అవినీతిని అడ్డుకున్నందుకే నాపై కుట్రలు

సీఎస్‌ఐ మెదక్‌ డయాసిస్‌లో అవినీతిని అడ్డుకున్నందుకే తనను సస్పెండ్‌ చేశారని మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ ఏసీ సాల్మన్‌రాజు తెలిపారు.

Published : 01 Dec 2022 04:34 IST

సినాడ్‌ నిబంధనల ప్రకారం బిషప్‌గా కొనసాగుతున్నా: సాల్మన్‌రాజు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సీఎస్‌ఐ మెదక్‌ డయాసిస్‌లో అవినీతిని అడ్డుకున్నందుకే తనను సస్పెండ్‌ చేశారని మెదక్‌ డయాసిస్‌ బిషప్‌ ఏసీ సాల్మన్‌రాజు తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఇప్పటికీ తానే బిషప్‌గా కొనసాగుతున్నానన్నారు. ఎవరికీ కొత్తగా ఛార్జ్‌ ఇవ్వలేదని స్పష్టం చేశారు. బుధవారం సికింద్రాబాద్‌లోని డయాసిస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డయాసిస్‌లో కొందరు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటిని అడ్డుకుంటున్నందుకు తన అడ్డు తొలగించుకోవాలని పన్నాగాలు పన్నుతున్నారన్నారు. సినాడ్‌లో మోడరేటర్‌ వయసు 65ఏళ్లలోపు ఉండాల్సి ఉన్నా దాన్ని 70ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారని, దాన్ని వ్యతిరేకించడంతో తనపై కక్ష కట్టారని తెలిపారు. 2016 నుంచి సీఎస్‌ఐ మెదక్‌ డయాసిస్‌ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తూ వచ్చినా ఏది నిరూపణ కాలేదన్నారు. డిచ్‌పల్లి, రామాయంపేట భూముల్లో రూ.2 కోట్లు తీసుకున్నానని అసత్య ప్రచారం చేశారని, దీనిపై సినాడ్‌ విచారణ జరిపి అది అబద్ధమని తేల్చిందని చెప్పారు. ఇప్పటివరకు తనకు వ్యక్తిగతంగా సస్పెన్షన్‌ ఆర్డర్‌ అందలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని