పాడి పరిశ్రమాభివృద్ధికి విస్తృత చర్యలు: మంత్రి తలసాని

రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి విస్తృత చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

Published : 02 Dec 2022 04:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి విస్తృత చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను రైతులకు ఆదాయవనరుగా తీర్చిదిద్దేందుకు, వారి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతామన్నారు. జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఏజెన్సీ పరిధిలోని సహకార సంస్థల ద్వారా పాడి పెంపకం పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. పాడి పశువుల కొనుగోలు, బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ కేంద్రాలతో పాటు, మార్కెటింగ్‌ సౌకర్యాలు, డెయిరీ పార్లర్లు వంటివాటిని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఛైర్మన్‌ సోమా భరత్‌కుమార్‌, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అథర్‌సిన్హా ఇతర అధికారులతో మంత్రి తన కార్యాలయంలో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జైకా’ పథకంలో పాడి రైతులను భాగస్వాములను చేస్తామన్నారు. రాష్ట్రంలో పాలశీతలీకరణ కేంద్రాల ఏర్పాటు, మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన, పాడి పశువులకు నాణ్యమైన దాణా ఉత్పత్తికి పటిష్ఠమైన కార్యాచరణ చేపడతామన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా మేలుజాతి పాడి పశువులతో పాటు, రైతులకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో మరిన్ని పార్లర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల మొదటివారంలో రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, జనగామ జిల్లాల్లో ఎంపిక చేసిన 31మంది వ్యవసాయ పారిశ్రామికవేత్తలతో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు విషయమై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు