తుషార్‌ను అరెస్ట్‌ చేయొద్దు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో భారత్‌ ధర్మ జనసేన (బీడీజేఎస్‌) అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లిని అరెస్ట్‌ చేయరాదంటూ సిట్‌కు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 01 Dec 2022 04:34 IST

విచారణకు ఆయన హాజరు కావాలి
హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో భారత్‌ ధర్మ జనసేన (బీడీజేఎస్‌) అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లిని అరెస్ట్‌ చేయరాదంటూ సిట్‌కు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నోటీసు అందుకున్న తుషార్‌ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)ను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ కేరళకు చెందిన బీడీజేెఎస్‌ అధ్యక్షుడు తుషార్‌ వెల్లపల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. తుషార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసుతో ఎలాంటి సంబంధంలేకపోయినా సిట్‌ నోటీసు జారీ చేసిందన్నారు. నిబంధనల ప్రకారం సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఎ నోటీసు జారీ చేయడంలేదన్నారు. నోటీసులోనే దేశం విడిచి వెళ్లరాదని, పాస్‌పోర్టు అప్పగించాలని షరతులు విధిస్తున్నారన్నారు. మొదట సాక్షులుగా చెబుతూ నిందితులుగా చేర్చుతున్నారన్నారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో ఒకరి వద్ద పిటిషనర్‌ ఫోన్‌నంబరు లభ్యమైనందున నోటీసు జారీ చేశారన్నారు. సిట్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆధారాలున్నాయని, ఈ కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చుతున్నట్లు చెప్పారు. నోటీసు జారీ చేసినా విచారణకు సహకరించడంలేదన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి విచారణకు హాజరుకావాలని తుషార్‌ను ఆదేశిస్తూ, అరెస్ట్‌ చేయరాదని సిట్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు