ఎమ్మెల్యేలకు ఎర కేసులో వాడీవేడి వాదనలు

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న వ్యవహారంపై బుధవారం హైకోర్టులో వాడీవేడి వాదనలు కొనసాగాయి.

Updated : 01 Dec 2022 06:12 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న వ్యవహారంపై బుధవారం హైకోర్టులో వాడీవేడి వాదనలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారని ప్రభుత్వ, సిట్‌ తరఫు న్యాయవాది పేర్కొనగా.. 104 మంది మెజార్టీ ఉండగా.. ముగ్గురితో ఎలా సాధ్యమవుతుందని నిందితుల తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలను కూల్చి సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఒకరంటే... రాజకీయ ప్రయోజనాలతో దురుద్దేశపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని మరొకరు వాదించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ భాజపా తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డితో పాటు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లతో పాటు ఇదే కేసుకు సంబంధించిన పిటిషన్‌లపై బుధవారం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి సిట్‌ దర్యాప్తు నివేదికను ప్రభుత్వ తరఫు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే అందజేసి వాదనలు వినిపించారు. నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాది మహేష్‌ జెఠ్మలానీ వాదించారు.

ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం: దుష్యంత్‌ దవే

భాజపా జాతీయ పార్టీ. ఇది రాష్ట్ర పార్టీలను లక్ష్యంగా చేసుకొని వాటికి ఉనికి లేకుండా చేస్తోంది. మనది రాష్ట్రాల సమాఖ్య. జాతీయ పార్టీతో పాటు ప్రాంతీయ పార్టీలుంటాయి. వాటి హక్కులు వాటికి ఉంటాయి. తమ ఉనికి ప్రమాదంలో పడినపుడు ప్రాంతీయ పార్టీలు పోరాటం చేస్తాయి. ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం సమాఖ్య వ్యవస్థకు అవమానం. రాజ్యాంగపరంగా, నైతికంగా ఇది తీవ్రమైన అంశం. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి అక్టోబరు 26న కేసు నమోదు చేయగానే భాజపా 27న కోర్టుకు వచ్చింది. పార్టీ పేరు నిందితుల జాబితాలో లేదు. ఓవైపు నిందితులతో తమకు సంబంధంలేదంటూనే వారికి ప్రయోజనం కలిగించేలా ఇక్కడ పిటిషన్‌లు దాఖలు చేస్తోంది. ఈ కేసుతో సంబంధంలేదంటే.. అదే విషయాన్ని కింది కోర్టులో తేల్చుకోవచ్చు.

ప్రత్యామ్నాయాలుండగా నేరుగా ఈ కోర్టును ఆశ్రయించారు. ప్రారంభ దశలోనే దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించడం సరికాదు. ఇలాంటి పిటిషన్‌లను ఆదిలోనే పక్కన పడేయాలి. భాజపా ఎన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిందో ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలను ఛార్టడ్‌ ఫ్లైట్‌లలో తీసుకెళ్లి, స్టార్‌ హోటళ్లలో ఉంచి ప్రభుత్వాలను కూల్చివేసిన విషయం అందరికీ తెలిసిందే. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గోవాల్లో పార్టీలకు మెజారిటీ ఉన్నా ప్రభుత్వాలు కూలిపోయాయి. తిరిగి తిరిగి ఇదే పని కొనసాగిస్తున్నారు. 2014-2019 ఎన్నికల మేనిఫెస్టోలో అవినీతిని రూపుమాపుతామని చెప్పి ఇప్పుడు వాళ్లే ప్రోత్సహిస్తున్నారు. ప్రతిపక్షాలకు చెందినవారిని సీబీఐ, ఈడీలతో అరెస్ట్‌ చేయిస్తున్నారు. మహారాష్ట్ర, దిల్లీల్లో ఇదే జరిగింది. పత్రికలు మౌనంగా ఉంటున్నాయి. ఇప్పుడు కోర్టులే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రభుత్వాల్ని కూలదోస్తున్నవారిపై కేసు పెడితే కోర్టులకు వస్తున్నారు. 45 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉంటూ సీబీఐతో సహా చాలా దర్యాప్తు సంస్థల్ని చూశాను. తెలంగాణలోని సిట్‌ విచారణ అద్భుతంగా జరుగుతోంది. ఇంత శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తున్న సంస్థను చూడలేదు. సిట్‌ దర్యాప్తుపై ప్రభుత్వ ప్రభావమేమీ లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ముఖ్యమంత్రి సమాచారం పంపి ఉండకూడదని అన్నాను. వారి ఉనికిని రక్షించుకోవడానికి ఇలా చేశారు. వాళ్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారినపుడు పోరాటం చేయాల్సిందే. ఇక్కడ ముఖ్యమంత్రి అదే చేస్తున్నారు. రాజకీయ పార్టీగా యుద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేస్తున్నారు. దీన్ని ఎలా తప్పుపడతారు. చాలా సందర్భాల్లో దర్యాప్తు సంస్థలే సమాచారాన్ని బయటపెడుతుంటాయి. బాలీవుడ్‌ నటి ఈడీ కేసుకు సంబంధించి సమాచారం బయటికి వస్తుండేది. దర్యాప్తు సంస్థలిచ్చే సమాచారానికి ప్రభుత్వాలకు సంబంధం ఉండదు. జైలులో ఉన్న నిందితులతో పాటు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బి.శ్రీనివాస్‌, తుషార్‌లకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి. నిందితులు ముగ్గురు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో తరచూ కలుస్తూ ఇతర ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రలోభపెట్టారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు ఫాంహౌస్‌లో పథకం ప్రకారం రెడ్‌హ్యాండెడ్‌గా సర్కారు పట్టుకుంది.


ఎన్నికల నేరమే లేదు
మహేష్‌ జెఠ్మలానీ

పిటిషనర్లు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదు. నిందితులపై ఆరోపించిన నేరాలు ఇక్కడ వర్తించవు. ఇక్కడ ఎమ్మెల్యేల ఓటును ఎందుకు కొనుగోలు చేస్తున్నట్లో చెప్పలేదు. ఎవరికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టడానికి కొనుగోలు చేశారు? ఒకరికి అనుకూలంగా ఓటు వేయాలని కొనుగోలు చేశారన్నది లేనందున ఇది ఎలక్ట్రోరల్‌ నేరం కాదు. ఇందులో నేర ఉద్దేశంలేదు. ఆలోచనలేదు. నేరమూ లేదు. పబ్లిక్‌ విధుల నిర్వహణకు ప్రలోభపెట్టాలి. ఇక్కడ ఎలాంటి పబ్లిక్‌ డ్యూటీ లేదు. ఎవరికీ లంచం ఇవ్వలేదు లేదా ఒక పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎవరినీ బలవంతం చేయలేదు. ప్రభుత్వాన్ని కూలదోయడానికి భాజపా పన్నిన కుట్రగా దర్యాప్తు అధికారి చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టగలదు. తెరాసకు అనుకూలంగా ఉండాలన్నది విశ్వసనీయతకు సంబంధించిన అంశం. ప్రలోభపెట్టడం అనైతికమే కానీ, చట్టవిరుద్ధంకాదు. దర్యాప్తు దురుద్దేశంతో కొనసాగుతోంది. ఎఫ్‌ఐఆర్‌లో ఏ రకమైన నేరాన్ని చూపించలేదు. ఎఫ్‌ఐఆర్‌లో ఉంచే సెక్షన్‌లను అవగాహన లేకుండా పోలీసులు నమోదు చేశారు. దీన్ని రాజకీయ అంశంగా మలిచే ఉద్దేశంతో వ్యవహారం నడుస్తోంది. సాక్ష్యాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా దర్యాప్తు బృందం నుంచి ముఖ్యమంత్రికి వెళుతున్నాయి. ఆయన మీడియాకు వెల్లడిస్తున్నారు. దీంతోపాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులకు పంపుతున్నారు. దర్యాప్తు పారదర్శకంగా సాగడంలేదు.


Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు