మంత్రి మల్లారెడ్డి సంస్థల్లో నిధుల మళ్లింపు?

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సంస్థల్లో జరిగిన ఆదాయపన్ను సోదాల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published : 02 Dec 2022 04:00 IST

ఈడీకి లేఖ రాయనున్న ఐటీ అధికారులు!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సంస్థల్లో జరిగిన ఆదాయపన్ను సోదాల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంస్థల్లో నిధులను మళ్లించినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్న నేపథ్యంలో పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌) పరిధిలో దర్యాప్తునకు ఈడీ కూడా రంగంలోకి దిగుతుందని భావిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములు, సన్నిహితుల వ్యాపార సంస్థలు, ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్నుశాఖ అధికారులు మూడు రోజులపాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెద్దమొత్తంలో నగదుతోపాటు పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మల్లారెడ్డి కుటుంబసభ్యులు, సన్నిహితులను పిలిపించి విచారిస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు 50 వరకూ విద్య, వ్యాపార సంస్థలు ఉన్నాయి. విద్యాసంస్థల్లో డొనేషన్లు వసూలు చేశారని, వాటికి లెక్కలు చూపించకుండా ఇతర సంస్థల్లోకి మళ్లించి ఉంటారనేది ఆదాయపన్నుశాఖ అనుమానం. ఈ అంశాన్ని నిగ్గుతేల్చేందుకు దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఈడీకి లేఖ రాసే అవకాశం ఉందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని