ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిలు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులైన నందకుమార్‌, రామచంద్ర భారతి, సింహయాజిలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.

Updated : 02 Dec 2022 06:03 IST

షరతులు విధించిన హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌; చంచల్‌గూడ, న్యూస్‌టుడే:  ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులైన నందకుమార్‌, రామచంద్ర భారతి, సింహయాజిలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. రూ.3 లక్షల వ్యక్తిగత బాండ్‌తోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. నిందితుల బెయిలు పిటిషన్‌లపై గురువారం జస్టిస్‌ చిల్లకూరు సుమలత విచారణ చేపట్టారు. ‘‘పాస్‌పోర్టులను సీజ్‌ చేయని పక్షంలో వాటిని స్వాధీనం చేయాలి. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదు. దర్యాప్తు అవసరమని సిట్‌ భావించినపుడు హాజరుకావాలి. సాక్ష్యాలను అదృశ్యం చేయడం, తారుమారు చేయడం వంటివి చేయకూడదు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారు వాస్తవాలు వెల్లడించకుండా ప్రలోభపెట్టడం, బెదిరించడం వంటివి చేయరాదు. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదు. అభియోగ పత్రం దాఖలు చేసేదాకా ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సిట్‌ దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలి. ఫోన్‌ నంబరు, మెయిలు అడ్రస్‌, నివాస వివరాలను అఫిడవిట్‌ రూపంలో కింది కోర్టుకు సమర్పించాలి. తర్వాత వీటిలో ఏవైనా మార్పులుంటే తాజా అఫిడవిట్‌ దాఖలు చేస్తూ ఉండాలి’’ అని పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది.

ఫిర్యాదే విచారణార్హం కాదు: పిటిషనర్ల న్యాయవాది రవిచందర్‌

పిటిషనర్లకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఎ కింద నోటీసు కూడా జారీ చేయకుండా అరెస్ట్‌ చేశారని వారి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ తదితరులు వాదనలు వినిపించారు. ‘‘ఫిర్యాదే విచారణార్హం కాదు. అయినా దర్యాప్తు కూడా పూర్తయింది. పిటిషనర్ల వద్ద ఉన్న సమాచారాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. అందువల్ల తారుమారు చేసే అవకాశం లేదు’’ అని వివరించారు.

పోలీసుల ముందే నేరం జరిగింది: ఏపీపీ రమణారావు

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని నిందితులు కూల్చే ప్రయత్నం చేశారని అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఏపీపీ) టి.వి.రమణారావు న్యాయస్థానానికి వివరించారు. ‘‘రామచంద్రభారతికి రెండు కేసుల్లో, నందకుమార్‌కు 10 కేసుల్లో పాత్ర ఉంది. పోలీసుల ముందే నేరం జరిగింది. అలాంటప్పుడు సీఆర్‌పీసీ 41ఎ నోటీసు అవసరంలేదు. అరెస్ట్‌ చేసే అధికారం పోలీసులకు ఉంది. ఎమ్మెల్యేలకు రూ.250 కోట్లు ఇస్తామని చెప్పారు.  ఇందులో మరికొందరి పాత్ర ఉంది. ఇతర అనుమానితులతో నిందితుల కుట్రకు సంబంధించిన అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. వీరికి పలు పాస్‌పోర్టులు, ఆధార్‌కార్డులున్నాయి. అందువల్ల దేశం విడిచి వెళ్లే ప్రమాదం ఉంది’’ అని వివరించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి షరతులు విధిస్తూ బెయిలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నందకుమార్‌ ఉద్యోగి అని, పూచీకత్తును రూ.3 లక్షలు చెల్లించలేరని, తగ్గించాలని న్యాయవాది కోరగా ఏపీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రూ.250 కోట్ల బేరం పెట్టారని, రూ. 3 లక్షలు హామీ సమర్పించలేరా అంటూ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

బెయిలు మంజూరైనా....

నిందితులకు హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో వారిని ఉంచిన చంచల్‌గూడ జైలు వద్ద పోలీసుల హడావుడి కనిపించింది. టాస్క్‌ఫోర్సు, ఎస్‌బీ, శాంతి భద్రతల పోలీసులు జైలు వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కొంత మంది మఫ్టీలో కూడా ఉన్నారు. న్యాయస్థానం బెయిలు మంజూరుచేసినా.. సకాలంలో దానికి సంబంధించిన పత్రాలు సమర్పించకపోవడంతో గురువారం నిందితులు జైలు నుంచి విడుదల కాలేదు. వారిలో ఇద్దరిపై ఇతర కేసులు ఉండటంతో అసలు విడుదలవుతారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు