నియామకాలకు ఓ విధానం లేదా?

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల నియామకాలకు ఏదైనా విధానం ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Published : 02 Dec 2022 04:29 IST

ఖాళీలున్నాయని వారికి ఎలా తెలిసింది? ఎలా దరఖాస్తు చేసుకున్నారు?
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి రిజర్వేషన్‌లు ఉన్నాయా?
టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకంపై హైకోర్టు వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుల నియామకాలకు ఏదైనా విధానం ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఖాళీలున్నాయని వారికి ఎలా తెలిసింది? టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చి తెలుసుకున్నారా, లేదంటే సమీపంలోని పాన్‌ డబ్బాల్లో ఖాళీల గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్నారా అంటూ వ్యాఖ్యానించింది. నిబంధనలకు వ్యతిరేకంగా టీఎస్‌పీఎస్సీ సభ్యుల నియామకం జరిగిందంటూ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. ‘‘సభ్యులపై వ్యక్తిగతంగా ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియామకాలే చట్ట ప్రకారం లేవు. నియమితులైన వారిలో రమావత్‌ ధన్‌సింగ్‌ జీహెచ్‌ఎంసీలో ఈఎన్‌సీగా రిటైరయ్యారు. సుమిత్ర ఆనంద్‌ జెడ్పీ స్కూల్‌లో తెలుగు టీచరు. ఎ.చంద్రశేఖర్‌రావు ఆయుర్వేదిక్‌ డాక్టరు. రవీందర్‌రెడ్డి రిటైర్డు డిప్యూటీ తహసీల్దార్‌. ఆర్‌.సత్యనారాయణ ఎమ్మెల్సీగా సేవలందించారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌లో ఫస్ట్‌ క్లాస్‌ గెజిటెడ్‌ పోస్టుల్లో పని చేసిన వారే అర్హులు’’ అని వివరించారు.

ఇక్కడ ఏదైనా కమిటీ ఉందా?

రాజ్యాంగ పోస్టుల వంటి ఉన్నతస్థాయి నియామకాలు చేపట్టినపుడు అంతే స్థాయిలో కసరత్తు జరగాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నల్సార్‌ వైస్‌ఛాన్సలర్‌ నియామకానికి ఓ కమిటీ ఉందని, అలాగే ఇక్కడ ఏదైనా కమిటీ ఉండి దరఖాస్తులను ఆహ్వానించి పరిశీలించి సిఫార్సు చేసిందా అని ప్రశ్నించింది. ‘‘దరఖాస్తుల ఆహ్వానం ఎలా జరిగింది? దరఖాస్తు ఎలా చేసుకున్నారు? ఎంపిక విధానం ఏమిటి? తెలంగాణ వంటి కొత్త రాష్ట్రంలో అర్హులైనవారు, ఆశావహులు చాలా మంది ఉంటారు. వారికి పారదర్శకంగా అవకాశం కల్పించాల్సి ఉంది. న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం ఉంది. సీనియర్‌ న్యాయవాదుల గుర్తింపునకు నోటీసు జారీ, దరఖాస్తు చేసుకున్నవారితో కమిటీ మాట్లాడటం వంటివి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడా పారదర్శకమైన ఓ విధానం ఉండాలి కదా’’ అని ధర్మాసనం ప్రశ్నించింది.

చట్టబద్ధంగానే నియామకాలు: ఏజీ బి.ఎస్‌.ప్రసాద్‌

జీవో 54 ప్రకారం నియామకాలు జరిగాయని, నిబంధనల్లో అచ్చు తప్పు దొర్లిందని.. అది తప్ప నియామకాలు చట్టబద్ధంగానే జరిగాయని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ తెలియజేశారు. ‘‘కమిషన్‌లో ఖాళీలున్నాయని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. మంత్రి మండలిలో చర్చించి అర్హులైనవారినే నియమించింది’’ అని తెలిపారు. ప్రతివాదులైన సభ్యుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. సభ్యులుగా నియమితులైనవారు తెలంగాణ ఉద్యమంతో సహా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అస్సాం ఉద్యమంలో పాల్గొని నష్టపోయినవారికి ప్రపుల్లకుమార్‌ మహంత ప్రత్యేక రిజర్వేషన్‌లు కల్పించారని, తెలంగాణలో కూడా ఇలాంటి రిజర్వేషన్‌లు ఏవైనా ఉన్నాయా అని అడిగింది. ఏజీ స్పందిస్తూ అలాంటివి లేవని, స్థానిక రిజర్వేషన్‌లు ఉన్నాయన్నారు. మంత్రి మండలిలో చర్చించాక అర్హులైనవారినే నియమించినట్లు చెప్పారు. వాదనల అనంతరం న్యాయస్థానం తీర్పు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని