కంటి ఇన్‌ఫెక్షన్ల నిర్ధారణకు స్మార్ట్‌ కాంటాక్ట్‌ లెన్స్‌

కళ్లలో ఇన్‌ఫెక్షన్‌ రకాన్ని వేగంగా, సమర్థంగా గుర్తించగల ‘స్మార్ట్‌ కాంటాక్ట్‌ లెన్స్‌’ను భారత్‌, బ్రిటన్‌ శాస్త్రవేత్తల సంయుక్త బృందం తాజాగా అభివృద్ధి చేసింది.

Published : 02 Dec 2022 04:00 IST

లండన్‌: కళ్లలో ఇన్‌ఫెక్షన్‌ రకాన్ని వేగంగా, సమర్థంగా గుర్తించగల ‘స్మార్ట్‌ కాంటాక్ట్‌ లెన్స్‌’ను భారత్‌, బ్రిటన్‌ శాస్త్రవేత్తల సంయుక్త బృందం తాజాగా అభివృద్ధి చేసింది. నివారింపదగిన అంధత్వంపై పోరులో ఇది మానవాళికి అత్యంత ప్రయోజనకరంగా మారనుంది. కళ్లలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల కారణంగా వర్ధమాన దేశాల్లో చోటుచేసుకుంటున్న మరణాలను నివారించేందుకు దోహదపడనుంది. ప్రపంచవ్యాప్తంగా అంధత్వం, దృష్టిలోపాలకు కంటి ఇన్‌ఫెక్షన్లు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సరైన సమయంలో ఇన్‌ఫెక్షన్‌ రకాన్ని పక్కాగా గుర్తించగలిగితే.. బాధితులకు సమర్థ చికిత్స అందించడం వీలవుతుంది. అయితే ఏ తరహా బ్యాక్టీరియా/ఫంగస్‌ సోకడం వల్ల సమస్య తలెత్తిందో తెలుసుకునే ప్రక్రియ ప్రస్తుతం ఆలస్యంగా జరుగుతోంది. నిర్ధారణ పరీక్షల కోసం రోగి కంటి నుంచి పొరలాంటి కొంతభాగాన్ని సేకరించాల్సి వస్తోంది. ఆపై రెండు రోజులకుగానీ సూక్ష్మదర్శిని సాయంతో విశ్లేషణను పూర్తిచేయలేకపోతున్నారు నిపుణులు. ఈ జాప్యానికి తెరదించేలా భారత్‌కు చెందిన ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌, బ్రిటన్‌లోని షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయం, బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు స్మార్ట్‌ కాంటాక్ట్‌ లెన్స్‌ను తయారుచేశారు. దాన్ని వ్యక్తులు ఒక గంట పాటు కంటిలో ధరిస్తే చాలు. దానికి అతుక్కునే సూక్ష్మజీవులను విశ్లేషించడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ రకాన్ని తక్కువ సమయంలోనే సులభంగా నిర్ధారించొచ్చు. సాధారణ ప్రజలు సైతం ఇళ్లలోనే ఉపయోగించుకునేందుకు వీలుగా తమ ఆవిష్కరణను త్వరలో తీర్చిదిద్దనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని