోని 433 అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి గతేడాది నవంబరులో ప్రకటన వెలువడింది. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల్లో అర్హత కలిగిన వారికి పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తుంది. అంగన్‌వాడీ శిక్షణ కేంద్రాల ఇన్‌స్ట్రక్టర్లకు కూడా అవకాశమివ్వాలని నిర్ణయించిన మహిళా శిశు సంక్షేమ శాఖ వారికి 5 శాతం పోస్టులను ప్రత్యేకంగా కేటాయించింది. అర్హులైన ఇన్‌స్ట్రక్టర్లు లేకుంటే వాటిని అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులతో భర్తీ చేస్తామని వెల్లడించింది. అయితే నియామకాల విషయానికి వచ్చేసరికి దాన్ని పాటించలేదు అని అభ్యర్థులు పేర్కొంటున్నారు. సూపర్‌వైజర్ల నియామకాలకు గత జనవరిలో నిర్వహించిన రాతపరీక్షకు 16,815 మంది హాజరవగా.. మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. న్యాయవివాదాల కారణంగా తుదిఎంపికలో జాప్యం చోటుచేసుకుంది. ఆ వివాదాలు పరిష్కారమవడంతో ఇటీవలనే నియామకాల ప్రక్రియ ముగిసింది. అయితే, తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు పోస్టులు వచ్చాయని, దివ్యాంగుల ఎంపికలో సమన్యాయం జరగలేదని కొందరు శిశు సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఉద్యోగ ప్రకటనలో స్పష్టత ఏదీ...?

కొన్ని వర్గాలకు ప్రత్యేకంగా పోస్టులను రిజర్వు చేసినపుడు భర్తీ విధానాన్ని ఉద్యోగ ప్రకటనలో స్పష్టంగా పేర్కొనాలి. ఆయా పోస్టులను కేటగిరీ వారీగా రిజర్వు చేయాలి. నిబంధనల ప్రకారం ఉద్యోగ ప్రకటనలో ప్రత్యేక రిజర్వేషన్లు అంటూ ఉండవు. రిజర్వేషన్లు కల్పించిన సందర్భంలో ఆ పోస్టులను రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు నష్టం జరగకుండా వాటిని ఓపెన్‌ జనరల్‌ కింద పేర్కొనాలి. అయితే అధికారులు ఈ నిబంధనలు పాటించలేదని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. పోలీసు నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్ల అభ్యర్థుల ఎంపిక వివరాలను ఆ ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని విభాగాల వారికి ప్రత్యేకంగా వెయిటేజీ మార్కులు ఇస్తూ భర్తీ చేస్తున్నారు. శిశు సంక్షేమ శాఖలో మాత్రం ఈ నిబంధనలు పాటించలేదని, దీంతో అవకాశాలు కోల్పోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల కేటగిరీలోనూ తమకు అన్యాయం జరిగిందని అధికారులకు కొందరు వినతిపత్రాలను అందించారు.

నిబంధనలకు లోబడే..

అంగన్‌వాడీ సూపర్‌వైజర్ల నియామకాల విషయమై వచ్చిన ఆరోపణపై మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ‘ఈనాడు’ సంప్రదించగా... నిబంధనల ప్రకారమే పారదర్శకంగా భర్తీ చేశామన్నారు. ప్రాథమిక ఎంపిక జాబితాలోని అభ్యర్థుల విద్యార్హత పత్రాలు పరిశీలించి అనర్హులను తొలగించామని, వీరి స్థానంలో స్థానిక అభ్యర్థులకు న్యాయం చేశామన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాలు, వైద్య మండలి ధ్రువీకరించిన దివ్యాంగుల పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకుని తుది నియామకాలు చేపట్టామని వివరించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని